ప్రొడ్యూసర్‌గా మారిన నందమూరి వారసురాలు..
Nandamuri Tejaswini Turns Producer: నందమూరి తేజస్విని.. నటసింహం బాలకృష్ణ చిన్నకుమార్తె. విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ భార్య. ప్రస్తుతం వ్యాపారల్లో ఉన్న ఆమె.. త్వరలో నిర్మాతగా మారనున్నారు.

Nandamuri Tejaswini Turns Producer: నందమూరి కుటుంబం నుంచి మరో వారసురాలు సినీ రంగంలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు తేజస్విని నటిగా వెండితెరపైకి వస్తారని అభిమానులు భావించగా.. అందుకు భిన్నంగా ఆమె నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, సొంతంగా ఓ సినిమాను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో నందమూరి వారసురాలు సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం చర్చనీయాంశంగా మారింది.
నటిగా వస్తారని భావిస్తే.. నిర్మాతగా ఎంట్రీ
సినీ నేపథ్యం ఉన్న ఎన్నో కుటుంబాల నుంచి అమ్మాయిలు నటీమణులుగా వెండితెరపైకి వచ్చారు. అయితే నందమూరి నటవంశం నుంచి ఇప్పటివరకు మహిళలు నటనలోకి అడుగుపెట్టిన సందర్భాలు లేవు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఎప్పుడైనా నటిగా పరిచయం అవుతారేమోనని చాలామంది ఆసక్తిగా ఎదురుచూశారు. తేజస్విని రూపురేఖలు, వ్యక్తిత్వం చూసిన పలువురు ఆమె ఆధునిక కథానాయికలా ఉంటారని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో కొన్ని బ్రాండ్లు తమ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆమెను కోరాయి. అలా గోల్డ్ షాప్ ప్రకటనలో తేజస్విని కనిపించారు. ఆ తర్వాత ఓ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆమె త్వరలోనే సినిమాల్లోకి హీరోయిన్గా వస్తారనే ప్రచారం మొదలైంది. కానీ, అందరి అంచనాలకు భిన్నంగా తేజస్విని నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నారు.
నవంబర్ 23న విశాఖలో సినిమా ప్రారంభం
తేజస్విని సోలో ప్రొడ్యూసర్‌గా ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవం నవంబర్ 23న విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా నందమూరి కుటుంబం నుంచి తేజస్విని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సినిమాను ఓ ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో రూపొందించనున్నట్లు సమాచారం. తేజస్విని క్లాస్మేట్ భువన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సిందూరపువ్వు కృష్ణారెడ్డి తనయుడు అన్వేష్ ఇందులో హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రముఖ నటుడు బాబీ సింహా కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
బాలకృష్ణ సినీ ప్రయాణంలోనూ కీలక పాత్ర
తేజస్వినికి మొదటి నుంచీ సినిమాలపై ఆసక్తి ఉంది. చిన్నతనంలోనే తండ్రి బాలకృష్ణ షూటింగులకు వెళ్లేవారు. అక్కడ సినిమా వాతావరణాన్ని దగ్గరగా చూసేవారు. బాలకృష్ణకు సంబంధించిన పలువురు సినీ ప్రముఖులతోనూ ఆమెకు పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక తేజస్విని పాత్ర కీలకమనే విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి సంబంధించిన వ్యవహారాల్లో ఆమె చురుగ్గా వ్యవహరించారు. అలాగే బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా నిర్మాణంలోనూ తేజస్విని భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే సినిమా నిర్మాణానికి సంబంధించిన అనుభవాన్ని దగ్గరగా చూసిన తేజస్విని.. ఇప్పుడు పూర్తిస్థాయిలో నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
తాత ఎన్టీఆర్ బాటలో మనవరాలు..
నందమూరి కుటుంబానికి నటనతో పాటు చిత్ర నిర్మాణ రంగంలోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తేజస్విని తాత, స్వర్గీయ నందమూరి తారక రామారావు నటుడిగానే కాకుండా నిర్మాతగానూ తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన తేజస్విని నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. మరి తాత ఎన్టీఆర్ బాటలో తేజస్విని కూడా చిత్ర నిర్మాణంలో ఎలాంటి విజయాన్ని అందుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి నటిగా తెరపైకి వస్తారని ఎదురుచూసిన అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ.. నందమూరి వారసురాలు నిర్మాతగా టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు.



