Sankranthi Box Office Clash: తెలుగు సినీ ప్రేక్షకులకు సంక్రాంతి అంటే కేవలం పండగ మాత్రమే కాదు.. వెండితెరపై వినోదాల విందు కూడా! ఈ సీజన్‌లో తమ సినిమాలను విడుదల చేసేందుకు అగ్ర హీరోలు, దర్శక నిర్మాతలు ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ప్రతి ఏడాది పొంగల్ బరిలో ఆసక్తికరమైన పోటీ కనిపిస్తుంది. అయితే 2027 సంక్రాంతి మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సినిమాల సమరానికి వేదికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సీనియర్ స్టార్ హీరోలతో పాటు యువ కథానాయకులు కూడా బాక్సాఫీస్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

పొంగల్ సెంటిమెంట్‌తో అనిల్ రావిపూడి.. వెంకీ, కళ్యాణ్ రామ్‌తో మరో ప్రయోగం

సంక్రాంతి సీజన్‌ను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తెరకెక్కించిన ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు వంటి చిత్రాలు పండగ సీజన్‌లో మంచి విజయాలు సాధించాయి. దీంతో అనిల్ రావిపూడి సినిమాలంటే సంక్రాంతి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంటోంది. ఇప్పుడు మరోసారి పొంగల్ సీజన్‌పై ఆయన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయాలని భావిస్తున్నారనే ప్రచారం కూడా మొదలైంది. వెంకటేశ్‌తో అనిల్ రావిపూడి గతంలో అందించిన విజయాలు ఈ కాంబినేషన్‌పై అంచనాలను పెంచుతున్నాయి. కళ్యాణ్ రామ్ కూడా తోడవడంతో ఈ సినిమా ఎలాంటి వినోదాన్ని పంచుతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున.. సీనియర్ స్టార్స్ మధ్య పోటీ..!

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా 2027 సంక్రాంతి బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆయన తాజా చిత్రాన్ని వచ్చే ఏడాది పొంగల్ కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి సినిమా వస్తుందనే వార్తే మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఇక అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన వందో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లాటరీ కింగ్ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సినిమాను డిసెంబర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ షూటింగ్, ఇతర నిర్మాణ కార్యక్రమాల్లో ఆలస్యం జరిగితే ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతికి తీసుకొచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. నందమూరి బాలకృష్ణ సైతం ఈసారి పొంగల్ రేసులోకి వచ్చే అవకాశాలున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలోకి వచ్చే అవకాశం ఉంటుంది.

ఆసక్తికరంగా మారనున్న బాక్సాఫీస్ పోరు..!

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా తమకంటూ ప్రత్యేకమైన అభిమానగణాన్ని సంపాదించుకున్న అగ్ర కథానాయకులు. వీరి సినిమాలు ఒకే సంక్రాంతి సీజన్‌లో విడుదలైతే బాక్సాఫీస్ వద్ద పోటీ మరో స్థాయికి చేరడం ఖాయం. ముఖ్యంగా ఈ నలుగురు సీనియర్ స్టార్స్ సినిమాలు ఒకే పండగ సీజన్‌లో పోటీపడితే అది టాలీవుడ్‌లో అరుదైన పరిణామంగా నిలుస్తుంది.