Red Rice Benefits: తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మధ్యాహ్నం, రాత్రి భోజనంలో తెల్ల అన్నం తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా ముడి బియ్యం, బ్రౌన్ రైస్, రెడ్ రైస్ వంటి ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రెడ్ రైస్‌లో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్ల కారణంగా దీనిపై ఆసక్తి పెరుగుతోంది. అయితే ఎర్ర బియ్యం నిజంగానే ఆరోగ్యానికి మంచిదా..? డయాబెటిస్ ఉన్నవారు దీనిని తినవచ్చా..? తెలుసుకుందాం.

రెడ్ రైస్‌కు ఎరుపు రంగు ఎందుకు వస్తుంది..?

ఎర్ర బియ్యం ఎరుపు రంగులో ఉండటానికి అందులోని ఆంథోసైనిన్లు కారణం. ఇవి సహజ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. అందుకే రెడ్ రైస్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని చెబుతారు. అయితే ఎర్ర బియ్యం ప్రత్యేకత దాని రంగులోనే కాదు.. అందులో ఉండే పోషకాల్లోనూ ఉంది. బియ్యం గింజపై ఉండే పొట్టు పొరలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఎక్కువగా పాలిష్ చేయని ఎర్ర బియ్యంలో ఈ పోషకాలు కొంతవరకు నిల్వ ఉంటాయి. తెల్ల బియ్యాన్ని తయారు చేసే సమయంలో పై పొరలను తొలగించడం వల్ల అందులోని ఫైబర్, కొన్ని పోషకాలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

రెడ్ రైస్‌లో ఎలాంటి పోషకాలు ఉంటాయి..?

ఎర్ర బియ్యంలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ప్రోటీన్, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు కూడా లభిస్తాయి. అయితే బియ్యం రకం, సాగు ప్రాంతం, పాలిషింగ్ స్థాయిని బట్టి పోషక విలువలు మారుతుంటాయి. డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలంటే చాలాసార్లు భయపడుతుంటారు. అలాంటి వారికి ఎర్ర బియ్యం ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదింపజేసి, ఆహారంలోని కార్బోహైడ్రేట్లు శరీరంలో శోషించుకునే వేగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరగకుండా కొంతవరకు నియంత్రణలో ఉండవచ్చు.

అతిగా తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం..!

ఎర్ర బియ్యం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల అతిగా తింటే కొంతమందికి అజీర్ణం, కడుపు ఉబ్బరం లేదా కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రోజువారీ ఆహారంలో తెల్ల బియ్యానికి ప్రత్యామ్నాయంగా తగిన మోతాదులో మాత్రమే ఎర్ర బియ్యాన్ని చేర్చుకోవడం ఉత్తమం. ఎర్ర బియ్యంలో ఉండే ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు శరీర ఆరోగ్యానికి తోడ్పడతాయి. రక్తహీనత, చర్మం వృద్ధాప్యం, ఎముకలకు సంబంధించిన సమస్యలు, చెడు కొలెస్ట్రాల్, గుండె సంబంధిత సమస్యల విషయంలోనూ రెడ్ రైస్‌పై ఆసక్తి పెరుగుతోంది. దీంతో షుగర్ పేషెంట్లు రెడ్‌రైస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని డైటీషియన్లు చెబుతున్నారు.

మొత్తానికి తెల్ల బియ్యంతో పోలిస్తే తక్కువగా పాలిష్ చేసిన ఎర్ర బియ్యంలో ఫైబర్, సహజ యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. అందువల్ల సమతుల ఆహారంలో భాగంగా తగిన మోతాదులో తీసుకోవడం మంచిది.