CII Summit in Visakhapatnam: విశాఖపట్నం వేదికగా సీఐఐ సదస్సు అట్టహాసంగా జరుగుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్ సీఐఐ సమ్మిట్‌ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ప్రాంగణానికి చేరుకున్న వారికి థింసా, తప్పెటగుళ్లు, గరగ నృత్యాలు, డప్పుల ప్రదర్శనలతో కళాకారులు ఘనస్వాగతం పలికారు. కళాకారులను సీఎం, కేంద్రమంత్రి, డిప్యూటీ సీఎం ఉత్సాహపరిచారు. వివిధ కళాబృందాల వద్దకు వెళ్లి వారితో ఫొటోలు దిగారు. ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులను కూడా అభినందించారు.

పెవిలియన్‌ను ప్రారంభించిన పీయూష్ గోయల్

అనంతరం పీయూష్ గోయల్, పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో కలిసి ఏపీ పెవిలియన్, ఎంఎస్ఎంఈ పెవిలియన్లను ప్రారంభించారు. డిజిటల్ స్క్రీన్ల ద్వారా రాష్ట్రంలో పంటల సాగు, పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను లోకేశ్ కేంద్రమంత్రికి వివరించారు. వివిధ రంగాల్లో ఏపీ అభివృద్ధి, గ్రోత్ స్టోరీలను చంద్రబాబు వివరించారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్, సోలార్ విద్యుత్ ప్లాంట్ల అభివృద్ధి, దేశాభివృద్ధికి ప్రధాని చేసిన సూచనలను అధికారులు డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌లో పలు స్టాళ్ల గురించి సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌కు వివరించారు. ఈ సందర్భంగా సీఐఐ సమ్మిట్‌లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. తెలంగాణకు చెందిన వ్యక్తి ఫోటో ఇక్కడ ఎందుకు ఉందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశ్నించగా.. అతను తెలుగు వ్యక్తే కదా అని సీఎం చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ సమ్మిట్ ద్వారా సుమారు 141 ఎంవోయూలు కుదుర్చుకోనున్నారు. రూ.12.14 లక్షల కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది.

లోకేశ్‌ వ్యూహం ఏపీకి పెట్టుబడులే.. పెట్టుబడులు.

విశాఖపట్నం వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో మరోసారి మంత్రి నారా లోకేశ్ మార్క్ కనిపించింది. సదస్సు తొలిరోజే రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. రెన్యూ సంస్థ రాష్ట్రంలో మరో రెండు భారీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఏకంగా రూ.29,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం కుదిరింది. దీంతో తొలిరోజు సమావేశాల్లోనే భారీ పెట్టుబడుల ఒప్పందంతో లోకేశ్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నంలో రెన్యూ ఛైర్మన్, సీఈవో సుమంత్ సిన్హాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. లోకేశ్‌తో చర్చల అనంతరం రాష్ట్రంలో మరో రెండు భారీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు సుమంత్ సిన్హా సుముఖత వ్యక్తం చేశారు.

ఏపీకి రూ.29,500 కోట్ల పెట్టుబడులు

ఈ మేరకు మంత్రి సమక్షంలో రెన్యూ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2 గిగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.12,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. అలాగే గ్రీన్ అమ్మోనియా, ఈ-ఫ్యూయల్ ప్రాజెక్టు ఏర్పాటుకు మరో రూ.17,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెన్యూ అంగీకరించింది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ.29,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయి.