వయసుతో సంబంధం లేకుండా విరుచుకుపడుతున్న గుండెపోట్లు!
Heart Strokes Deaths: గుండెపోటు.. ఈ మధ్య కాలంలో చిన్నా.. పెద్దా తేడా లేదు.. ఆడుతూ, పాడుతూ యువత కుప్పకూలిపోతున్నారు. ఒకప్పుడు రాత్రి నిద్రపోతున్న సమయంలో గుండెపోటు వచ్చి చనిపోయారని ఎక్కువగా వినేవాళ్లం. కానీ ఈమధ్యకాలంలో బైక్ మీద, ప్లే గ్రౌండ్లో గుండెపోటుతో మరణిస్తున్నారు.

Heart Strokes Deaths: గుండెపోటు.. కార్డియాక్ అరెస్ట్.. హార్ట్ స్ట్రోక్.. ఒకప్పుడు ఈ పేర్లు వినిపిస్తే యాభై, అరవై ఏళ్లు దాటిన వారికే వస్తాయని అనుకునేవాళ్లం. అందుకే మన పెద్దలు కూడా యాభై ఏళ్లు వచ్చాయంటే చాలు.. కాస్త జాగ్రత్తగా ఉండాలి.. గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదంటూ హెచ్చరించేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు విరుచుకుపడుతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రాణాలను హరిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించిన వాళ్లు.. క్షణాల్లో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
డ్రైవింగ్, ప్లే గ్రౌండ్.. ఆగిపోతున్న గుండెలు
మొన్నటికి మొన్న.. నలభై ఏళ్ల వ్యక్తి స్కూటీపై ఎంతో హాయిగా రహదారిపై వెళ్తున్నాడు. అంతలోనే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో డ్రైవింగ్ చేస్తున్న స్కూటీ మీదే కుప్పకూలిపోయాడు. వెంటనే అంబులెన్స్‌లో వైద్యులు వచ్చి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. చూస్తుండగానే ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. మరోవైపు.. కేవలం 22 ఏళ్ల యువకుడు. పైన బనియన్.. కింద షార్ట్ వేసుకొని ఎంతో ఉత్సాహంగా వాలీబాల్ ఆడుతున్నాడు. అతని ఆటతీరు చూసిన ప్రేక్షకులు ఫిట్నెస్ మామూలుగా లేదంటూ ప్రశంసలు కురిపించారు. కానీ ఆ ఉత్సాహం ఎంతోసేపు నిలవలేదు. రెండు రోజుల తర్వాత అదే ప్లే గ్రౌండ్లో వాలీబాల్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు పరుగెత్తుకొచ్చి నీళ్లు చల్లారు. పిలిచారు.. కదిలించారు.. అయినా ఉలుకూ పలుకూ లేదు. సీపీఆర్ కూడా చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎంతో చలాకీగా ఆడిన యువకుడు ఇక లేడన్న వార్తతో స్నేహితులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇక 35 ఏళ్ల మరో యువకుడు.
జిమ్‌లో కుప్పకూలిన యువకుడు
ఆరు అడుగుల ఆజానుబాహుడు. రోజుకు రెండు గంటల పాటు జిమ్ చేస్తూ.. బరువులు ఎత్తుతూ కండలు తిరిగిన మల్లయోధుడిలా కనిపించేవాడు. ప్రతిరోజూ లాగే జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేశాడు. బరువులు ఎత్తాడు. కానీ ఏమైందో ఏమో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడున్న వారంతా వచ్చి చూసేసరికి అతను ప్రాణాలు కోల్పోయాడన్న వార్త అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. శరీరాన్ని దృఢంగా తీర్చిదిద్దుకున్న వ్యక్తి కూడా గుండెపోటుకు బలికావడం అందరినీ కలచివేసింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మరో ఘటన మరింత విషాదకరం. మయూర్ విహార్‌లోని ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల చిన్నారి గుండెపోటుతో మరణించింది. బయట నుంచి క్లాస్‌రూమ్‌లోకి వచ్చిన చిన్నారి అక్కడే నిల్చుంది. అంతలోనే ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్‌కు గురై ప్రాణాలు కోల్పోయింది. అసలు ఏం జరిగిందో అర్థం కాక వైద్యులు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
అసలు ఎందుకిలా జరుగుతోంది…?
ఒకప్పుడు వృద్ధాప్యంలో కనిపించే గుండె సంబంధిత సమస్యలు ఇప్పుడు చిన్న వయసులోనే ఎందుకు కనిపిస్తున్నాయి..? ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించే యువకులు కూడా ఒక్కసారిగా ఎందుకు కుప్పకూలిపోతున్నారు..? రోజూ వ్యాయామం చేస్తూ ఫిట్‌గా ఉండేవారికి కూడా గుండెపోటు ముప్పు ఎందుకు తప్పడం లేదు..? దీనికి కారణం ఆహారపు అలవాట్లా? మనం నిత్యం తీసుకుంటున్న ఆహారంలో వచ్చిన మార్పులా..? వంట నూనెల వినియోగమా..? లేక మారుతున్న జీవనశైలిలో దాగి ఉన్న ఇతర కారణాలా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. మనం తినే ఆహారం నుంచి వంటగదిలో ఉపయోగించే నూనె వరకు.. మన రోజువారీ అలవాట్ల నుంచి శారీరక శ్రమ వరకు.. ప్రతి అంశం చర్చనీయాంశంగా మారుతోంది. అయితే అసలు కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
రేపు ఏం జరుగుతుందో తెలియడం లేదు
నిన్నటి వరకు మన కళ్లముందు ఉత్సాహంగా తిరిగిన వ్యక్తి.. మరుసటి క్షణమే విగతజీవిగా మారుతున్నాడు. ఆట మైదానంలోనైనా.. జిమ్లోనైనా.. రహదారిపైనైనా.. చివరకు పాఠశాల తరగతి గదిలోనైనా గుండె ఆగిపోతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా పెరుగుతున్న ఈ గుండెపోటుల వెనుక అసలు మిస్టరీ ఏమిటి..? ఆహారపు అలవాట్లే కారణమా.. అన్నది ఇప్పుడు సమాజం ముందున్న పెద్ద ప్రశ్న..



