రాయలసీమ లిఫ్ట్‌తో వైసీపీ–బీఆర్ఎస్ మధ్య పెరుగుతున్న దూరం..!
Rayalaseema Lift YSRCP BRS Rift: ఒకప్పుడు భాయి.. భాయి..ఇప్పుడు బద్ధశత్రువులుగా మారుతున్నారా..? రాయలసీమ లిఫ్ట్‌తో వైసీపీ–బీఆర్ఎస్ మధ్య పెరుగుతున్న దూరం. రాజకీయంగా వేర్వేరు రాష్ట్రాలు.. ఒకప్పుడు విడదీయలేని స్నేహం. ఇప్పుడు స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన రాయలసీమ లిఫ్ట్.

Rayalaseema Lift YSRCP BRS Rift: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. శాశ్వత శత్రువులూ ఉండరు. ఒకప్పుడు ఎంతో సన్నిహితంగా మెలిగిన రాజకీయ పార్టీలు.. పరిస్థితులు మారితే పరస్పరం విమర్శలు చేసుకునే స్థాయికి చేరుకుంటాయి. ఇప్పుడు తెలంగాణలోని బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ మధ్య కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఒకప్పుడు భాయి.. భాయి అంటూ స్నేహపూర్వకంగా సాగిన రెండు పార్టీల ప్రయాణంలో ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చిచ్చు పెడుతోంది. ఈ ప్రాజెక్టు చుట్టూ మొదలైన రాజకీయ వివాదం రెండు పార్టీల మధ్య దూరాన్ని మరింత పెంచేలా కనిపిస్తోంది.
కేసీఆర్, జగన్ మధ్య స్నేహం.. రెండు రాష్ట్రాల మధ్య సాన్నిహిత్యం
తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అధికారంలో ఉన్నారు. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ సంబంధాలు స్నేహపూర్వకంగానే కొనసాగాయి. కేసీఆర్, జగన్ పరస్పరం కలుసుకోవడం, ఒకరిపట్ల మరొకరు మర్యాదపూర్వకంగా వ్యవహరించడం అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రాలు వేరైనా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సాన్నిహిత్యం కొనసాగింది. అయితే కాలక్రమంలో రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోగా, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అధికారంలో లేకపోయినా రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని భావించిన తరుణంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వివాదం కొత్త చర్చకు తెరలేపింది.
రేవంత్ వ్యాఖ్యలతో మొదలైన రాజకీయ దుమారం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కేసీఆర్ హయాంలోనే అనుమతులు లభించాయంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో అసంతృప్తికి కారణమయ్యాయి. ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్ పాత్రను ప్రస్తావిస్తూ రేవంత్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును ఆపాలని కేసీఆర్ అప్పట్లోనే జగన్ ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పారని హరీశ్‌రావు వెల్లడించారు. ప్రాజెక్టును ఆపకపోతే ఆలంపూర్ వద్ద బ్యారేజీ కడతామని హెచ్చరించినట్లు హరీశ్‌రావు గుర్తు చేసుకున్నారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ద్వారా కూడా ప్రాజెక్టును నిలిపివేయాలని కోరినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా చంద్రబాబు విడుదల చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ, జగన్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ రాసిన లేఖల కారణంగానే ప్రాజెక్టు నిలిచిపోయిందని వివరించారు. దీంతో రేవంత్ వ్యాఖ్యలు, హరీశ్‌రావు వివరణల మధ్య రాజకీయంగా వాదోపవాదాలు మొదలయ్యాయి.
జగన్ ఎంట్రీ.. ప్రాజెక్టుపై తన వాదన వినిపించిన మాజీ సీఎం
ఈ వివాదం తెలంగాణ రాజకీయాలకే పరిమితం కాలేదు. మాజీ సీఎం జగన్ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై స్పందించారు. ఈ ప్రాజెక్టు ఉద్దేశాన్ని వివరిస్తూ, రాయలసీమకు అందుబాటులో ఉన్న జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు రూపొందించిన ఇన్సూరెన్స్ స్కీమ్ లాంటిదిగా అభివర్ణించారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 880 అడుగులపైన ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా పూర్తిస్థాయిలో 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించే అవకాశం ఉంటుందని జగన్ వివరించారు. నీటిమట్టం 854 అడుగుల దిగువకు పడిపోతే నీటిని పంపడం సాధ్యం కాదని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలోని వివిధ ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి నీటిని వినియోగించుకునే సామర్థ్యం పెరుగుతున్న నేపథ్యంలో రాయలసీమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు తన వాదనను వినిపించారు. అదే సమయంలో చంద్రబాబు ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కాంగ్రెస్‌తో రాజకీయ సాన్నిహిత్యం కారణంగా మౌనంగా ఉంటున్నారని జగన్ ఆరోపించారు.
వైసీపీ మౌనం.. బీఆర్ఎస్తో దూరం పెరుగుతున్నట్టేనా..?
ఇక్కడే అసలు రాజకీయ ఆసక్తికరమైన అంశం కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నప్పటికీ, వైసీపీ మాత్రం బీఆర్ఎస్పై నేరుగా విమర్శలు చేయడం లేదు. జగన్ మాత్రమే ప్రాజెక్టు వెనుక ఉన్న ఉద్దేశాలను వివరిస్తూ తన వాదనను వినిపించారు. బీఆర్ఎస్తో సంబంధాల విషయంలో వైసీపీ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్న కేసీఆర్, జగన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు రాజకీయంగా పరీక్షకు గురవుతోంది. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు విషయంలో ఎవరి వాదన వారిది అన్నట్టుగా పరిస్థితి మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ తన వాదనను బలంగా వినిపిస్తుండగా, ఏపీలో వైసీపీ తన నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది.
నిన్నటివరకు స్నేహితులుగా కనిపించిన బీఆర్ఎస్, వైసీపీ నేతలు.. రేపు పరస్పరం విమర్శించుకునే రాజకీయ ప్రత్యర్థులుగా మారతారా.. అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు భాయి.. భాయి అన్న రాజకీయ స్నేహం.. రాయలసీమ లిఫ్ట్ పుణ్యమా అని బీటలు వారుతోందా అన్న చర్చ రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో మొదలైంది.



