Varanasi OTT Rights: భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో రికార్డులను చూశాం. ఎన్నో బాక్సాఫీస్‌ సునామీలను చూశాం. అయితే ప్రస్తుతం యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా మాత్రం సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, గ్లోబల్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి. బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన జక్కన్న, RRRతో ఏకంగా ఆస్కార్‌ వేదికపై భారతీయ సినిమా సత్తాను చాటారు. అలాంటి దర్శకుడు, సూపర్‌స్టార్‌తో కలిసి ఓ గ్లోబల్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిల్మ్‌నగర్‌ వర్గాలతో పాటు గ్లోబల్‌ మీడియాలోనూ ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. సినిమా విడుదలకు ముందే ఊహించని స్థాయిలో బిజినెస్‌ రికార్డు సృష్టించిందనే ప్రచారం జరుగుతోంది.

ఫైనల్‌ స్టేజ్‌లో షూటింగ్.. బిజినెస్‌ను స్పీడ్ చేసిన టీమ్

చాలా కాలంగా సైలెంట్‌గా, పక్కా ప్రణాళికతో సాగుతున్న వారణాసి షూటింగ్‌ ఇప్పుడు దాదాపు ముగింపు దశకు చేరుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమాలంటే సాధారణంగా ఏళ్ల తరబడి షూటింగ్‌ జరుగుతుంటుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌ విషయంలో పక్కా ప్రీ ప్రొడక్షన్‌తో పనులు వేగంగా పూర్తి చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు షూటింగ్‌ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో సినిమా బిజినెస్‌ లెక్కలు కూడా ఒక్కసారిగా వేడెక్కాయి. సాధారణంగా ఏ సినిమాకైనా థియేట్రికల్‌ హక్కులకు భారీ ధర పలుకుతుంది. కానీ ‘వారణాసి’ విషయంలో నాన్‌ థియేట్రికల్‌ హక్కులు, ముఖ్యంగా డిజిటల్‌ రైట్స్‌ సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్‌ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్‌ రూ.290 కోట్లకు కొనుగోలు చేసిందని టాక్‌ వినిపిస్తోంది. అంతేకాకుండా, ఇప్పటివరకు టాలీవుడ్‌లో అత్యధిక థియేట్రికల్‌ ధర పలికిన చిత్రంగా వారణాసి నిలిచిందనే ప్రచారం కూడా జరుగుతోంది.

జక్కన్న చుట్టూ నెట్‌ఫ్లిక్స్‌ ప్రదక్షిణలు

ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. హాలీవుడ్‌ ప్రముఖులు, గ్లోబల్‌ ఆడియన్స్‌ రాజమౌళి తెరకెక్కించిన విధానాన్ని ప్రశంసించారు. ఈ విజయంతో నెట్‌ఫ్లిక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ వ్యూయర్‌షిప్‌ లభించింది. అందుకే రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్‌ చేసుకోకూడదని నెట్‌ఫ్లిక్స్‌ భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వారణాసి డిజిటల్‌ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్‌ కళ్లు చెదిరే ఆఫర్‌ ఇచ్చిందనే ప్రచారం ఊపందుకుంది. కేవలం సినిమా డిజిటల్‌ హక్కులే కాకుండా.. రాజమౌళి మేకింగ్‌ స్టైల్‌, సినిమా ప్రయాణం వెనుక ఉన్న విజువల్స్‌, అన్‌సీన్‌ ఫుటేజ్‌, ప్రత్యేక డాక్యుమెంటరీ కంటెంట్‌ను కూడా కలిపి ప్యాకేజీ డీల్‌ కుదుర్చుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న రూ.400-500 కోట్ల డీల్‌..?

అయితే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశం ఈ డీల్‌ విలువ. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సమాచారం ప్రకారం.. వారణాసి ఓటీటీ హక్కులు ఏకంగా రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల మధ్య అమ్ముడయ్యాయనే ప్రచారం జరుగుతోంది. భారతీయ సినీ చరిత్రలో ఒకే సినిమా డిజిటల్‌ హక్కులకు ఇంత భారీ మొత్తం పలకడం ఇదే తొలిసారి కావచ్చనే చర్చ నడుస్తోంది. గ్లోబల్‌ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని పలు అంతర్జాతీయ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేసేలా ఒప్పందం కుదిరిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ డీల్‌పై చిత్ర నిర్మాతల నుంచి కానీ, నెట్‌ఫ్లిక్స్‌ నుంచి కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏదేమైనా విడుదలకు ముందే ఇన్ని సంచలన వార్తలతో వార్తల్లో నిలుస్తున్న వారణాసి.. విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.