Grindr App Robbery Gang: ఇప్పటివరకు ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడే ముఠాల గురించి విన్నాం. కానీ హైదరాబాద్‌లో ఓ గ్యాంగ్‌ ఒంటరి మగాళ్లనే టార్గెట్‌గా చేసుకుంది. తాను గేనంటూ.. ఒంటరి మగాడి కోసం ఎదురుచూస్తున్నానంటూ సుతిమెత్తని మాటలతో పరిచయం పెంచుకుని, చివరకు ఇంటికే వెళ్లి దోపిడీకి పాల్పడుతోంది. గ్రిండర్ యాప్‌ను అడ్డాగా చేసుకుని సాగించిన ఈ దందాలో 14 మంది యువకులు బాధితులుగా మారారు. వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పుకోలేరనే ధీమాతో రెచ్చిపోయిన ముఠాకు ఓ బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు చెక్ పెట్టారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

యాప్‌లో పరిచయం.. నమ్మకం కలిగించి వల

ఈ దోపిడీ వ్యవహారానికి ప్రధాన సూత్రధారిగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌కు చెందిన మహ్మద్ ఆరిఫ్‌ను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటూ సినిమాల్లో అసిస్టెంట్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న అతడికి ఓ పరిచయం ద్వారా గ్రిండర్ యాప్ గురించి తెలిసింది. ఈ యాప్ ద్వారా ఒంటరిగా ఉండే పురుషులతో పరిచయాలు పెంచుకుని, వారి నుంచి విలువైన వస్తువులను దోచుకోవచ్చని పథకం వేశాడు. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు మరికొందరిని తనతో కలుపుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తేజావత్ సంతోష్, కర్నూలుకు చెందిన రెడ్డిగారి దినేశ్‌కుమార్‌రెడ్డి, ఖమ్మం జిల్లా ఆరెకోడు తండాకు చెందిన విద్యార్థులు బానోతు విద్యాసాగర్, బానోతు కార్తీక్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఒంటరి పురుషులను ఎంచుకుని దోపిడీలకు పాల్పడటం ప్రారంభించారు.

వీడియో కాల్స్‌తో పరిచయం.. ఆభరణాలపై నిఘా

ముఠా సభ్యులు గ్రిండర్ యాప్‌లో నకిలీ ప్రొఫైళ్లు సృష్టించి, ఇతరులకు మెసేజ్‌లు పంపేవారు. మొదట స్నేహపూర్వకంగా మాట్లాడి ఎదుటివారికి నమ్మకం కలిగించేవారు. ఆ తర్వాత వీడియో కాల్స్ ద్వారా పరిచయాన్ని మరింత పెంచుకునేవారు. ఈ క్రమంలో బాధితుల ఆర్థిక పరిస్థితి, ఒంటరిగా ఉంటున్నారా లేదా అనే విషయాలతో పాటు వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపైనా దృష్టి పెట్టేవారు. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత ఏకాంతంగా కలుద్దామని ప్రతిపాదించేవారు. బాధితులు అంగీకరించగానే వారి ఇళ్లకు వెళ్లి పథకాన్ని అమలు చేసేవారు. బయటకు స్నేహపూర్వకంగా కనిపిస్తూ లోపల మాత్రం దోపిడీకి రంగం సిద్ధం చేసుకునేవారు.

మద్యం పేరుతో మత్తు.. స్పృహ కోల్పోగానే దోపిడీ

బాధితుల ఇళ్లకు వెళ్లేటప్పుడు నిందితులు బీర్ బాటిళ్లను వెంట తీసుకెళ్లేవారు. అక్కడ వారితో కలిసి మద్యం సేవిస్తున్నట్లు నటిస్తూ, బాధితుడి దృష్టిని మళ్లించి బీర్‌లో మత్తు కలిగించే పదార్థం కలిపేవారు. దానిని తాగిన బాధితులు స్పృహ కోల్పోయిన తర్వాత వారి ఒంటిపై ఉన్న బంగారు గొలుసులు, ఉంగరాలు, ఇతర ఆభరణాలను అపహరించేవారు. ఇంట్లో కనిపించే నగదు, ఇతర విలువైన వస్తువులను సైతం వదిలిపెట్టకుండా తీసుకెళ్లేవారు. బాధితులకు స్పృహ వచ్చిన తర్వాత ఆభరణాలు, వస్తువులు కనిపించకపోవడంతో తాము దోపిడీకి గురైనట్లు గుర్తించేవారు. అయితే వ్యక్తిగత పరిచయాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలను బయటకు చెప్పుకోవడానికి కొందరు వెనుకాడినట్లు తెలుస్తోంది.

ఆరు నెలల్లో 20 మందికి పైగా టార్గెట్

పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ ముఠా సుమారు ఆరు నుంచి ఏడు నెలలుగా దోపిడీలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఈ వ్యవధిలో 20 మందికి పైగా వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు 14 మంది బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతో ముఠా అక్రమాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంపై మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో మూడు, సైబరాబాద్ పరిధిలో ఏడు, హైదరాబాద్ పరిధిలో మూడు, విశాఖపట్నంలో ఒక కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు ఇప్పటివరకు దోచుకున్న బంగారు ఆభరణాల బరువు 360 గ్రాములకు పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల నుంచి అపహరించిన సొత్తును వ్యక్తిగత అవసరాలు, విలాసవంతమైన జీవనశైలికి ఖర్చు చేసినట్లు విచారణలో తేలింది.

ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులను గుడ్డిగా నమ్మి ఏకాంతంగా కలిసేందుకు వెళ్లడం ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ముఠా మరెంతమందిని మోసం చేసింది, ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.