Ramayanam 1000 Crore Club: బాక్సాఫీస్ వద్ద రామాయణం సినిమా ప్రభంజనం కొనసాగుతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం.. రోజురోజుకూ తన రికార్డుల ఖాతాను పెంచుకుంటోంది. ఓపెనింగ్ డే నుంచే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా, తొలి వారం మొత్తం అదే జోరును కొనసాగించింది. ముఖ్యంగా మొదటి వీకెండ్ తర్వాత కూడా కలెక్షన్లలో ఏమాత్రం తగ్గుదల కనిపించకపోవడం విశేషం. సాధారణంగా ఏ సినిమా అయినా సరే విడుదలైన తర్వాతతో పాటు.. సోమవారం నుంచి సినిమాల వసూళ్లు క్రమంగా తగ్గుతుంటాయి. కానీ రామాయణం మాత్రం అందుకు భిన్నంగా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. సోమవారం నుంచి బుధవారం వరకు వరుసగా మూడు రోజుల పాటు హిందీ చిత్రాల పేరిట ఉన్న పాత రికార్డులను తిరగరాసింది.

ఎనిమిది రోజులు రూ.1000 కోట్లు

వసూళ్ల విషయంలోనూ ఈ సినిమా సరికొత్త మైలురాళ్లను అందుకుంది. విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే దేశీయంగా రూ.300 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి షారుక్ ఖాన్ నటించిన జవాన్ రికార్డుతో సమానంగా నిలిచింది. ఇక ఏడో రోజు ముగిసే సమయానికి అన్ని భాషలను కలిపి ఇండియాలో రూ.500 కోట్ల నెట్ వసూళ్లను దాటడం మరో విశేషం. ఇందులో హిందీ వెర్షన్ వాటానే అత్యధికంగా ఉంది. మొదటి ఏడు రోజుల్లో హిందీ నుంచి ఏకంగా రూ.410 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఎనిమిదో రోజు నాటికి ప్రపంచవ్యాప్త వసూళ్లలోనూ రామాయణం సరికొత్త చరిత్ర సృష్టించింది. వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్లు రూ.1,033.55 కోట్లకు చేరాయి. దీంతో రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి అత్యంత వేగంగా అడుగుపెట్టిన భారతీయ చిత్రాల్లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. పుష్ప-2, ధురంధర్- 2 తర్వాత ఈ ఘనత సాధించిన సినిమాగా నిలిచింది. కేవలం ఏడు రోజుల్లోనే దేశీయంగా రూ.500 కోట్ల మార్కును, ఎనిమిదో రోజుకే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల మైలురాయిని అధిగమించడం ఈ సినిమా జోరుకు నిదర్శనం.

 

బుక్‌మైషోలోనూ రికార్డు స్థాయి బుకింగ్స్

మరోవైపు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్‌లోనూ రామాయణం హవా స్పష్టంగా కనిపించింది. ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో ఒక్క రోజులోనే 16.60 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. మొదటి సోమవారం కూడా ఇదే స్థాయిలో టికెట్ విక్రయాలు నమోదయ్యాయి. ఆ రోజు గంట వ్యవధిలోనే 1.40 లక్షలకు పైగా టికెట్లు బుక్ కావడం విశేషం. వరుసగా నాలుగు రోజుల పాటు రోజుకు 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైన భారతీయ చిత్రాల జాబితాలో ఆరో సినిమాగా ‘రామాయణం’ చోటు సంపాదించింది.

ఓపెనింగ్ వీకెండ్‌లోనూ సరికొత్త ఘనత

అడ్వాన్స్ బుకింగ్స్‌ను కలుపుకొని తొలి వీకెండ్‌లో మొత్తం 54.76 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. హిందీ చిత్రాల చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ టికెట్ విక్రయాలు సాధించిన సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఇలా థియేటర్లలో కలెక్షన్ల నుంచి ఆన్‌లైన్ బుకింగ్స్ వరకు ప్రతి విభాగంలోనూ రికార్డులు సృష్టిస్తూ రామాయణం తన బాక్సాఫీస్ ఆధిపత్యాన్ని చాటుకుంటోంది.