Chiranjeevi and Nagarjuna new movie: మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున ఒకే సినిమాలో కనిపిస్తే ఆ సందడే వేరు. ఈ ఇద్దరు అగ్ర కథానాయకులు కలిసి తెరపై సందడి చేయనున్నారనే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అందులోనూ హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కనుందనే ప్రచారం అభిమానుల్లో అంచనాలను ఒక్కసారిగా పెంచేస్తోంది. కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఈ కాంబినేషన్ వార్తలు ఇప్పుడు దాదాపు ఖాయమనే టాక్ వినిపిస్తుండటంతో మెగా, అక్కినేని అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది.

చిరు, నాగ్ మధ్య ప్రత్యేక అనుబంధం

తన తరం హీరోలందరితోనూ మెగాస్టార్ చిరంజీవి ఎంతో కలివిడిగా ఉంటారు. అయినప్పటికీ కింగ్ నాగార్జునతో చిరంజీవి అనుబంధం ప్రత్యేకమైనది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే నంది అవార్డుల్లోనూ వీరిద్దరూ ఓ రికార్డు క్రియేట్ చేశారు. 2002 నంది అవార్డుల్లో ఉత్తమ నటుడు విభాగంలో ఆ పురస్కారాన్ని వీరిద్దరూ షేర్ చేసుకున్నారు. ఇంద్ర సినిమాతో చిరంజీవి, సంతోషం చిత్రం ద్వారా నాగార్జున బెస్ట్ యాక్టర్ అవార్డును పంచుకున్నారు. ఆ తరువాత ఇప్పటి దాకా ఆ తీరున నంది ఉత్తమ నటుడు అవార్డును షేర్ చేసుకున్న స్టార్స్ ఎవరూ లేరు. ఆ నాటి నుంచీ చిరు, నాగ్ మధ్య అనుబంధం మరింతగా పెరిగింది. మా టీవీ ప్రమోటర్లుగానూ చిరు, నాగ్ కలిసి సాగిన వైనం అందరికీ తెలిసిందే. అలాంటి అనుబంధం ఉన్న ఈ ఇద్దరు అగ్ర కథానాయకులు హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ తెరకెక్కుతోందంటే అభిమానుల ఆనందం అంబరాన్ని తాకడం ఖాయమే.

మరోసారి చిరంజీవితో అనిల్ రావిపూడి!

చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై విజయఢంకా మోగించింది. చిరంజీవి కెరీర్‌లో తొలి రూ.300 కోట్ల సినిమాగా ఈ చిత్రం నిలిచింది. అందువల్ల మరోసారి చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా అనగానే అభిమానుల్లో ఆసక్తి, ఆనందం రెట్టింపవుతున్నాయి. మన శంకరవరప్రసాద్ గారులో చిరంజీవి, వెంకటేశ్‌ను కలిపిన అనిల్ రావిపూడి ఈసారి చిరు, నాగ్‌లతో ప్లాన్ చేయడం సినీ జనాల్లోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటికే తాను తెరకెక్కించిన చిత్రాల్లో పలు సినిమాలను పొంగల్ బరిలో నిలిపి బంపర్ హిట్స్ అందుకున్నారు అనిల్ రావిపూడి. చిరంజీవి, నాగార్జునలతో తీసే సినిమాను కూడా తప్పకుండా సంక్రాంతి సంబరాల్లోనే నిలుపుతారని అభిమానులు భావిస్తున్నారు.

2028 సంక్రాంతికి మెగా-కింగ్ మల్టీస్టారర్ మూవీ..?

ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో జనవరి 12 విడుదల చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో అనిల్‌కు అచ్చివచ్చిన హీరో వెంకటేశ్, ఆయనను దర్శకుడిగా పరిచయం చేసిన నటనిర్మాత కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా పొంగల్ బరిలోనే దూకనుంది. ఈ చిత్రం పూర్తయిన వెంటనే చిరంజీవి, నాగార్జున కాంబినేషన్‌కు తగిన సబ్జెక్ట్‌ను తయారు చేసే పనిలో అనిల్ రావిపూడి ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాత వెంకట్ కె. నారాయణతో కలిసి ఓ భారీ యానిమేషన్ మూవీని రూపొందించే ప్రయత్నంలో అనిల్ ఉన్నారు. ఆ పని ఓ వైపు జరుగుతుండగానే, మరోవైపు చిరు-నాగ్ ప్రాజెక్టుకు సంబంధించిన వర్క్‌ను లైన్‌లో పెట్టనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ మల్టీస్టారర్‌ను 2028 సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్‌లోనూ ఉన్నట్టు సమాచారం. మరి చిరంజీవి, నాగార్జున వంటి ఇద్దరు అగ్ర కథానాయకులను ఒకే తెరపై చూపిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి సినిమా కోసం మెగా, అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.