Aakasamlo Oka Tara Movie Review: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆకాశంలో ఒక తార. పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించారు. శ్రుతిహాసన్ కీలక పాత్రలో కనిపించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. నవంబర్ 20, 2026న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే మంచి స్పందన లభించింది. ఇంతకీ సినిమా ఎలా ఉందో ఈ మూవీ రివ్యూలో చూద్దాం..

కథంటంటే..

పాలలంక అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన కల్పన (సాత్విక వీరవల్లి)కి చిన్నతనం నుంచే అంతరిక్షంలోకి వెళ్లాలనే ఆశయం ఉంటుంది. ఆస్ట్రోనాట్ కావాలనే ఆమె కలకు పేదరికం ఒకవైపు అడ్డంకిగా నిలిస్తే, ఆడపిల్లలకు చదువు అవసరం లేదనే తండ్రి ఆలోచనలు మరోవైపు సమస్యగా మారతాయి. అయినప్పటికీ తల్లి ప్రోత్సాహంతో పదో తరగతి వరకు చదువుకుంటుంది. అయితే పరీక్షల ఫలితాలు రాకముందే కుటుంబ సభ్యులు ఆమెకు కృష్ణ (దుల్కర్ సల్మాన్)తో వివాహం జరిపిస్తారు. కల్పనలోని ప్రతిభను, ఆమె లక్ష్యాన్ని అర్థం చేసుకున్న కృష్ణ.. భార్య కలను నిజం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం ఆమెతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి ఇంటర్మీడియట్‌లో చేర్పిస్తాడు. అనంతరం కేరళలో ఐఐటీలో సీటు సంపాదించిన కల్పన చదువుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కృష్ణ గుజరాత్‌లోని క్వారీలో డ్రైవర్‌గా పనిచేస్తూ కష్టపడతాడు. అయితే కల్పన చేపట్టిన తొలి రాకెట్ ప్రయోగం విఫలం కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. ఈ వైఫల్యం ఆమె భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపింది..? తన భార్యను ఆస్ట్రోనాట్‌గా చూడాలన్న కృష్ణ ఆశయం నెరవేరిందా..? ఈ ప్రయాణంలో రోహిణి (శ్రుతిహాసన్) పాత్ర ఏమిటి..? అనేది తెరపై చూడాల్సిందే.

కష్టపడిన దుల్కర్, సాత్విక వీరవల్లి

సాధారణంగా మహిళల విజయాల వెనుక కుటుంబం, ముఖ్యంగా జీవిత భాగస్వామి ఇచ్చే ప్రోత్సాహం ఎంత ముఖ్యమో ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. కల్పన చిన్ననాటి సన్నివేశాలతో కథ ప్రారంభమవుతుంది. ఆమెకు అంతరిక్షంపై ఆసక్తి ఎలా ఏర్పడింది. చదువుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.. అనే అంశాలను దర్శకుడు నెమ్మదిగా పరిచయం చేస్తాడు. ఈ క్రమంలో గుజరాత్ క్వారీలో పనిచేసే కృష్ణకు సంబంధించిన సన్నివేశాలు, బిజిలీ (రుహానీ శర్మ)తో అతడికి ఉన్న పరిచయం కథకు కొంత ఆసక్తిని జోడిస్తాయి. కథ మధ్యలో ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లడంతో కథనం కాస్త నెమ్మదించినప్పటికీ, కల్పన వివాహం తర్వాత వచ్చే సన్నివేశాల నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. భార్య ఆశయాన్ని అర్థం చేసుకుని ఆమెకు అండగా నిలిచే కృష్ణ పాత్ర ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది. ముఖ్యంగా తన భార్య చదువు కోసం అతడు పడే కష్టం, ఎదురయ్యే ఇబ్బందులను లెక్కచేయకుండా ఆమె లక్ష్యం కోసం నిలబడే తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చివరి అరగంట ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది. కథలోని ప్రధాన మలుపులు, ముగింపు ఎలా ఉండబోతున్నాయనే విషయాలపై ముందుగానే కొంత అవగాహన ఉన్నప్పటికీ, ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా కూర్చోబెట్టడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు.పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఈ చిత్రాన్ని ఒక మంచి ఎమోషనల్ డ్రామాగా ఆస్వాదించవచ్చు.

సినిమాకు ప్లస్, మైనస్ ఇవే

కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. భార్య కోసం కష్టపడే భర్తగా, ఆమె విజయాన్ని తన విజయంగా భావించే వ్యక్తిగా సహజమైన నటనను కనబరిచాడు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. పాటలు వినసొంపుగా ఉండటంతో పాటు వాటిలోని సాహిత్యం కూడా ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం భావోద్వేగ సన్నివేశాలను మరింత ప్రభావవంతంగా మార్చింది. సుజీత్ సారంగ్ సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రామీణ వాతావరణం నుంచి అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన సన్నివేశాల వరకు విజువల్స్‌ను చక్కగా తెరకెక్కించారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ కూడా కథకు అనుగుణంగా సాగింది. కొన్ని సన్నివేశాల్లో నిర్మాణ పరమైన పరిమితులు కనిపించినప్పటికీ, మొత్తం మీద నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే సినిమాలో అక్కడక్కడ నెమ్మదిగా సాగే స్క్రీన్‌ప్లేతో పాటు.. ముందుగానే ఊహించగలిగే కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. కథలో పెద్దగా కొత్తదనం లేదు.

సినిమా టీమ్‌కు ఎన్టీఆర్ శుభాకాంక్షలు

ఆకాశంలో ఒక తార చిత్ర బృందానికి స్టార్ హీరో ఎన్టీఆర్‌ తన శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు ఎంతో ఆప్తులైన పలువురు ఈ సినిమాలో భాగస్వాములు కావడంతో ఈ చిత్రం తనకు ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. విభిన్నమైన, కొత్త తరహా కథలను ప్రోత్సహించడంలో స్వప్న సినిమాస్ ఎప్పుడూ ముందుంటుందని ప్రశంసించారు. మంచి చిత్రాల విషయంలో అరవింద్, గీతా ఆర్ట్స్‌కు ఉన్న అభిరుచి, నమ్మకం మరోసారి ఈ సినిమాతో నిరూపితమవుతోందని అన్నారు. ఈ సందర్భంగా హీరో దుల్కర్ సల్మాన్‌తో పాటు సాత్విక వీరవల్లికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

సినిమా చూసిన ఎస్ఎస్ రాజమౌళి

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తాజాగా ఆకాశంలో ఒక తార సినిమాను వీక్షించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్‌కు వెళ్లిన ఆయన ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ పనులు పూర్తి కావడంతో కొంత విరామం దొరికింది. దీంతో ఆ సమయాన్ని కుటుంబంతో గడపడమే కాకుండా, వెంటనే థియేటర్‌కు వెళ్లి ఆకాశంలో ఒక తార సినిమాను చూశారు. సినిమాపై ఆసక్తితో రాజమౌళి స్వయంగా థియేటర్‌కు రావడం సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.