ప్రభాస్ పెళ్లి సందడి.. ఇమాన్వీతో గ్రాండ్ వెడ్డింగ్
Prabhas and Imanvi Grand Wedding: ప్రభాస్ పెళ్లి ఎప్పుడా..? ఎప్పుడా..? అని ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్ వచ్చింది. ఫౌజీ సినిమాలో హీరోయిన్ ఇమాన్వితో పెళ్లికి సంబంధించిన సీన్లు పూర్తయినట్లు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది..

Prabhas and Imanvi Grand Wedding: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్, క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్‌లలో ‘ఫౌజీ’ ఒకటి. ప్రేమకథలను వెండితెరపై ఓ కావ్యంలా మలిచే దర్శకుడు హను రాఘవపూడి ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సోషల్ మీడియాను షేక్ చేయడమే కాకుండా, సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. అయితే, తాజాగా ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకు రావడంతో ఇండస్ట్రీలో, ప్రభాస్ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రీల్ లైఫ్‌లో పెళ్లి కొడుకుగా డార్లింగ్ ప్రభాస్
డార్లింగ్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా.. డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రియల్ లైఫ్‌లో ప్రభాస్ పెళ్లి బాజాలు ఎప్పుడు మోగుతాయన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. కానీ, రీల్ లైఫ్‌లో మాత్రం డార్లింగ్ పెళ్లి పీటలెక్కబోతున్నాడట. ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఈ తాజా షెడ్యూల్లోనే చిత్ర బృందం ఓ భారీ వెడ్డింగ్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్, ఇమాన్వీల వివాహ ఘట్టాన్ని దర్శకుడు హను రాఘవపూడి అత్యంత ఘనంగా, కళ్లు చెదిరే రీతిలో తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ గ్రాండ్ మ్యారేజ్ సీక్వెన్స్ చిత్రీకరణ కోసమే ప్రభాస్ ఫౌజీ సెట్స్‌లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.
1940ల నాటి వైభవం ఉట్టిపడేలా భారీ సెట్..
రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన ఓ భారీ సెట్లో ఈ పెళ్లి ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అద్భుతమైన ఆర్ట్ వర్క్‌తో, 1940ల నాటి వాతావరణం ప్రతిబింబించేలా ఈ సెట్‌ను రూపొందించారట. అప్పటి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వివాహ వేడుకల వైభవం ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపించేలా ఈ సీక్వెన్స్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఫౌజీలోనూ ప్రభాస్, ఇమాన్వీల పెళ్లి సన్నివేశాన్ని తనదైన కవితాత్మకమైన విజువల్ స్టైల్లో రూపొందిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ స్వాతంత్ర్యానికి ముందు నేపథ్యంలో ఓ మిలిటరీ కల్నల్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ వివాహ ఘట్టం సినిమాలో ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అభిమానులు భావిస్తున్నారు.
ప్రభాస్, ఇమాన్వీ కెమిస్ట్రీపై భారీ అంచనాలు!
ఫౌజీ సినిమా లాంచింగ్ ఈవెంట్లోనే ప్రభాస్, ఇమాన్వీ జంటను చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. ఇద్దరి మధ్య స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఫ్రెష్‌గా ఉందంటూ అప్పట్లో సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరితే సినిమా మరో స్థాయికి చేరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా వీరిద్దరి పెళ్లి సన్నివేశాన్నే చిత్రీకరిస్తున్నారన్న వార్తతో అంచనాలు మరింత పెరిగాయి. పెళ్లి కొడుకు గెటప్‌లో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు.. ఇమాన్వీతో ఆయన కెమిస్ట్రీ తెరపై ఎలా ఉండబోతోంది.. అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
ప్రభాస్ సినిమాలో పెద్దపెద్ద నటులు
ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తితో పాటు సీనియర్ నటులు భానుచందర్, జయప్రద వంటి దిగ్గజాలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సీతారామం వంటి మ్యూజికల్ హిట్‌కు సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. దీంతో పాటలపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తానికి, ప్రభాస్ రియల్ లైఫ్ పెళ్లి సంగతేమో కానీ, ఫౌజీ సెట్స్‌లో మాత్రం పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో వేచి చూడాలి



