కూరగాయల మార్కెట్‌ను తలపిస్తున్న కాంగ్రెస్-ఎస్పీ పొత్తుల బేరం..?
UP Politics: ఉత్తరప్రదేశ్‌లో పొత్తుల పంచాయతీ.. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య కుదరని సీట్ల వ్యవహారం. రాహుల్- అఖిలేష్ మధ్య పెరుగుతున్న గ్యాప్..?.. ఇండియా కూటమిలో అసంతృప్తి..

UP Politics: హలో కాంగ్రెస్ పార్టీ.. త్వరగా పొత్తులు తేల్చండి.. లేకపోతే మనకంటే స్పీడుగా బీజేపీ ముందుకెళ్లిపోతుందంటూ సమాజ్‌వాదీ పార్టీ తొందరపెడుతుంటే.. తీరా సీట్ల పంపకం దగ్గరకు వచ్చేసరికి మాత్రం అసలు సినిమా మొదలైంది. కూరగాయల మార్కెట్లో బేరాలు ఆడినట్లు.. కాంగ్రెస్ ఒక లెక్క చెబితే, సమాజ్‌వాదీ పార్టీ మరో లెక్క చెబుతోంది. మాకు 180 సీట్లు కావాలంటూ కాంగ్రెస్ పట్టుబడితే.. అన్ని సీట్లు ఇచ్చేదే లేదంటూ అఖిలేష్ యాదవ్ తనదైన శైలిలో షాక్ ఇచ్చారు. చర్చలు ఒకసారి ఢిల్లీలో.. మరోసారి లక్నోలో జరిగినా బేరం మాత్రం కొలిక్కి రావడం లేదు. వందకు పైగా సీట్లు ఆశిస్తున్న కాంగ్రెస్‌కు అఖిలేష్ ఇచ్చే ఆఫర్ మాత్రం రెండు అంకెల దగ్గరే ఆగిపోతోంది. దీంతో పొత్తుల చర్చలు పక్కనపెట్టి.. అసలు కాంగ్రెస్‌కు సమాజ్‌వాదీ పార్టీలో ఎంత విలువ ఉందన్న చర్చ మొదలైంది. బీజేపీని ఎదుర్కోవడానికి చేతులు కలపాల్సిన రెండు పార్టీలు.. సీట్ల దగ్గర మాత్రం చేతులు కలపలేకపోతున్నాయి.
ప్రతిపక్ష కూటమి సీట్ల పంచాయతీ..!
ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రతిపక్ష కూటమిలో సీట్ల పంచాయితీ మొదలైంది. బీజేపీని ఎదుర్కోవడానికి కలిసి పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు మాత్రం సీట్ల దగ్గరికి వచ్చేసరికి ఒక అంగుళం కూడా వెనక్కి తగ్గడం లేదు. పైకి రెండు పార్టీల మధ్య స్నేహబంధం కొనసాగుతున్నట్లు కనిపిస్తున్నా.. తెరవెనుక మాత్రం సీట్ల లెక్కలు, రాజకీయ ప్రయోజనాలు, ఆధిపత్య పోరు కొనసాగుతున్నాయి. దీంతో పొత్తు కుదురుతుందా..? లేదా..? అన్న సందేహాలు రాజకీయవర్గాల్లో మొ లేదా? అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి.
131 కావాలంటున్న కాంగ్రెస్.. నో అంటున్న అఖిలేష్
403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ మొదట 181 స్థానాలు కోరినట్లు అఖిలేష్ యాదవ్ స్వయంగా వెల్లడించారు. అయితే ఇన్ని స్థానాలు కాంగ్రెస్‌కు కేటాయించడానికి సమాజ్‌వాదీ పార్టీ సిద్ధంగా లేదన్న సంకేతాలు మొదటి నుంచే కనిపించాయి. మరోవైపు కాంగ్రెస్ మాత్రం గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో సాధించిన ఫలితాలను ప్రస్తావిస్తూ తమకు గౌరవప్రదమైన వాటా ఇవ్వాలని పట్టుబడుతోంది. తొలి విడత చర్చల్లో కాంగ్రెస్ తన డిమాండ్‌ను తగ్గించుకుని 131 స్థానాల్లో పోటీ చేయాలనే ప్రతిపాదనను సమాజ్‌వాదీ పార్టీ ముందు ఉంచినట్లు సమాచారం. అయినప్పటికీ సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కాంగ్రెస్ కోరుతున్న స్థానాలకు, సమాజ్‌వాదీ పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న స్థానాలకు మధ్య భారీ అంతరం ఉండటంతో చర్చలు ముందుకు సాగడం కష్టంగా మారింది.
26 సీట్ల ఆఫర్‌తో అఖిలేష్.. నిప్పులు చెరిగిన కాంగ్రెస్
మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ కాంగ్రెస్‌కు 26 స్థానాలు ఆఫర్ చేసినట్లు వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ వందకు పైగా స్థానాలు ఆశిస్తుంటే.. సమాజ్‌వాదీ పార్టీ మాత్రం అంత పెద్ద సంఖ్యలో సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోవడం రెండు పార్టీల మధ్య విభేదాలను మరింత బయటపెట్టింది.కాంగ్రెస్ నేతలు మాత్రం తమ పార్టీ బలాన్ని, గత ఎన్నికల్లో సాధించిన ఫలితాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఆరు స్థానాలు గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ అఖిలేష్ మాత్రం విన్నింగ్ ఛాన్స్‌నే ఫార్మూలాను తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
రాహుల్-అఖిలేష్ మధ్య దూరం పెరుగుతోందా..?
ఒకవైపు బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష ఐక్యత అవసరమని రెండు పార్టీలు చెబుతున్నాయి. మరోవైపు సీట్ల పంపకం విషయంలో మాత్రం ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. కాంగ్రెస్‌కు గౌరవప్రదమైన వాటా కావాలి. సమాజ్‌వాదీ పార్టీ మాత్రం రాష్ట్రంలో తన రాజకీయ బలాన్ని, నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలను దృష్టిలో పెట్టుకుని సీట్లు కేటాయించాలని భావిస్తోంది. ఈ పరిణామాలు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ మధ్య రాజకీయ సమన్వయంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని ఎదుర్కోవాలనే లక్ష్యంతో మొదలైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల పొత్తు చర్చలు ఇప్పుడు సీట్ల దగ్గరే నిలిచిపోయాయి. 181 నుంచి 131… అక్కడి నుంచి 26 సీట్ల ఆఫర్ వరకు సాగిన ఈ బేరసారాలకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఎంతవరకు సాధ్యమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.



