హైదరాబాద్ IVF రాకెట్..పేద మహిళలే టార్గెట్..!
Hyderabad IVF racket: హైదరాబాద్ IVF రాకెట్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో పేద మహిళలను తీసుకొచ్చి.. వారి వద్ద నుంచి అండాలు సేకరిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో పలు ఐవీఎఫ్ కేంద్రాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Hyderabad IVF racket: ఆర్థిక ఇబ్బందులు మనిషిని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తాయో చెప్పడానికి హైదరాబాద్‌లో వెలుగుచూసిన అండాల సేకరణ వ్యవహారమే నిదర్శనం. కుటుంబాన్ని పోషించుకోవాలన్న తపన, అనారోగ్యంతో ఉన్న తండ్రికి వైద్యం చేయించాలన్న ఆవేదన, పిల్లల చదువులకు డబ్బులు సమకూర్చుకోవాలన్న ఆరాటం.. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి కథ. పేదరికంతో పోరాడుతున్న మహిళల అవసరాలను ఆసరాగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు.. అండాల దానం పేరుతో అక్రమ దందాకు తెరలేపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులు, మహిళలను డబ్బు ఆశ చూపి హైదరాబాద్‌కు తీసుకొచ్చి, ప్రైవేటు హాస్టళ్లలో ఉంచి వారి నుంచి అండాలను సేకరిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. బయటకు అండాల దానంగా కనిపిస్తున్న ఈ వ్యవహారం వెనుక మహిళల ఆర్థిక బలహీనతలను ఉపయోగించుకున్న పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్థిక కష్టాలే బలహీనత.. అవసరాలే ముఠాకు పెట్టుబడి
ఈ వ్యవహారంలో బాధిత మహిళలను విచారిస్తున్న కొద్దీ హృదయాన్ని కలచివేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు తమ తండ్రి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మరికొందరు కుటుంబాన్ని పోషించుకోవడానికి, ఇంకొందరు పిల్లల చదువుల కోసం అండాలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఆశతో హైదరాబాద్‌కు వచ్చిన మహిళలకు ఇక్కడి పరిస్థితులు చేదు అనుభవాన్ని మిగిల్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన మహిళలకు రూ.50 వేల వరకు ఇస్తామని ఆశ చూపి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. వారి అవసరాలను గుర్తించి, డబ్బు ఆశ చూపి ఈ ప్రక్రియలోకి దింపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఒక్కోక్కరి నుంచి రూ.65 వేల కమీషన్..?
ఈ దందాలో మహిళలను తీసుకొచ్చే ఫెసిలిటేటర్లకు భారీ మొత్తంలో చెల్లింపులు జరిగేలా ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. ఒక్కో మహిళను తీసుకొచ్చినందుకు రూ.65 వేల వరకు చెల్లించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు గుర్తించారు. అంతేకాదు, సేకరించిన అండాల సంఖ్య, వాటి నాణ్యత తగ్గితే ఫెసిలిటేటర్లకు చెల్లించాల్సిన మొత్తంలో సగం కోత విధించేలా నిబంధనలు విధించినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. మహిళల ఆరోగ్యం, వారి పరిస్థితుల కంటే అండాల సేకరణ, వాటి నాణ్యత, సంఖ్యకే ప్రాధాన్యత ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో మరో ఆందోళనకరమైన అంశం మహిళల ఆరోగ్యానికి సంబంధించినది. వైద్యుల పర్యవేక్షణ లేకుండానే మహిళలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు.
12 మంది మహిళలకు విముక్తి కల్పించిన పోలీసులు
బేగంపేటలోని ఓ మహిళా హాస్టల్లో పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి 12 మంది మహిళలను గుర్తించి విముక్తి కల్పించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ మహిళలు ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉంటున్నారనే అంశంపై అధికారులు విచారణ చేపట్టారు. జనవరి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో నిబంధనలకు విరుద్ధంగా 66 మంది మహిళల నుంచి అండాలను సేకరించినట్లు అధికారులు గుర్తించారు. అయితే తనిఖీల సమయంలో కేవలం 47 మంది మహిళలకు సంబంధించిన రికార్డులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. మిగిలిన 19 మంది దాతలకు సంబంధించిన రికార్డులను ఏఆర్టీ బ్యాంక్ దాచిపెట్టినట్లు అధికారుల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. ఈ వ్యవహారంలో సేకరించిన అండాలను హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ఐవీఎఫ్ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అండాల సరఫరాలో ఎవరెవరి పాత్ర ఉంది..? ఏయే కేంద్రాలకు చేరాయి అనే కోణంలో పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతోంది.
ఒయాసిస్ ఫెర్టిలిటీ, సద్గురు హెల్త్‌కేర్ నిర్వాహకులపై మరో ఐదు కేసులు
ఈ వ్యవహారంలో సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్, ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినిక్స్ నిర్వాహకులపై పోలీసులు కొత్తగా మరో ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఎంహెచ్ఓలు ఇచ్చిన వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, మియాపూర్, మహంకాళి, మలక్‌పేట పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కంపెనీ డైరెక్టర్, ఎండీ గెదెల దుర్గారావుతో పాటు డోనర్ ఫెసిలిటేటర్లు అమిత్ శర్మ, నిఖత్ పర్వీన్, దీపిక తదితరులపై కేసులు నమోదయ్యాయి. మదీనాగూడ ప్రధాన కార్యాలయంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ బ్రాండ్ పేరుతో పది రాష్ట్రాల్లో 46 క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెట్‌వర్క్‌లో అండాల సేకరణ, సరఫరాకు సంబంధించిన వ్యవహారాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ రాకెట్‌కు సంబంధించి మల్కాజిగిరి పోలీసులు ఇప్పటివరకు మూడు కేసుల్లో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు.



