YSRCP Internal Survey: రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అయితే ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని, లోపాలను సరిదిద్దుకున్నప్పుడే భవిష్యత్తులో విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. కానీ వైసీపీ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈవీఎంలపై ఆరోపణలు చేసిన పార్టీ, తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాజయానికి రిగ్గింగ్ కారణమంటూ విమర్శలు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో కూటమి పార్టీల మధ్య ఐక్యత కొనసాగినంతకాలం వైసీపీకి రాజకీయంగా సవాళ్లు తప్పవనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీకి చెందిన కొందరు నేతలు చేయించిన అంతర్గత సర్వే కూడా వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది.

స్థానిక ఎన్నికల్లో ఓటమికి నేతలే కారణమా..?

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోవడానికి పార్టీ నేతల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. పలువురు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ఎన్నికల వ్యవహారాలను సీరియస్‌గా తీసుకోలేదని, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంలో విఫలమయ్యారని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. పోటీ చేసిన అభ్యర్థులకు అవసరమైన రాజకీయ, ఆర్థిక సహకారం అందకపోవడంతో వారు ఒంటరిగా మిగిలిపోయారని విశ్లేషించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ అధినేత జగన్ చుట్టూ ఏర్పడిన కోటరీ కారణంగా క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులు ఆయనకు చేరడం లేదని సర్వే నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. జగన్ పర్యటనలకు కృత్రిమ ఏర్పాట్ల ద్వారా జనాన్ని తీసుకురావడం వల్ల పార్టీకి ప్రజల్లో ఉన్న వాస్తవ మద్దతు ఎంత ఉందో అంచనా వేయడం కష్టమవుతోందని సర్వే సంస్థ పేర్కొన్నట్లు సమాచారం.

వైసీపీని దెబ్బతీసిన మెగా డీఎస్సీ వ్యవహారం..!

మెగా డీఎస్సీ విషయంలో జగన్ చేసిన విమర్శలు పార్టీకి ఆశించిన ప్రయోజనం చేకూర్చలేదని సర్వేలో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపికైన సుమారు 16 వేల మంది ఉపాధ్యాయులు, వారి కుటుంబాలపై ఈ అంశం ప్రభావం చూపిందని సర్వే బృందం అంచనా వేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. వైసీపీ సంస్థాగత నిర్మాణంలో ఉన్న లోపాలను కూడా సర్వే బృందం ప్రస్తావించినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం లేకపోవడం, కార్యకర్తలను సమన్వయం చేసే వ్యవస్థ బలహీనపడటం పార్టీకి సమస్యగా మారిందని విశ్లేషించినట్లు తెలుస్తోంది. కేవలం జగన్ వ్యక్తిగత ఇమేజ్‌పైనే ఆధారపడకుండా నియోజకవర్గాల వారీగా నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.

పాదయాత్రతో కంబ్యాక్ సాధ్యమేనా..?

2019 ఎన్నికలకు ముందు జగన్ చేసిన పాదయాత్ర అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యేక ప్రభావం చూపిందని సర్వేలో గుర్తు చేసినట్లు సమాచారం. అప్పట్లో జగన్‌ను కొత్తగా చూడాలనే ఆసక్తి, వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ప్రజల్లో ఉన్న సానుభూతి కూడా పార్టీకి కలిసివచ్చాయని విశ్లేషించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మరోసారి పాదయాత్ర చేస్తేనే పార్టీకి పూర్వ వైభవం వస్తుందనే ఆలోచన సరైనది కాదని సర్వే సంస్థ అభిప్రాయపడినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నిర్మాణంలో మార్పులు అవసరమని సూచించినట్లు సమాచారం. ఈ సర్వే నివేదికను జగన్‌కు అందించేందుకు పార్టీలోని ఓ వర్గం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నివేదికలో ప్రస్తావించిన అంశాలపై అధినేత ఎలా స్పందిస్తారనే విషయంలో ఆ నేతలు ఆలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది.