మెగాస్టార్‌తో పాన్ ఇండియా స్టార్ స్పెషల్ చిట్‌చాట్
Chiranjeevi MegaVerse Talk Show: త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి మెగావర్స్ టాక్‌షో. తొలి ఎపిసోడ్‌పై ఆసక్తికరమైన చర్చ.. చరణ్, పవన్‌లతో చిరంజీవి ఎపిసోడ్‌కు కూడా ప్రత్యేక ప్రాధాన్యం. ప్రభాస్‌తో ఎపిసోడ్ పూర్తయిందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ.

Chiranjeevi MegaVerse Talk Show: టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించనున్న మెగావర్స్ టాక్ షో గురించే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సెలబ్రిటీ టాక్ షోపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు సినిమా ఘనతను, సినీ దిగ్గజాల అద్భుతమైన ప్రయాణాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా రంగంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్న ప్రముఖ నటీనటులతో మెగాస్టార్ ముఖాముఖి సంభాషణలు ఈ షోకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెగావర్స్‌కు హాజరయ్యే అతిథులు ఎవరనే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రభాస్‌తో మెగాస్టార్ స్పెషల్ చిట్‌చాట్..?
ఈ షోకు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారనే ప్రచారం ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతోంది. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ ఒకే వేదికపై కనిపించి తమ సినీ ప్రయాణం, అనుభవాలు, సినిమా రంగంలో చోటుచేసుకున్న మార్పుల గురించి ముచ్చటిస్తే అభిమానులకు అది కనువిందుగా ఉంటుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ప్రభాస్‌తో చిరంజీవి చేసే చిట్‌చాట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇద్దరు అగ్ర కథానాయకుల మధ్య సంభాషణ ఎలా ఉండబోతోంది? ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు బయటకు రాబోతున్నాయి.. అనే ప్రశ్నలు సినీ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.
చరణ్, పవన్‌లతో చిరంజీవి ప్రత్యేక ఎపిసోడ్
ఇక మెగావర్స్‌లో మరో ప్రత్యేక ఆకర్షణగా మెగా కుటుంబానికి సంబంధించిన ఎపిసోడ్ ఉండనున్నట్లు ప్రచారం సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కలిసి ఒకే ఎపిసోడ్‌లో పాల్గొనాల్సి ఉందనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ముగ్గురూ ఒకే వేదికపై కనిపిస్తే మెగా అభిమానులకు అంతకంటే పెద్ద పండుగ మరొకటి ఉండదు. చిరంజీవి తన కుమారుడు చరణ్‌తో పాటు తమ్ముడు పవన్ కల్యాణ్‌తో కలిసి పంచుకునే అనుభవాలు, జ్ఞాపకాలు ఈ ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.
తొలి ఎపిసోడ్‌గా ఎవరు రాబోతున్నారు..?
ప్రస్తుతం అందరి దృష్టి మెగావర్స్ తొలి ఎపిసోడ్‌పైనే ఉంది. చిరంజీవి, చరణ్, పవన్ కల్యాణ్‌లతో చేయాల్సిన ప్రత్యేక ఎపిసోడ్‌ను నిర్ణీత సమయంలో పూర్తి చేయగలిగితే, దానినే ప్రారంభ ఎపిసోడ్‌గా స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఆ ఎపిసోడ్ సకాలంలో పూర్తికాకపోతే, ప్రభాస్‌తో చిరంజీవి నిర్వహించే ప్రత్యేక చిట్‌చాట్‌ను తొలి ఎపిసోడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో మెగావర్స్ ప్రారంభం మెగా ఫ్యామిలీ ఎపిసోడ్‌తో ఉంటుందా..? లేక ప్రభాస్ ఎంట్రీతో మొదలవుతుందా..? అన్న ఉత్కంఠ నెలకొంది.
అభిమానుల్లో భారీ అంచనాలు
ఒకవైపు చిరంజీవి, చరణ్, పవన్ కల్యాణ్‌ల కలయిక.. మరోవైపు ప్రభాస్‌తో మెగాస్టార్ ముఖాముఖి సంభాషణ.. ఈ రెండు ఎపిసోడ్‌ల గురించి వినిపిస్తున్న వార్తలు మెగావర్స్‌పై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. నిజంగానే ఈ స్టార్ హీరోలంతా ఈ షోలో సందడి చేస్తే, తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు ఇదొక ప్రత్యేకమైన వినోద విందుగా మారడం ఖాయం. అయితే ప్రస్తుతం ఈ అతిథుల వివరాలు, తొలి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రచారంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పటివరకు మెగావర్స్‌లో మెగాస్టార్ ఎవరితో ఎలాంటి ముచ్చట్లు పంచుకోబోతున్నారన్న ఆసక్తి మాత్రం తగ్గేలా కనిపించడం లేదు.



