Delimitation Commission: దేశ రాజకీయ ముఖచిత్రంలో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతున్నది. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అన్నట్లుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే దిశగా అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం 543 స్థానాలున్న లోక్‌సభను గరిష్ఠంగా 850 స్థానాలకు విస్తరించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ లోక్‌సభ స్థానాలను సమానంగా 50 శాతం మేర పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే దేశ రాజకీయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన..?

డీలిమిటేషన్ ప్రక్రియ ఎప్పుడు చేపడతారన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2026 తర్వాత నిర్వహించనున్న జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టాలన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 మూడో క్లాజుపై బిల్లులో ఎలాంటి చర్చ లేదు. దీంతో 2027లో నిర్వహించే జనగణన డేటా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అన్ని రాష్ట్రాల్లోనూ లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర పెంచుతామని బిల్లులో ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. కొత్త జనాభా లెక్కలను నియోజకవర్గాల సరిహద్దుల నిర్ణయానికి కూడా ఉపయోగించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

డీలిమిటేషన్ కమిషన్‌లో ఎవరెవరు ఉంటారు..?

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను నిర్వహించే డీలిమిటేషన్ కమిషన్‌లో కీలకమైన వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్‌కు సుప్రీంకోర్టు సిట్టింగ్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా కమిషన్‌లో సభ్యుడిగా ఉంటారు. రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. వీరంతా కలిసి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లోక్‌సభ, శాసనసభ స్థానాలను కేటాయించడం డీలిమిటేషన్ కమిషన్ ప్రధాన విధుల్లో ఒకటి. అలాగే లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించడం, వాటి సరిహద్దులను నిర్ణయించడం కూడా ఈ కమిషన్ బాధ్యతే. నియోజకవర్గాల హద్దులను ఖరారు చేసే సమయంలో భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా పరిధి, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో కమిషన్ సభ్యులకు సివిల్ కోర్టుకు సమానమైన అధికారాలు ఉంటాయి.

కమిషన్‌కు ఎంపీలు, ఎమ్మెల్యేల సహకారం

డీలిమిటేషన్ కమిషన్‌కు సహాయ సహకారాలు అందించేందుకు ప్రతి రాష్ట్రం నుంచి ఐదుగురు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలను ప్రతిపాదిస్తారు. ఎంపీల పేర్లను లోక్‌సభ స్పీకర్ సిఫార్సు చేస్తే, ఎమ్మెల్యేల పేర్లను సంబంధిత అసెంబ్లీ స్పీకర్ ప్రతిపాదిస్తారు. అయితే ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కమిషన్ తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకునే అధికారం ఉండదు. కేవలం కమిషన్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికే వీరిని నియమిస్తారు. ఐదు కంటే తక్కువ ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మిగిలిన సభ్యుల స్థానాలను ఎమ్మెల్యేలతో భర్తీ చేస్తారు.

జెట్ స్పీడ్‌లో ప్రక్రియ చేపట్టే యోచన

బిల్లు ఆమోదం పొందిన వెంటనే డీలిమిటేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ స్థానాల పెంపు, రాష్ట్రాల వారీగా సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల సరిహద్దుల నిర్ణయం వంటి అంశాలన్నీ ఈ ప్రక్రియలో కీలకం కానున్నాయి. దీంతో డీలిమిటేషన్ కమిషన్ కూర్పు, దాని విధులు, సభ్యుల పాత్రపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.