Appi Reddy Rajahmundry Central Jail: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా, పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ బాక్సుల అపహరణకు ప్రయత్నించారనే ఆరోపణలతో అరెస్టయిన అప్పిరెడ్డి ఇప్పటివరకు గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే తాజాగా న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. వైసీపీలో కీలక స్థానంలో ఉన్న నేతను మరో జిల్లాలోని కేంద్ర కారాగారానికి మార్చడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

భద్రతా కారణాలతో జైలు మార్పు

అప్పిరెడ్డిని గుంటూరు జిల్లా జైలు నుంచి మరో జైలుకు తరలించాలని కోరుతూ జైలు సూపరింటెండెంట్ స్థానిక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో జైలు అధికారులు, పోలీసులు ప్రత్యేక నివేదికలను కోర్టుకు సమర్పించారు. అప్పిరెడ్డి కోరిన కొన్ని ప్రత్యేక సదుపాయాలు గుంటూరు జిల్లా జైలులో అందుబాటులో లేవని అధికారులు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాకుండా జైలు వద్ద భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అప్పిరెడ్డిని పరామర్శించేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుంటుండటంతో శాంతిభద్రతల సమస్యలు ఏర్పడుతున్నాయని, జైలు నిర్వహణలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు నివేదించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న గుంటూరు న్యాయస్థానం ఆయనను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించేందుకు అనుమతించింది. కోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే పోలీసులు, జైలు అధికారులు తరలింపు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం రాత్రి ప్రత్యేక వాహనంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య అప్పిరెడ్డిని రాజమండ్రికి తీసుకెళ్లారు. అక్కడి కేంద్ర కారాగార అధికారులకు అప్పగించి, జైలు నిబంధనల ప్రకారం తదుపరి ప్రక్రియను పూర్తి చేశారు.

గతంలో ఇదే జైలులో ఎంపీ మిథున్‌రెడ్డి

అప్పిరెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంలో మరో రాజకీయ కోణం కూడా చర్చకు వస్తోంది. గతంలో వైసీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి కూడా ఇదే రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏపీ మద్యం కేసులో అరెస్టయిన ఆయనకు 2025 జూలైలో విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు. ఆ తర్వాత ఆయన బెయిల్, మధ్యంతర బెయిల్ తదితర న్యాయపరమైన పరిణామాల నేపథ్యంలో జైలుకు వచ్చి వెళ్లారు. మిథున్‌రెడ్డి రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో ఆయన తండ్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలుమార్లు జైలుకు వెళ్లి పరామర్శించారు. మిథున్‌రెడ్డికి సంబంధించిన ములాఖత్‌లు, జైలు వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తల సందడి అప్పట్లో సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చర్చనీయాంశమైన ఆ పరిణామాల తర్వాత ఇప్పుడు మరో కీలక వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి కూడా అదే జైలుకు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది.

వైసీపీ నేతల్లో మొదలై చర్చ

లేళ్ల అప్పిరెడ్డి సాధారణ రాజకీయ నాయకుడు కాదు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో బలమైన పరిచయాలు, పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర కలిగిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అలాంటి నాయకుడిని గుంటూరు నుంచి రాజమండ్రికి తరలించడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఒకవైపు బ్యాలెట్ బాక్సుల వ్యవహారంలో నమోదైన కేసు, మరోవైపు జైలు భద్రతా కారణాలతో జరిగిన తరలింపు.. వంటి పరిణామాలు ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యతను పెంచాయి.