మోదీ పిలుపు.. బంగారం ధరలు తగ్గడం వెనుకున్న కారణాలు ఇవే..?
PM Modi Gold Buying Appeal: ఏడాది పాటు బంగారం కొనొద్దన్న మోదీ పిలుపు.. తగ్గుతున్న పసిడి ధరల వెనుక అసలు కారణాలివే.. బంగారం కొనుగోళ్లు తగ్గితే దేశానికి ఎలా మేలు..? రూపాయిపై ఒత్తిడి తగ్గుతుందా..? విదేశీ మారక నిల్వలకు ఊరట.. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఏమిటి..?

PM Modi Gold Buying Appeal: బంగారం.. భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు.. ఒక ముఖ్యమైన పెట్టుబడి సాధనం కూడా. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు ఇలా ఏ సందర్భం వచ్చినా పసిడి కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బంగారం కొనుగోళ్లను తగ్గించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అవసరం లేని బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు వాయిదా వేయాలని ఆయన గతంలో ప్రజలకు పిలుపునిచ్చారు. తాజాగా తన సూచనలను ప్రజలు పాటించారని, దీంతో వారికి డబ్బు ఆదా అయిందని మోదీ పేర్కొనడంతో బంగారం కొనుగోళ్లు, దేశ ఆర్థిక వ్యవస్థ మధ్య ఉన్న సంబంధంపై ఆసక్తి నెలకొంది.
బంగారం కొనొద్దని మోదీ ఎందుకు సూచించారు..?
భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో రెండో స్థానంలో ఉంది. దేశీయంగా బంగారానికి ఉన్న డిమాండ్‌లో అధిక భాగం విదేశాల నుంచి వచ్చే దిగుమతుల ద్వారానే తీరుతోంది. ఈ దిగుమతులకు ప్రధానంగా అమెరికన్ డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అంటే భారతీయులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసినప్పుడు ఆ మేరకు విదేశీ మారకం దేశం నుంచి బయటకు వెళ్తుంది. దీంతో దేశ దిగుమతుల బిల్లు పెరగడమే కాకుండా విదేశీ మారక నిల్వలపై కూడా ఒత్తిడి ఏర్పడుతుంది. అందుకే అత్యవసరం కాని బంగారం కొనుగోళ్లను కొంతకాలం తగ్గిస్తే దేశానికి విదేశీ మారకం ఆదా అవుతుందనేది ఈ సూచన వెనుక ఉన్న ప్రధాన ఆర్థిక కారణం.
భారత్ వద్ద విదేశీ మారక నిల్వలు ఎంత ఉన్నాయి..!
ప్రస్తుతం భారత్ విదేశీ మారక నిల్వల విషయంలో బలమైన స్థితిలోనే ఉన్నప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాటిని సమర్థంగా నిర్వహించుకోవడం కీలకంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా అర్ధ వార్షిక నిల్వల నిర్వహణ నివేదిక ప్రకారం.. 11 నెలలకు సరిపడా విదేశీ నిల్వలు ఉన్నాయి. అయితే ఈ నిల్వల్లో బంగారం కొనుగోళ్లకు సంబంధించిన వాటా పెరుగుతుండటం గమనార్హం. 2025 సెప్టెంబర్‌లో విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 13.92 శాతంగా ఉండగా.. 2026 మార్చి నాటికి అది 16.7 శాతానికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం కూడా ఇందుకు ఒక కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం భారత్ వద్ద 880.52 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
ఫిజికల్ గోల్డ్‌కు బదులుగా సావరీన్ గోల్డ్ బాండ్లు ఎందుకు…?
ప్రజలు బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఆభరణాలు, నాణేలు, కడ్డీల రూపంలో భౌతిక బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ కొనుగోళ్లలో అధిక భాగం దిగుమతి చేసుకున్న బంగారంపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల విదేశీ మారకం దేశం నుంచి బయటకు వెళ్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరీన్ గోల్డ్ బాండ్లు వంటి పెట్టుబడి సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా భౌతికంగా బంగారం కొనుగోలు చేయకుండానే దాని ధరకు అనుసంధానమైన పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి బాండ్ల ద్వారా ప్రభుత్వం నిధులను సమీకరించుకోగలదు. ఆ నిధులను రోడ్లు, రైల్వేలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అవసరాలకు వినియోగించే అవకాశం ఉంటుంది. భౌతిక బంగారం కొనుగోళ్లతో పోలిస్తే ఇటువంటి పెట్టుబడి సాధనాలు దేశీయ ఆర్థిక వ్యవస్థలో నిధుల వినియోగానికి మరో మార్గాన్ని అందిస్తాయి.
మోదీ సూచనలకు ప్రజల స్పందన ఏంటి..?
బంగారం కొనుగోళ్లను తగ్గించాలంటూ గతంలో తాను చేసిన సూచనలను ప్రజలు పాటించారని ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా వెల్లడించారు. శనివారం లక్నోలో జరిగిన ఐదో జాతీయ కౌశల్ దీక్షాంత్ సమారోహ్‌లో పాల్గొన్న ఆయన.. అవసరం లేని బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలన్న తన సూచనకు ప్రజల నుంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. తన సూచనలను కొందరు తొలుత ఎగతాళి చేసినప్పటికీ.. వాటిని పాటించడం ద్వారా డబ్బు ఆదా అయిందని ఇప్పుడు ప్రజలు చెబుతున్నారని తెలిపారు. గతంలో దేశ ప్రజలు ఒక పూట భోజనం మానుకోవాలని లాల్ బహదూర్ శాస్త్రి పిలుపునిచ్చినప్పుడు ప్రజలు స్పందించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేశారు.
#
(Source: ANI/DD News)
— ANI (@ANI) November 21, 2026
కొంతమేర ఫలించిన మోదీ ప్రయత్నాలు
బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ప్రధాని సూచన, దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాలన్న లక్ష్యం ప్రస్తుతం చర్చలో ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల మార్పులు, అమెరికన్ డాలర్ బలం, వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, పెట్టుబడిదారుల డిమాండ్ వంటి అంశాలు కూడా పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. అదేవిధంగా దేశీయంగా బంగారం దిగుమతులు, రూపాయి మారకపు విలువ, పన్నులు, స్థానిక డిమాండ్ కూడా ధరలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మొత్తంగా చూస్తే.. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ప్రధాని మోదీ సూచన వెనుక విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం, దిగుమతుల బిల్లును తగ్గించడం, రూపాయిపై ఒత్తిడిని నియంత్రించడం, దేశీయ పొదుపును ఉత్పాదక రంగాల వైపు మళ్లించడం వంటి ఆర్థిక అంశాలు ఉన్నాయి.



