తమిళ రాజకీయాల్లోకి త్రిష.. ఎంట్రీకి రంగం సిద్ధం..?
Trisha Political Entry: త్రిష పేరుతో ఇప్పుడు తమిళనాడులో స్వచ్చంధ సంస్థ ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై పేరుతో అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేయడం కీలకంగా మారింది.

Trisha Political Entry: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంటోంది. ఇప్పటికే సినీ గ్లామర్‌తో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నేతల చరిత్ర ఉన్న తమిళ గడ్డపై ఇప్పుడు మరో హీరోయిన్ పేరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటి త్రిష రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటివరకు సినిమాలకే పరిమితమైన ఆమె పేరు ఇప్పుడు రాజకీయ వేదికలపై వినిపిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై పేరుతో వేదిక
త్రిష రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారానికి తాజాగా ఆమె అభిమానులు చేపట్టిన కార్యక్రమాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తిరునెల్వేలిలో అభిమానులు ప్రత్యేకంగా సమావేశమై ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై పేరుతో ఓ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంస్థకు సంబంధించిన లోగోను కూడా ఆవిష్కరించారు. రాజగోపాల్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమం తమిళనాడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది.ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దివంగత ముఖ్యమంత్రి జయలలితను తమిళ ప్రజలు పురట్చి తలైవి అని పిలుచుకునేవారు. ఇప్పుడు అదే తరహాలో త్రిషకు ఇళయ పురట్చి తలైవి అనే బిరుదును అభిమానులు కట్టబెట్టారు. జయలలితలో కనిపించిన ధైర్యం, నాయకత్వ లక్షణాలు, ప్రజాదరణ త్రిషలోనూ ఉన్నాయని అభిమాన సంఘం నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ పరిణామం వెనుక కేవలం అభిమానమే ఉందా..లేక భవిష్యత్తు రాజకీయాలకు పునాది వేస్తున్నారా.. అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.
విజయ్‌తో కలిసి రాజకీయ ప్రయాణం..!
తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న విజయ్ నాయకత్వంలోని టీవీకే రాజకీయాల్లో త్రిష పేరు వినిపించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.ఇటీవల విజయ్‌కు సంబంధించిన పలు వ్యక్తిగత, శుభకార్య కార్యక్రమాల్లో త్రిష కనిపిస్తుండటం కూడా ఈ ప్రచారానికి కారణంగా మారింది.అయితే తమిళనాడు రాజకీయ చరిత్రను పరిశీలిస్తే అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాల నుంచి రాజకీయ శక్తులుగా ఎదిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గతంలో విజయ్ కూడా తన అభిమాన సంఘాల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ క్రమంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు త్రిష అభిమానులు కూడా ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడం, అధికారిక లోగోను ఆవిష్కరించడం, ఆమెకు రాజకీయ గుర్తింపును ఇచ్చేలా బిరుదును ప్రచారం చేయడం చూస్తుంటే భవిష్యత్తు రాజకీయాలకు ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ధనుష్, శివకార్తికేయన్, రాఘవ లారెన్స్ వంటి సినీ ప్రముఖుల అభిమాన సంఘాలు కూడా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో త్రిష పేరుతో ప్రత్యేక వేదిక ఏర్పాటు కావడం సహజంగానే రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఉపఎన్నికల్లో పోటీ చేయనున్న త్రిష..?
తమిళనాడులో త్వరలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయనే ప్రచారం నేపథ్యంలో త్రిష రాజకీయ ప్రవేశంపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో ఆమె బరిలోకి దిగుతారంటూ కొన్ని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీవీకేకు చెందిన కొందరు నేతలు కూడా త్రిష పోటీ చేసే అవకాశాలపై మాట్లాడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో త్రిషకు సంబంధించి మరింత ఆసక్తికరమైన ప్రచారం నడుస్తోంది. విజయ్ ప్రభుత్వంలో ఆమెకు కీలక బాధ్యతలు దక్కుతాయని, ఏకంగా హోంశాఖ మంత్రి అయ్యే అవకాశం ఉందంటూ కొందరు టీవీకే మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు. త్రిష పేరు చుట్టూ రాజకీయ చర్చ మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. తమిళనాడు రాజకీయాల్లో సినీ రంగానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత నుంచి ప్రస్తుత విజయ్ వరకు సినిమా నేపథ్యం ఉన్న నేతలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేశారు. ముఖ్యంగా జయలలిత సినీ నటిగా ప్రారంభమైన తన ప్రయాణాన్ని రాజకీయాల్లో అగ్రస్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు అదే సినీ నేపథ్యం ఉన్న త్రిష పేరును అభిమానులు జయలలితతో పోలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది.



