Dawood Ibrahim: ముంబయి అండర్‌వరల్డ్ చరిత్రలో దావూద్ ఇబ్రహీం పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. ముఖ్యంగా 1993 ముంబయి వరుస పేలుళ్ల ప్రస్తావన వచ్చినప్పుడల్లా అతడి పేరు తెరపైకి వస్తుంది. ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం, అతడి కుటుంబం నివసించిన భవనం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ముంబయిలోని భెండి బజార్ ప్రాంతంలో ఉన్న ఈ పాత భవనాన్ని కూల్చివేసేందుకు అధికారులు బుల్డోజర్లతో రంగంలోకి దిగారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు ప్రారంభించారు. అయితే ఈ ప్రక్రియ ఎక్కువసేపు కొనసాగలేదు. కొన్ని గంటల్లోనే బాంబే హైకోర్టు జోక్యం చేసుకుని కూల్చివేతపై తాత్కాలికంగా స్టే విధించింది. దీంతో ఈ భవనం కూల్చివేత వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది.

దావూద్ కుటుంబం నివసించిన భవనం ఇదే..

ముంబయిలోని భెండి బజార్ పరిధిలోని పక్మోడియా స్ట్రీట్‌లో హాజీ ఇస్మాయిల్ హాజీ హబీబ్ ముసాఫిర్‌ఖానా పేరుతో ఓ పురాతన భవనం ఉంది. 1970వ దశకంలో దావూద్ ఇబ్రహీం తన కుటుంబంతో కలిసి ఈ భవనంలోనే నివసించాడు. దశాబ్దాలు గడిచేకొద్దీ ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. భవనం ప్రస్తుత పరిస్థితిని పరిశీలించిన BMC అధికారులు దీనిని అత్యంత ప్రమాదకరమైన C-1 కేటగిరీ భవనంగా గుర్తించారు. ఈ కేటగిరీలోకి వచ్చే భవనాలు కూలిపోయే ప్రమాదం ఉండటంతో వాటిని కూల్చివేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మున్సిపల్ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. భవనం చుట్టూ నీలిరంగు రేకులతో రక్షణ ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో మున్సిపల్ సిబ్బందిని రంగంలోకి దించడంతో పాటు భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రత మధ్య కూల్చివేత పనులు ప్రారంభించారు.

తాత్కాలికంగా బ్రేక్ వేసిన హైకోర్టు

అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించిన కొద్దిసేపటికే ఈ వ్యవహారంలో న్యాయపరమైన జోక్యం చోటుచేసుకుంది. బాంబే హైకోర్టు కూల్చివేత ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బుల్డోజర్లతో ప్రారంభమైన కూల్చివేత పనులకు మధ్యలోనే బ్రేక్ పడింది. దావూద్ ఇబ్రహీం పాత నివాసంగా గుర్తింపు పొందిన ఈ భవనం భవిష్యత్తుపై ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాలు కీలకంగా మారాయి.

మరోవైపు ఎన్‌కౌంటర్‌లో డి-కంపెనీ గ్యాంగ్‌స్టర్ హతం

ఇదిలా ఉండగా, దావూద్ ఇబ్రహీం నేతృత్వంలోని డి-కంపెనీతో సంబంధాలున్న గ్యాంగ్‌స్టర్ నసీమ్ దుర్రానీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఢిల్లీ న్యాయశాఖ మంత్రి కపిల్ మిశ్రా కార్యాలయం సమీపంలో ఇటీవల జరిగిన హత్య కేసులో దుర్రానీ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, నోయిడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. నసీమ్ కదలికలపై నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.

పోలీసులపై కాల్పులు.. ఎదురుకాల్పుల్లో మృతి

నసీమ్ కదలికలను గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, అతడు స్కూటర్‌పై ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో సికంద్రాబాద్ బైపాస్ వద్ద పోలీసులు అతడిని చుట్టుముట్టారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన నసీమ్ స్కూటర్ అదుపుతప్పి కిందపడిపోయాడు. అయినప్పటికీ లొంగిపోకుండా తన వద్ద ఉన్న రెండు బోర్ పిస్టళ్లతో పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నసీమ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనా స్థలంలో రెండు పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఒకవైపు ముంబయిలో దావూద్ ఇబ్రహీం గత నివాసమైన భవనం కూల్చివేత వ్యవహారం హైకోర్టు జోక్యంతో నిలిచిపోగా, మరోవైపు డి-కంపెనీతో సంబంధాలున్న గ్యాంగ్‌స్టర్ నసీమ్ దుర్రానీ ఎన్‌కౌంటర్‌లో హతమవడం చర్చనీయాంశంగా మారింది.