ప్యారడైజ్ బిర్యానీని రూ.400 కోట్లకు అమ్మేసిన యాజమాన్యం
Paradise Biryani 400 Crore Deal: ప్యారడైజ్ బిర్యానీ.. ప్రపంచవ్యాప్తంగా బిర్యానీ ప్రేమికులకు కేరాఫ్ అడ్రస్.. అలాంటి ప్యారడైజ్ బిర్యానీని యాజమాన్యం రూ.400 కోట్లకు అమ్మేసింది. ఇప్పుడు మరో రూ.100 కోట్లు సమీకరణ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది..

Paradise Biryani 400 Crore Deal: బిర్యానీ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే ప్యారడైజ్.. నగరానికి వచ్చే అతిథులకు బిర్యానీ రుచి చూపించాలన్నా, విదేశాలకు వెళ్లిన హైదరాబాద్ వాసులు స్వస్థలాన్ని గుర్తు చేసుకోవాలన్నా చాలామందికి ముందుగా గుర్తుకొచ్చే పేరు ప్యారడైజ్. దాదాపు ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ బ్రాండ్ ఇప్పుడు మరో కీలక వ్యాపార మలుపు తీసుకుంటోంది. ఒకప్పుడు చిన్న క్యాంటీన్‌గా ప్రారంభమైన సంస్థ.. నేడు దేశవ్యాప్తంగా విస్తరించే స్థాయికి చేరింది. ప్రైవేట్ ఈక్విటీ సంస్థల పెట్టుబడులు, యాజమాన్య మార్పులు, భారీ విస్తరణ ప్రణాళికలతో ప్యారడైజ్ వ్యాపారం కొత్త దిశగా అడుగులు వేస్తోంది.
రూ.400 కోట్లతో కీలకమైన యాజమాన్య మార్పు
ప్యారడైజ్ వ్యాపారంలో అత్యంత కీలకమైన పరిణామం 2022లో చోటుచేసుకుంది. ముంబైకి చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సమారా క్యాపిటల్ ప్యారడైజ్ ఫుడ్ కోర్టులో తన వాటాను పెంచుకుంటూ వచ్చింది. తొలుత 2014లో సంస్థలో పెట్టుబడులు పెట్టిన సమారా.. ఆ తర్వాత క్రమంగా వాటాను పెంచుకుంది. చివరకు ప్రమోటర్ల చేతిలో ఉన్న మిగిలిన 65 శాతం వాటాను సుమారు రూ.400 కోట్లకు కొనుగోలు చేసి పూర్తి యాజమాన్యాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. దీంతో కుటుంబ వ్యాపారంగా ప్రారంభమైన ప్యారడైజ్.. సంస్థాగత పెట్టుబడిదారుల ఆధ్వర్యంలో నడిచే పెద్ద రెస్టారెంట్ బ్రాండ్‌గా మారింది. ఈ మార్పు సంస్థ విస్తరణకు, నిర్వహణలో కొత్త వ్యూహాలకు మార్గం సుగమం చేసింది.
విస్తరణ కోసం మరో రూ.100 కోట్ల నిధుల సమీకరణ
ప్యారడైజ్ ప్రయాణంలో ఇప్పుడు మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా కొత్త రెస్టారెంట్లను ప్రారంభించడం, ఇప్పటికే ఉన్న మార్కెట్లలో వ్యాపారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా సమారా క్యాపిటల్ కొత్త పెట్టుబడిదారులను తీసుకొచ్చింది. సుమారు రూ.100 కోట్ల నిధుల సమీకరణకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా 10 నుంచి 12 శాతం వాటాను కొత్త పెట్టుబడిదారులకు విక్రయించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్యారడైజ్ ఇప్పుడు విస్తరణపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, గురుగ్రామ్ వంటి నగరాల్లో సుమారు 57 ఔట్‌లెట్లు నిర్వహిస్తోంది. రానున్న మూడేళ్లలో మరో 100 రెస్టారెంట్లను ప్రారంభించాలన్నది సంస్థ లక్ష్యం.ఈ ప్రణాళిక అమలైతే ప్యారడైజ్ ఔట్‌లెట్ల సంఖ్య 150 నుంచి 160 వరకు చేరే అవకాశం ఉంది.
రూ.300 కోట్ల ఆదాయం.. రూ.550 కోట్ల బ్రాండ్ లక్ష్యం
ప్రస్తుతం ప్యారడైజ్ వ్యాపారం వార్షికంగా సుమారు రూ.300 కోట్ల ఆదాయం వస్తుంది. కొత్త ఔట్‌లెట్ల ఏర్పాటు, డెలివరీ నెట్‌వర్క్ విస్తరణ, కొత్త నగరాల్లో ప్రవేశం ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని సంస్థ భావిస్తోంది. 2029 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు రూ.550 కోట్ల బ్రాండ్‌గా ఎదగాలన్న టార్గెట్‌ని పెట్టుకున్నట్లు సమాచారం.ఇందుకోసం సంప్రదాయ రెస్టారెంట్ మోడల్‌తో పాటు చిన్న పరిమాణంలోని ఔట్‌లెట్లు, టెక్నాలజీ ఆధారిత కార్యకలాపాలు, ఆన్‌లైన్ ఆర్డర్లపై కూడా దృష్టి సారిస్తోంది.
1953లో చిన్న క్యాంటీన్.. ఇప్పుడు దేశవ్యాప్త బ్రాండ్
ప్యారడైజ్ ప్రస్థానం 1953లో సికింద్రాబాద్‌లోని ఒక సినిమా థియేటర్ వద్ద చిన్న క్యాంటీన్, కేఫ్‌తో ప్రారంభమైంది. అప్పట్లో ఇరానీ చాయ్, సమోసాలు, బిస్కెట్లు విక్రయించే స్థాయి నుంచి క్రమంగా పూర్తి స్థాయి రెస్టారెంట్‌గా ఎదిగింది. అనంతరం హైదరాబాద్ బిర్యానీ, కబాబ్‌లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కాలక్రమంలో నగరంలోని ప్రముఖ ఫుడ్ డెస్టినేషన్‌గా మారింది. పర్యాటకులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు.. ఇలా ఎంతోమంది ప్యారడైజ్ రుచిని ఆస్వాదించారు. హైదరాబాద్ బిర్యానీకి దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంలోనూ ఈ బ్రాండ్ తనదైన పాత్ర పోషించింది. ఎందుకంటే ప్యారడైజ్ అనేది కేవలం ఒక రెస్టారెంట్ పేరు మాత్రమే కాదు. ఎంతోమంది హైదరాబాద్ వాసులకు అది ఒక జ్ఞాపకం.మరి ఈ భావోద్వేగాన్ని దేశవ్యాప్తంగా వ్యాపార విజయంగా మార్చడంలో ప్యారడైజ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.



