ఆటుపోట్లు.. వెన్నుపోట్లు… కథ మొదలైంది!

వెండితెరమీద హీరోయిజం చూపించినంత సులువు కాదు సీఎంగా ఓ రాష్ట్రాన్ని పాలించడం.. ప్రజలను మెప్పించడం. ఆయనొక్కడే ఆదర్శంగా ఉంటే సరిపోదు, నమ్మి నిలబెట్టిన నాయకులు కూడా ఆయన్ని అనుసరించాలి. డ్రైవర్ కొడుకు కూడా ఎమ్మెల్యే అయ్యాడు. తనకు నచ్చిన, తను మెచ్చినవారందరినీ ఎమ్మెల్యేలను చేశారు. ఇప్పుడు వారే ఆ హీరో పరువుతీస్తున్నారు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్లే ఉంది కొందరు టీవీకే ఎమ్మెల్యేల వ్యవహారం. వ్యవహారం శృతిమించుతోందని అర్ధమయ్యేసరికి తమిళనాడు సీఎం విజయ్ అలర్ట్ అయ్యారు. అర్జంట్ మీటింగ్ పెట్టేసి అందరికీ క్లాస్ పీకారు.
టీవీకే ఎమ్మెల్యేల్లో మూడొంతుల మంది మొహాలు కూడా ఎవరికీ తెలీదు. కేవలం దళపతి ఇమేజ్, హీరోగా విజయ్‌కి ఉన్న ప్రజాకర్షణతోనే తంతే గారెలబుట్టలో పడ్డట్లు ఎమ్మెల్యేలు అయిపోయారు. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న విషయాన్ని కూడా కొందరు మరిచిపోయారు. అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టిన ఈ కొత్తతరం నేతల్లో కొందరు అదుపు తప్పుతున్నారు. అడ్డగోలుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ పరువు తీస్తున్నారు. ఆరునెలల్లోపే విజయ్‌కి తలపోటు తెచ్చిపెడుతున్నారు. దీంతో పాలనకంటే పార్టీ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకోవడమే విజయ్‌కి పెద్ద సవాలుగా మారింది.
టీవీకే ప్రజాప్రతినిధులపై వస్తున్న ఆరోపణలు తమిళనాట కలకలం రేపుతున్నాయి. సమస్యలపై ప్రశ్నించిన ఓ వృద్ధుడిపై ఏకంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ చేయిచేసుకున్నారు. మరో ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేష్ ఓ మహిళా జిల్లా కలెక్టర్‌కే అసభ్యకర మెసేజ్‌లు పంపడం అధికారయంత్రాంగంలో అలజడి రేపింది. కేవలం మెసేజ్‌లతోనే ఆగలేదా ఎమ్మెల్యే. ఏకంగా కలెక్టర్ బంగ్లాకే వెళ్లి వేధింపులకు దిగాడు. ఇలా ఓ పదిమందిదాకా ఎమ్మెల్యేలు అప్పుడే వివాదాల్లోకి చిక్కుకోవటంతో విజయ్ దిద్దుబాటు చర్యలకు దిగారు. మహాబలిపురం రిస్టార్ట్‌లో ఎమ్మెల్యేలను సమావేశపరిచి వన్‌టూవన్ మాట్లాడారు. ఇకపై ప్రతీ ఎమ్మెల్యేపై నిఘా ఉంటుందని సున్నితంగా హెచ్చరించారు. ప్రేమగా మాట్లాడుతూనే పార్టీ పరువు తీయొద్దని పేరుపేరునా అందరినీ కోరుకున్నారు.
ఎమ్మెల్యేలు దారితప్పినా విజయ్ ఎవరిపైనా వేటు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే 234స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో విజయ్ పార్టీకి ఉన్న బలం 108మంది ఎమ్మెల్యేలు మాత్రమే. మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం నడుస్తోంది. మరోవైపు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, టీవీకే ఎమ్మెల్యేల్లో కొందరు లోపాయికారీగా మద్దతిస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ సమయంలో క్రమశిక్షణాచర్యలకు దిగితే డీఎంకే, అన్నాడీఎంకే టీవీకే ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునే ప్రమాదం పొంచి ఉంది. అందుకే బాబ్బాబూ పరువుతీయకండి.. కాస్త బాధ్యతగా ఉండండని విజయ్ బతిమాలుకోవాల్సి వస్తోంది



