అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికై.. వేధింపులకు బలైన యువ క్రికెటర్
Nandini Cricketer Death: క్రికెట్ మైదానంలో మెరిసిన ప్రతిభ.. అర్ధాంతరంగా ముగిసిన జీవితం. బీసీసీఐ అండర్-19 మహిళా జట్టుకు ఎంపికైన 17 ఏళ్ల నందిని. ఇద్దరు యువకుల వేధింపులే ఆత్మహత్యకు కారణమంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ.

Nandini Cricketer Death: వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగయ్యపల్లికి చెందిన నందినికి చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. క్రికెట్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో వికారాబాద్ పట్టణానికి వచ్చింది. మధు కాలనీ సమీపంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ప్రతిరోజూ క్రికెట్ శిక్షణ తీసుకునేది. ఆటపై ఉన్న పట్టుదల, ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగింది. ఇటీవల బీసీసీఐ అండర్-19 మహిళా జట్టుకు ఎంపికై తన ప్రతిభను చాటుకుంది.
ఇద్దరు యువకుల వేధింపులు.. కుటుంబ సభ్యుల ఆరోపణలు
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. అనిల్, కృష్ణ అనే ఇద్దరు స్థానిక యువకులు కొంతకాలంగా నందినిని వేధిస్తున్నారు. వారిలో ఒకరు ప్రేమ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తుండగా, మరొకరు అతనికి సహకరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులతో నందిని తీవ్ర మనోవేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుల పాత్రపై దర్యాప్తు చేపట్టారు.
న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యుల రాస్తారోకో
నందిని మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. తమ బిడ్డ మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు వికారాబాద్ పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నో కష్టాలను అధిగమించి క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నందిని.. అండర్-19 జట్టుకు ఎంపికై భవిష్యత్తుపై ఎన్నో ఆశలు రేపింది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న కలతో ముందుకు సాగుతున్న ఆమె జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడం క్రీడా వర్గాలను, స్థానికులను కలచివేస్తోంది. మైదానంలో పరుగులు తీయాల్సిన యువ క్రీడాకారిణి జీవితం విషాదంగా ముగియడం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.



