Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 11వ వారం ఎలిమినేషన్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ వారం హౌస్ నుంచి నీతూ మాస్టర్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. మొదట ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ, చివరకు సింగిల్ ఎలిమినేషన్‌తోనే సరిపెట్టుకున్నట్లు సమాచారం. తక్కువ ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో ఉన్న నీతూ మాస్టర్ ఎలిమినేషన్‌కు గురైంది. దీంతో ఆమె ప్రయాణం 11వ వారంతో ముగిసినట్లయింది.

డిక్టేటర్ థీమ్‌లో త్రిగున్ హవా..!

11వ వారంలో బిగ్ బాస్ ఇంట్లో డిక్టేటర్ థీమ్ ఆసక్తికరంగా సాగింది. ఈ టాస్క్‌లో త్రిగుణ్, ముకేశ్ ఇద్దరికీ డిక్టేటర్‌గా వ్యవహరించే అవకాశం లభించింది. అయితే త్రిగుణ్ తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి పాస్ కాగా, ముకేశ్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేక ఫెయిల్ అయ్యాడు. త్రిగుణ్ టీమ్ సభ్యులు కూడా తమకు అప్పగించిన బాధ్యతలను బాగానే నిర్వర్తించారు. దీంతో ఈ వారం గేమ్‌లో త్రిగుణ్ టీమ్ పైచేయి సాధించినట్లయింది. ఈ వారం నీతూ మాస్టర్ గేమ్‌లో మరోసారి టీమ్ మార్చుకుంది. మొదట త్రిగుణ్ టీమ్‌లో ఉన్న ఆమె ఆ తర్వాత ముకేశ్ టీమ్‌లోకి స్వాప్ అయింది. రెండు టీమ్‌లలోనూ తన ఆటతో ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. హౌస్‌లో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించినా, ప్రేక్షకుల ఓట్లను మాత్రం ఆశించిన స్థాయిలో సంపాదించలేకపోయినట్లు కనిపిస్తోంది.

కంటెస్టెంట్లకు క్లాస్ పీకిన నాగార్జున

ఇక వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యుల ఆటతీరుపై స్పందించారు. ఈ వారం జరిగిన తప్పులు, టాస్కుల్లో తీసుకున్న నిర్ణయాలు, సభ్యుల మధ్య తలెత్తిన వివాదాలపై తనదైన శైలిలో క్లాస్ తీసుకున్నారు. ముఖ్యంగా డిక్టేటర్స్ టాస్క్ సందర్భంగా జరిగిన పరిణామాలు, వంశీ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. కొంత సర్దుకుపోయి ఉంటే టాస్క్ కొనసాగేదని, గెలిచే అవకాశం కూడా ఉండేదని వివరించారు. మరోవైపు వర్షిణి, ముకేశ్‌లకు కూడా నాగార్జున గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్‌షిప్ గేమ్ కూడా ఆసక్తికరంగా సాగింది. ఈ పోటీలో ముకేశ్ విజయం సాధించి కీలకమైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. డిక్టేటర్ టాస్క్‌లో ఫెయిల్ అయినప్పటికీ, కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌లో గెలవడం ముకేశ్‌కు ఊరటనిచ్చింది. దీంతో ఈ వారం అతడి గేమ్ మరోసారి చర్చలోకి వచ్చింది.

డేంజర్ జోన్‌లో నీతూ.. చివరకు ఎలిమినేషన్

ఈ వారం ఓటింగ్‌లో త్రిగుణ్, ముకేశ్, దేబ్జానీ, అమన్, వర్షిణి ముందంజలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు రాంప్రసాద్, వంశీ, సుధీర్, రామకృష్ణ, నీతూ మాస్టర్, శివ తక్కువ ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న కంటెస్టెంట్లలో చివరకు నీతూ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం కెప్టెన్‌గా ఉన్న నరేశ్ మినహా మిగిలిన ఇంటి సభ్యులంతా నామినేషన్లలో ఉండటంతో ఓటింగ్‌పై ఆసక్తి నెలకొంది. మొదట డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని భావించినప్పటికీ, ప్రస్తుతానికి నీతూ ఎలిమినేషన్‌తో ఈ వారం హౌస్‌లో ఒక కీలకమైన మార్పు చోటుచేసుకుంది.

నీతూకి మద్దతుగా నటరాజ్ మాస్టర్ వీడియోలు

బిగ్ బాస్ హౌస్‌లో నీతూ మాస్టర్ ఆటపై బయట నుంచి నటరాజ్ మాస్టర్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ వచ్చారు. నీతూను ఉద్దేశించి ఇతర కంటెస్టెంట్లు చేసిన వ్యాఖ్యలు, ఆమెకు ఎదురైన పరిణామాలపై సోషల్ మీడియాలో వరుస వీడియోలు విడుదల చేస్తూ ఆమెకు మద్దతుగా నిలిచారు. హౌస్‌లో జరిగే ప్రతి అంశాన్ని విశ్లేషిస్తూ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇప్పుడు నీతూ మాస్టర్ ఎలిమినేషన్‌కు గురైనట్లు వార్తలు రావడంతో నటరాజ్ మాస్టర్ స్పందనపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే నీతూకు మద్దతుగా వీడియోలు చేస్తూ వచ్చిన ఆయన, ఈ ఎలిమినేషన్‌పై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.