యువకుడి శరీరంలో గర్భాశయం.. వైద్యులనే విస్మయానికి గురిచేసిన అరుదైన ఘటన
Rare Medical Case in Telangana: తెలంగాణకు చెందిన ఓ యువకుడిని గర్బాశయం ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. మరీ ఇంతకీ డాక్టర్లు ఆపరేషన్ చేసి ఏం చేశారో తెలిస్తే మీరు షాక్కు గురవుతారు.

Rare Medical Case in Telangana: వైద్య రంగంలో అప్పుడప్పుడు చోటుచేసుకునే కొన్ని అరుదైన ఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. సాధారణంగా మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగంగా ఉండే గర్భాశయం ఓ యువకుడి శరీరంలో కనిపిస్తే ఎలా ఉంటుంది.. వినడానికి వింతగా ఉన్నా.. తెలంగాణలో ఇలాంటి అసాధారణ ఘటన వెలుగుచూసింది. సాధారణ ఆరోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్లిన ఓ యువకుడికి శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో వైద్యులు ఊహించని విషయాన్ని గుర్తించారు. అతడి శరీరంలో గర్భాశయం ఉండటాన్ని చూసి వైద్య బృందం సైతం విస్మయానికి గురైంది.
కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడు
వికారాబాద్ జిల్లా పరిధిలోని పరిగిలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. వికారాబాద్ పట్టణానికి చెందిన 17 ఏళ్ల బాలుడు గత పది రోజుల క్రితం కడుపునొప్పి, కుడివైపు వృషణ తిత్తిలో వాపుతో బాధపడుతూ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అతడిని పరీక్షించిన వైద్యులు తొలుత హెర్నియాగా భావించారు. ఈ క్రమంలో డాక్టర్ రాజేందర్ ఆధ్వర్యంలోని వైద్య బృందం శస్త్రచికిత్స నిర్వహించింది. అయితే ఆపరేషన్ సమయంలో వైద్యులకు అనూహ్యమైన విషయం కనిపించింది. బాలుడి శరీరంలో గర్భాశయం ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా పురుషుల్లో ఉండని ఈ అవయవం అక్కడ కనిపించడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. అనంతరం వైద్యుల బృందం శస్త్రచికిత్స ద్వారా ఆ గర్భాశయాన్ని విజయవంతంగా తొలగించింది.
హైదరాబాద్కు పంపిన నమూనా.. నిర్ధారణలో నిజం
శస్త్రచికిత్సలో తొలగించిన గర్భాశయ నమూనాను మరింత స్పష్టత కోసం హైదరాబాద్లోని పరీక్షా కేంద్రానికి పంపించారు. దీనికి సంబంధించిన నివేదిక గురువారం ఆస్పత్రి వర్గాలకు అందింది. పరీక్షల్లో అది గర్భాశయమేనని నిర్ధారణ కావడంతో ఈ అరుదైన వైద్య ఘటనకు సంబంధించిన విషయం స్పష్టమైంది. ఈ బాలుడి వైద్య చరిత్రను పరిశీలిస్తే మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అతడికి పదేళ్ల వయసు ఉన్న సమయంలో వృషణం కిందకు దిగకపోవడంతో అప్పట్లోనే శస్త్రచికిత్స నిర్వహించారు. ఇప్పుడు మరోసారి ఆపరేషన్ సమయంలో గర్భాశయం బయటపడటం వైద్యులను ఆశ్చర్యపరిచింది.
ప్రస్తుతం నిలకడగా యువకుడి ఆరోగ్యం
జన్యుపరమైన మార్పులు, హార్మోన్లకు సంబంధించిన పరిణామాల కారణంగా పురుషుల శరీరంలోనూ గర్భాశయం వంటి అంతర్గత ప్రత్యుత్పత్తి అవయవాలు ఉండే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా కనిపిస్తాయని చెబుతున్నారు. గర్భాశయాన్ని తొలగించిన అనంతరం బాలుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. శస్త్రచికిత్సతో సమస్యను పరిష్కరించినట్లు వైద్యులు తెలిపారు. సాధారణంగా మహిళలకే పరిమితమని భావించే గర్భాశయం ఓ 17 ఏళ్ల యువకుడి శరీరంలో బయటపడటం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అరుదైన ఈ ఘటన వైద్య వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది.



