Rajamouli Mahabharata Movie: పౌరాణిక కథలకు ప్రేక్షకుల్లో ఆదరణ పెరుగుతోంది. పురాణగాథలు, భక్తిభావం, ఆధ్యాత్మికత మేళవించిన చిత్రాలను నవతరం ప్రేక్షకులు సైతం విశేషంగా ఆదరిస్తున్నారు. అందుకు రామాయణ అందుకుంటున్న ఆదరణే నిదర్శనం. హనుమాన్ అంశ్, ఇరుముడి వంటి చిత్రాలు కూడా భక్తిభావంతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. మరోవైపు రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసిలోనూ మైథలాజికల్ టచ్ ఉండటం ఆసక్తిని పెంచుతోంది.

వారణాసి తర్వాత మహాభారతం…?

ఈ నేపథ్యంలో వారణాసి తర్వాత రాజమౌళి తెరకెక్కించబోయే సినిమా ఏమిటన్న చర్చ మొదలైంది. జక్కన్న తదుపరి ప్రాజెక్ట్ మహాభారతం కావచ్చనే ప్రచారం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. మహాభారతాన్ని పూర్తిస్థాయిలో తెరకెక్కించాలనే కోరిక తనకు ఎప్పటి నుంచో ఉందని రాజమౌళి గతంలో పలుమార్లు వెల్లడించారు. దీంతో వారణాసి తర్వాత ఆయన పురాణగాథ వైపు అడుగులు వేయనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం వారణాసి సినిమా పనుల్లో జక్కన్న బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తికాగానే మహాభారతంపై ఫోకస్ చేయనున్నట్లు సమాచారం.

విజువల్ ఎఫెక్ట్స్‌తో మరో అద్భుతం

భారతీయ పురాణగాథల్లో మహాభారతానికి ప్రత్యేక స్థానం ఉంది. రామాయణంతో పోలిస్తే మహాభారతంలో ఎన్నో కీలక ఘట్టాలు, భారీ యుద్ధ సన్నివేశాలు, అద్భుతమైన పాత్రలు ఉన్నాయి. వీటిని తెరపై ఆవిష్కరించేందుకు అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌కు విస్తృతంగా అవకాశం ఉంటుంది. ఇప్పటికే తన సినిమాల్లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన రాజమౌళి.. మహాభారతాన్ని తెరకెక్కిస్తే ఏ స్థాయిలో ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రధాన పాత్రల్లో ఎవరు కనిపిస్తారు

మహాభారతం చిత్రీకరణలో నటీనటుల ఎంపిక కూడా ఆసక్తికరంగా మారనుంది. గతంలో స్టార్ హీరోలతో మహాభారతం తీయనని రాజమౌళి పేర్కొన్న నేపథ్యంలో ప్రధాన పాత్రలకు ఎవరిని ఎంపిక చేస్తారన్న చర్చ సాగుతోంది. అంతేకాదు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి దివంగత నటీనటుల రూపాలను తెరపై పునఃసృష్టిస్తారా అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా చేపట్టనున్నారనే ప్రచారం మరో ఆసక్తికర అంశం. రామాయణ చిత్రానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్, నిర్మాణ ప్రమాణాలపై రాజమౌళి ప్రశంసలు కురిపించడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. మహాభారతం కోసం రాజమౌళి, నమిత్ మల్హోత్రా చేతులు కలిపితే అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

జక్కన్న నుంచి అధికారిక ప్రకటనపై ఆసక్తి..!

మొత్తానికి వారణాసి తర్వాత రాజమౌళి ఎలాంటి కథను ఎంచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రచారం జరుగుతున్నట్లుగా మహాభారతమే ఆయన తదుపరి ప్రాజెక్ట్ అయితే భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.