Varanasi Movie Shooting Completed: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ పాన్‌ వరల్డ్‌ చిత్రం వారణాసి నుంచి కీలక అప్‌డేట్‌ వచ్చేసింది. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఎట్టకేలకు పూర్తయింది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో నిమగ్నమైంది. ఈ వార్తతో మహేశ్‌బాబు అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

షూటింగ్‌కు గుడ్‌బై.. పోస్ట్ ప్రొడక్షన్‌కు శ్రీకారం..

వారణాసి’ సినిమా నుంచి కొత్త అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ విడుదలై ఏడాది పూర్తయిన నేపథ్యంలో చిత్రబృందం నుంచి ఏదైనా ఆసక్తికరమైన ప్రకటన వస్తుందని ఆశించారు. ఈ క్రమంలో ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా మరో అప్‌డేట్‌ ఇవ్వాలని మేకర్స్‌ను కోరారు. దీనికి చిత్రబృందం స్పందిస్తూ సినిమా షూటింగ్‌ పూర్తయిన విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం సీజీఐ, రీరికార్డింగ్‌ వంటి కీలక పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కొనసాగుతున్నాయని తెలిపింది. డబ్బింగ్‌ పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉందని పేర్కొంది. ఇదే ప్రస్తుతానికి తాజా అప్‌డేట్‌ అని, అంతకుమించి అసలైన బ్లాస్ట్‌ కోసం ఎదురుచూడాలని ఆసక్తికరంగా సమాధానమిచ్చింది. దీంతో త్వరలోనే సినిమా నుంచి మరో భారీ అప్‌డేట్‌ రానుందనే అంచనాలు అభిమానుల్లో మొదలయ్యాయి.

ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మహేశ్‌బాబు ఇందులో రుద్ర పాత్రలో కనిపించనుండగా, ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కుంభగా ప్రేక్షకులను అలరించనున్నారు. భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవలం భారతీయ ప్రేక్షకులకే పరిమితం చేయకుండా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు మేకర్స్‌ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా సుమారు 50 భాషల్లో డబ్బింగ్‌ చేసి, 120 దేశాల్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాదు, సినిమా విడుదలకు ముందే సుమారు రూ.3 వేల కోట్ల మార్కెట్‌ను సృష్టించే దిశగా నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

వారణాసి తర్వాత మహేశ్‌బాబు ఎవరితో సినిమా..?

ఇక వారణాసి తర్వాత మహేశ్‌బాబు చేయబోయే సినిమా ఏంటన్న చర్చ కూడా ఇప్పటి నుంచే మొదలైంది. గతంలో యానిమల్‌ సినిమా సమయంలోనే మహేశ్‌బాబుతో సినిమా చేయాలనే ఆసక్తిని దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా పలుమార్లు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. దీంతో రాజమౌళి సినిమా పూర్తయిన తర్వాత మహేశ్‌, సందీప్‌ కాంబినేషన్‌ పట్టాలెక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. మరోవైపు సక్సెస్‌ఫుల్‌ దర్శకుడు అనిల్‌ రావిపూడితోనూ మహేశ్‌బాబు మరోసారి సినిమా చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ కాంబినేషన్‌ రిపీట్‌ కానుందనే టాక్‌ నడుస్తోంది. ఈసారి స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో కథ ఉండవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.

క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్న సూపర్‌స్టార్ అభిమానులు

అయితే సందీప్‌ రెడ్డి వంగా, అనిల్‌ రావిపూడి కాంబినేషన్లపై వస్తున్న వార్తలకు సంబంధించి ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మహేశ్‌బాబు పూర్తి దృష్టి వారణాసిపైనే ఉంది. షూటింగ్‌ ముగియడంతో ఇకపై పోస్ట్‌ ప్రొడక్షన్‌, ప్రమోషన్లకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఎప్పుడు వస్తాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.