Vijayasai Reddy New Party: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించింది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు తెరలేపే లక్ష్యంతో విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. పరివర్తన రాజనీతి పార్టీ (PRP) పేరుతో నూతన రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ పేరును ప్రకటించడంతో పాటు నూతన పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుపు, ఆరెంజ్ రంగులతో రూపొందించిన జెండా మధ్యలో శంఖు, చక్రం గుర్తులను పొందుపరిచారు. దేశం కోసం, ధర్మం కోసం రాజకీయ పార్టీని స్థాపించినట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. అయితే ఇది కేవలం మరో రాజకీయ పార్టీ ఏర్పాటు మాత్రమే కాదని, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఉద్యమమని ఆయన తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. ముఖ్యంగా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, యువతకు నాయకత్వ అవకాశాలు కల్పిస్తామన్న ఆయన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


రెండు కుటుంబాల ఆధిపత్యానికి సవాల్: విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను రెండు కుటుంబాలే శాసిస్తున్నాయంటూ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల భవిష్యత్తును రెండు కుటుంబాలే నిర్ణయించాలా అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ రెండు కుటుంబాల నుంచే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు రావాలా అంటూ ప్రశ్నించారు. తండ్రి ముఖ్యమంత్రి అయితే కుమారుడే ముఖ్యమంత్రి కావాలా అని నిలదీశారు. ప్రతి కులంలోనూ నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తులు ఉంటారని, అలాంటి వారిని రాజకీయాల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికి, యువతకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

అధికార, ప్రతిపక్షాలపై ఒకేసారి విమర్శలు

ఏపీలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ తప్పులు చేస్తున్నాయని విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రజలకు సంబంధించిన నిజాలు, లెక్కలు, అవసరాలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. తప్పు ఎవరు చేసినా ప్రశ్నించాల్సిందేనని, ప్రశ్నించడం ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో వ్యక్తులు, కుటుంబాల ఆధిపత్యం కాకుండా ప్రజల అవసరాలు, అభివృద్ధి, జవాబుదారీతనం ప్రధాన అంశాలుగా ఉండాలని ఆయన తన ప్రసంగం ద్వారా సంకేతాలిచ్చారు. అధికారంలో ఉన్నవారినే కాదు, ప్రతిపక్షంలో ఉన్నవారిని కూడా ప్రశ్నించే రాజకీయ సంస్కృతిని తీసుకురావడమే తమ ఉద్దేశమని వెల్లడించారు.

పరివర్తన రాజనీతి పార్టీ లక్ష్యం ఇదే: విజయసాయిరెడ్డి

పరివర్తన రాజనీతి పార్టీ పేరులోని పీఆర్‌పీకి ప్రత్యేకమైన లక్ష్యాన్ని విజయసాయిరెడ్డి వివరించారు. ప్రజల్లో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలను వెలికితీసి, వారిని రాజకీయాల్లో భాగస్వాములను చేయడమే తమ పార్టీ ఉద్దేశమని చెప్పారు. రాజకీయాలు కొందరి కుటుంబాలకో, కొందరి వర్గాలకో పరిమితం కాకూడదని, సామాన్యులకు కూడా నాయకులుగా ఎదిగే అవకాశం ఉండాలని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలని, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే నాయకత్వంలో కొత్త తరానికి ప్రాధాన్యత కల్పించాలని పిలుపునిచ్చారు. దేవదేవుళ్ల సాక్షిగా రాజకీయ పార్టీని ప్రారంభించానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాల్సింది రాజకీయ నాయకులు మాత్రమే కాదని, ప్రజలే ఆ మార్పుకు శ్రీకారం చుట్టాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ ఒక్క నాయకుడి చేతుల్లోనూ లేదని, ఐదు కోట్ల ప్రజల చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలు చైతన్యవంతులై, తమ హక్కుల కోసం నిలబడినప్పుడే నిజమైన రాజకీయ పరివర్తన సాధ్యమవుతుందన్నారు.

“తుఫాను ముందు ప్రశాంతతే.. రాబోయే రోజుల్లో రాజకీయ ప్రకంపనలు”

విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పడు రాజకీయంగా చర్చకు దారితీశాయి. తుఫాను వచ్చే ముందు ప్రశాంతత ఎలా ఉంటుందో, రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లోనూ అలాంటి ప్రకంపనలు చోటుచేసుకోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. పాలకుల అరాచక పాలనపై ప్రజల్లో ఎలాంటి విస్ఫోటనం వస్తుందో భవిష్యత్తులో మీరే చూస్తారని అన్నారు. దుష్ట పరిపాలనకు సవాల్ విసురుతున్నామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలతో కొత్త పార్టీ భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పార్టీల మధ్యే పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనతో మరో రాజకీయ వేదిక తెరపైకి వచ్చింది. మొత్తంగా.. పరివర్తన రాజనీతి పార్టీ ఆవిర్భావంతో ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది.