Bandi Bhagirath POCSO Case

తెలంగాణలో అత్యంత చర్చకు దారితీసిన బండి భగీరథ్ పోక్సో కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి మేడ్చల్ ప్రత్యేక పోక్సో న్యాయస్థానం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణలో భాగంగా బండి భగీరథ్‌ను మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. జనవరి 28, 2027న స్వయంగా కోర్టుకు హాజరుకావాలని సమన్లు(Bandi Bhagirath POCSO Case) పంపింది. దీంతో ఇప్పటికే పలు మలుపులు తిరిగిన ఈ వ్యవహారంలో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.ఈ ఏడాది మే నెలలో 17 ఏళ్ల బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆమె చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికకు మద్యం తాగించి వేధించడంతో పాటు శారీరకంగా ఇబ్బందులకు గురిచేశారనేది ఫిర్యాదులో పేర్కొర్నారు. తీవ్రంగా పరిగణించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, బాధితురాలి వాంగ్మూలం, ఇతర ఆధారాల ఆధారంగా పోక్సో చట్టంలోని నిబంధనలతో పాటు భారతీయ న్యాయ సంహితకు సంబంధించిన సెక్షన్లను చేర్చారు. ఆధారాల తారుమారుకు సంబంధించిన అభియోగాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. మే 16న భగీరథ్‌ను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.

కేసులో కీలక మలుపులు
దర్యాప్తులో భాగంగా పోలీసులు భగీరథ్‌ను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో ఆయన బీబీఏ పరీక్షలు రాసేందుకు మల్కాజిగిరి కోర్టు వారం రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం సుమారు 55 రోజుల జైలు జీవితం తర్వాత జులైలో తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. బెయిల్ మంజూరు సందర్భంగా న్యాయస్థానం పలు పరిమితులు విధించింది. రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తు(Bandi Bhagirath POCSO Case) సమర్పించడంతో పాటు పాస్‌పోర్టును అప్పగించాలని ఆదేశించింది. బాధితురాలిని, సాక్షులను ఎలాంటి పరిస్థితుల్లోనూ సంప్రదించకూడదని స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు సుమారు 25 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. ఇదే సమయంలో భగీరథ్ తరఫున చేసిన ప్రతిఫిర్యాదు కూడా మరో చర్చకు కారణమైంది. తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పాటు రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్ చేశారనేది ఆయన చేసిన ఆరోపణ. ఈ ఫిర్యాదు ఆధారంగా కరీంనగర్ పోలీసులు నమోదు చేసిన కేసులోనూ విచారణ కొనసాగుతోంది.తన ప్రతిష్ఠకు భంగం కలిగించే కథనాల ప్రచారాన్ని అడ్డుకోవాలని కోరుతూ భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

జనవరి 28పై అందరి దృష్టి
ఇప్పటికే అరెస్టు, రిమాండ్, బెయిల్, ఛార్జిషీట్ వంటి కీలక దశలను దాటిన ఈ కేసులో తాజాగా మేడ్చల్ పోక్సో కోర్టు సమన్లు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జనవరి 28న భగీరథ్ కోర్టుకు హాజరైన తర్వాత విచారణలో ఎలాంటి పరిణామాలు(Bandi Bhagirath POCSO Case) చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.