చహల్‌కు బీజేపీలో కీలక పదవి.. జాట్ ఓట్లపై కమలనాథుల గురి..!
Yuzvendra Chahal political entry: యజువేంద్ర చహల్ బీజేపీలో చేరగానే ఓబీసీ మోర్చా ప్రత్యేక ఆహ్వానితుడిగా నియామకం వెనుక రాజకీయ వ్యూహం.యూపీ, రాజస్థాన్, ఢిల్లీ, హరియాణా రాష్ట్రాల్లో జాట్ సామాజికవర్గంపై ప్రత్యేక దృష్టి.. జెన్ జీ ఓటర్లను ఆకర్షించేందుకు క్రికెటర్ సేవలు..

Yuzvendra Chahal political entry: రాజకీయ పార్టీలకు ఎన్నికలే ప్రధాన లక్ష్యం. ఎన్నికలంటే ఓట్లు..ఓట్లంటే కుల, మత, సామాజిక సమీకరణాలు. ప్రతి ఓటునూ కీలకంగా భావించే పొలిటికల్ పార్టీలు.. ఆయా వర్గాల మద్దతు కూడగట్టేందుకు రకరకాల వ్యూహాలు అమలు చేస్తుంటాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రజల్లో గుర్తింపు ఉన్న సినీ, క్రీడా ప్రముఖులను పార్టీల్లోకి ఆహ్వానించడం, వారికి కీలక బాధ్యతలు అప్పగించడం సాధారణంగా మారింది. కొందరిని ఎన్నికల బరిలోకి దింపితే.. మరికొందరిని స్టార్ క్యాంపెయినర్లుగా ఉపయోగించుకుంటాయి. ఈ విషయంలో బీజేపీ కూడా ప్రముఖులకు రాజకీయ బాధ్యతలు అప్పగిస్తూ ముందుకు సాగుతోంది.
బీజేపీలోకి క్రికెటర్ యజువేంద్ర చహల్
టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ తాజాగా బీజేపీలో చేరారు.పార్టీలో చేరిన వెంటనే ఆయనకు బీజేపీ ఓబీసీ మోర్ఛా జాతీయ కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా స్థానం కల్పించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. నియామకం వెనుక నార్త్ ఇండియాలోని పలు రాష్ట్రాల సామాజిక, రాజకీయ సమీకరణాలు ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హల్ హరియాణాకు చెందిన జాట్ సామాజికవర్గ ప్రతినిధి. అయితే హరియాణాలో జాట్లు జనరల్ కేటగిరీలోకి వస్తారు. మరోవైపు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో జాట్లకు ఓబీసీ హోదా ఉంది. దీంతో చహల్‌కు ఓబీసీ మోర్ఛాలో అవకాశం కల్పించడం వెనుక జాట్ సామాజికవర్గాన్ని ఆకర్షించే వ్యూహం ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఖ్యంగా ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో జాట్ సామాజికవర్గానికి గణనీయమైన ప్రాధాన్యం ఉంది. చెరకు సాగు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జాట్ల సామాజిక, రాజకీయ ప్రభావం కనిపిస్తుంది. పశ్చిమ యూపీ రాజకీయాల్లో ఈ వర్గం పాత్ర కీలకంగా పరిగణించబడుతోంది.
నాలుగు రాష్ట్రాల్లో జాట్ ఓట్లపై దృష్టి
ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో జాట్ సామాజికవర్గం పలు లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలదు. ఈ నాలుగు రాష్ట్రాల్లో కనీసం 40 లోక్‌సభ, 160 అసెంబ్లీ స్థానాల్లో జాట్ల సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతాయనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో చహల్ వంటి ప్రముఖ క్రికెటర్‌ను జాట్ యువతకు ప్రతినిధిగా పరిచయం చేయడం ద్వారా ఆ వర్గంలో పార్టీకి చేరువ పెంచుకోవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి. ముఖ్యంగా యువతలో చహల్‌కు ఉన్న గుర్తింపును పార్టీ కార్యక్రమాలకు అనుసంధానించాలనే బీజేపీ భావిస్తున్నట్లు పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే చహల్‌కు క్రికెట్‌లోనే కాకుండా సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.చహల్ చేసే పోస్టులు, వీడియోలు పెద్ద సంఖ్యలో యువతకు చేరువవుతున్నాయి. ముఖ్యంగా జెన్ జీ యువతను ఆకర్షించేందుకు చహల్‌ను ఒక గుర్తింపు పొందిన ముఖంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.
రాజకీయాలపై ఆసక్తితోనే బీజేపీలోకి చేరిక…!
చహల్‌కు రాజకీయాలపై ఆసక్తి ఉందని, బీజేపీలో పనిచేయడానికి ఆయన స్వయంగా ఉత్సాహం చూపించారని పార్టీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు మౌర్యా వెల్లడించినట్లు సమాచారం. ఓబీసీ యువతలో విజయానికి ప్రతీకగా చహల్‌ను పరిచయం చేయాలన్నది పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. క్రికెట్‌కు, రాజకీయాలకు మధ్య అనుబంధం కొత్తదేమీ కాదు. గతంలో విజయవంతమైన క్రికెటర్లుగా గుర్తింపు పొందిన కీర్తి ఆజాద్, గౌతమ్ గంభీర్ వంటి వారు బీజేపీలో చేరి రాజకీయ బాధ్యతలు నిర్వహించారు. గౌతమ్ గంభీర్ ఢిల్లీ నుంచి ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆయన భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా కొనసాగుతున్నారు. నేపథ్యంలో చహల్‌కు బీజేపీలో లభించిన తాజా బాధ్యతలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.



