RGV Financial Dispute

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు భారీ షాక్ తగిలింది. ఆయనకు ఆర్థిక చిక్కులు ఎదురయ్యాయి. ఆయన చెల్లించాల్సిన అప్పులకు సంబంధించి ప్రముఖ నిర్మాణ సంస్థ ఎక్లటాంట్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకంగా రూ.29.67 కోట్ల రికవరీ నోటీసులు(RGV Financial Dispute) జారీ చేసింది. అంతేకాదు.. రామ్ గోపాల్ వర్మతో లేదా ఆయన సినిమాలకు సంబంధించి ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరిపే ముందు తమ నుంచి రాతపూర్వకంగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) తీసుకోవాలని సినీ పరిశ్రమకు హెచ్చరికలు జారీ చేసింది. రామ్ గోపాల్ వర్మకు అక్టోబర్ 15న ఎక్లటాంట్ ఫిల్మ్స్ న్యాయపరమైన నోటీసు పంపింది. 2010లో తమ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ.29.67 కోట్లకు చేరాయని నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ ఒప్పందానికి సంబంధించి 2013లో బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా సంస్థ తన బహిరంగ నోటీసులో ప్రస్తావించింది. తమ అనుమతి లేకుండా ప్రాజెక్టులకు సంబంధించిన హక్కులను వినియోగిస్తే అందుకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. రామ్ గోపాల్ వర్మ నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించకపోతే ఒప్పందంలో పేర్కొన్న సినిమాలు, ప్రాజెక్టులపై తనకున్న ఒప్పందపరమైన హక్కులను వినియోగించుకుంటామని ఎక్లటాంట్ ఫిల్మ్స్ వెల్లడించింది.

అయితే రామ్ గోపాల్ వర్మకు నిర్మాణ సంస్థలు, సినీ కార్మిక సంఘాలతో ఆర్థిక వివాదాలు ఇదేం కొత్తమే కాదు. 2021లో ఆయన దర్శకత్వం వహించిన D Company సినిమా విడుదల సమయంలోనూ బకాయిల వివాదం తెరపైకి వచ్చింది. వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (FWICE) ఆయన చెల్లించాల్సిన సుమారు రూ.12 కోట్ల బకాయిలు ఉన్నాయని పేర్కొంటూ సినిమా విడుదలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. తాజాగా ఎక్లటాంట్ ఫిల్మ్స్ జారీ చేసిన రూ.29.67 కోట్ల రికవరీ నోటీసుతో(RGV Financial Dispute) మరోసారి రామ్ గోపాల్ వర్మ ఆర్థిక వ్యవహారాలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ వివాదంపై రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందిస్తారు.. న్యాయపరంగా ఎలాంటి స్టెప్‌ తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.