Rohit Bigg Boss: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-10 రోజురోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. ఎనిమిదో వారం ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా అగ్నిపరీక్ష ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన రోహిత్‌ నాయుడు ఎలిమినేట్‌ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. టాప్‌ కంటెస్టెంట్‌గా నిలుస్తాడని భావించిన రోహిత్‌ అనూహ్యంగా ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ముఖ్యంగా డబుల్‌ ఎలిమినేషన్‌ ప్రక్రియలో రోహిత్‌ పేరు తెరపైకి రావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. రోహిత్‌ ఎలిమినేషన్‌కు పలు కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. హౌస్‌లో అతడి ఆటతీరు, ప్రవర్తన, ఇతర కంటెస్టెంట్స్‌తో వ్యవహరించిన విధానం ఈ పరిణామానికి కారణమయ్యాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున పలుమార్లు హెచ్చరించినప్పటికీ రోహిత్‌ తన ప్రవర్తనలో మార్పు చూపించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఓవర్ యాటిట్యూడ్.. రోహిత్‌ ఇంటి బాట

గేమ్‌పై సరిగ్గా దృష్టి పెట్టకపోవడం: హౌస్‌లో జరిగే గేమ్స్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం రోహిత్‌కు మైనస్‌గా మారింది.

ఓవర్‌ యాటిట్యూడ్‌: తన ప్రవర్తనలో అతిగా వ్యవహరించడం ప్రేక్షకుల్లో ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించిందనే చర్చ ఉంది.

తోటి కంటెస్టెంట్స్‌ను దూషించడం: ఇతర సభ్యులతో మాట్లాడే సమయంలో మాటల నియంత్రణ కోల్పోవడం అతడికి ఇబ్బందిగా మారింది.

నాగర్జున వార్నింగ్స్ పట్టించుకోకపోవడం: నాగార్జున ప్రతివారం వార్నింగ్‌ ఇచ్చినా తన ప్రవర్తనలో మార్పు కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

షాలినితో ఎక్కువ క్లోజ్‌ అవడం: గేమ్‌ కంటే షాలినితో సాన్నిహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడనే విమర్శలు వచ్చాయి.

త్రిగుణ్‌ను టార్గెట్‌ చేయడం: త్రిగుణ్‌పై ఎక్కువగా ఫోకస్‌ పెట్టి అతడిని టార్గెట్‌ చేయడం రోహిత్‌ ఆటకు ప్రతికూలంగా మారింది.

సొంత గేమ్‌ను మర్చిపోవడం: ఇతరుల ఆటపై దృష్టి పెట్టే క్రమంలో తన గేమ్‌ను పక్కన పెట్టాడనే అభిప్రాయం ఏర్పడింది.

వ్యూహాల్లో లోపాలు: హౌస్‌లో తన స్థానాన్ని బలపరుచుకునేలా సరైన వ్యూహాలను అమలు చేయలేకపోయాడనే చర్చ సాగింది.

ప్రవర్తనలో మార్పు లేకపోవడం: పలుమార్లు హెచ్చరికలు వచ్చినప్పటికీ అదే తరహా ప్రవర్తన కొనసాగించడం మైనస్‌గా మారిందని భావిస్తున్నారు.

ప్రేక్షకుల మద్దతుపై ప్రభావం: గేమ్‌ కంటే వ్యక్తిగత వ్యవహారాలు, ఇతరులతో గొడవలపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో ప్రేక్షకుల మద్దతు తగ్గి ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ రోహిత్‌ ఎలిమినేషన్‌కు కారణమై ఉండొచ్చనే చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతోంది. ఓవర్ అటిట్యూడ్ కారణంగానే రోహిత్ ఎలిమినేషన్ జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎనిమిది వారాలకు రోహిత్‌ సంపాదన ఎంతంటే..?

బిగ్‌బాస్‌ హౌస్‌లో రోహిత్‌ సంపాదనకు సంబంధించిన పోస్టు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కామన్‌ కేటగిరీలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్‌కు వారానికి రూ.70 వేల చొప్పున పారితోషికం అందినట్లు సమాచారం. ఈ లెక్కన ఎనిమిది వారాలకు గాను మొత్తం రూ.5.60 లక్షలు అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యే కంటెస్టెంట్లకు సాధారణంగా నాగార్జున వారి జర్నీ వీడియోను చూపిస్తుంటారు. అయితే రోహిత్‌ విషయంలో ఎలాంటి జర్నీ వీడియో చూపించకుండానే బయటకు పంపించడంతో ఈ ఎలిమినేషన్‌పై చర్చ మొదలైంది. అంతేకాకుండా మరోవైపు రోహిత్‌ ఎలిమినేషన్‌ కేవలం డ్రామా మాత్రమేనని, త్వరలోనే అతడిని వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా తిరిగి హౌస్‌లోకి తీసుకురాబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి సోషల్‌ మీడియాలో పలు పోస్టులు వైరల్‌ అవుతున్నాయి.

నాగార్జునపై మండిపడుతున్న రోహిత్ అభిమానులు

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి రోహిత్‌ ఎలిమినేట్‌ కావడంతో ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోహిత్‌ ఒక బలమైన కంటెస్టెంట్‌ అని, హౌస్‌లో తన ఆటతీరుతో పాటు ప్రతి టాస్క్‌లోనూ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి కంటెస్టెంట్‌ను ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండా సడన్‌గా ఎలిమినేట్‌ చేయడం ఎంతవరకు సమంజసమని నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. రోహిత్‌కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉందని, అతడి ఆటతీరును పరిగణనలోకి తీసుకోకుండా ఈ నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా, రోహిత్‌ ఎలిమినేషన్‌ బిగ్‌బాస్‌ అభిమానులను షాక్‌కు గురిచేసిందని, ఈ నిర్ణయంపై నిర్వాహకులు మరోసారి ఆలోచించి ఉంటే బాగుండేదని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రోహిత్‌ ఎలిమినేషన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది.

ఫోక్ సింగర్ ఝాన్సీకి షాక్‌.. హౌస్‌ నుంచి ఎలిమినేట్‌!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలిమినేషన్‌ ప్రక్రియ మరోసారి ఉత్కంఠను రేకెత్తించింది. శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో ఫోక్‌ సింగర్‌ ఝాన్సీ జర్నీ ముగిసింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఓట్ల ఆధారంగా ఆమె హౌస్‌ను వీడాల్సి వస్తున్నట్లు హోస్ట్ నాగార్జున వెల్లడించారు. అంతకుముందు కంటెస్టెంట్ల ఆటతీరుపై హోస్ట్‌ నాగార్జున తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రదర్శన ఆధారంగా వారికి స్టార్స్‌ కేటాయించారు. సుధీర్‌, ఝాన్సీ, ఆర్కే, నీతూలకు సున్నా స్టార్స్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్కేపై నాగార్జున సరదాగా సెటైర్లు వేశారు. నవరస మామగా పేరున్న నీలో శోక రసం తప్ప మరేదీ కనిపించడం లేదంటూ వ్యాఖ్యానించారు. ఇక నరేశ్‌, రామ్‌ ప్రసాద్‌ తమ ఆటతో ఆకట్టుకోవడంతో వారికి ఐదు స్టార్స్‌ దక్కాయి. అనంతరం ఎలిమినేషన్‌ ప్రక్రియను ప్రారంభించడంతో హౌస్‌లో ఉత్కంఠ నెలకొంది. త్రిగుణ్‌ కుండలను పగలగొట్టే సమయంలో ఝాన్సీ ఫొటో కనిపించకపోవడంతో ఆమె ఎలిమినేషన్‌ ఖరారైంది. ఝాన్సీ హౌస్‌ నుంచి బయటకు వెళ్లాల్సి రావడంతో ముకేశ్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆమెను విడిచి ఉండలేక వెక్కివెక్కి ఏడ్చాడు. మరోవైపు ఝాన్సీ కూడా కన్నీళ్లు పెట్టుకోవడంతో హౌస్‌లో కొద్దిసేపు భావోద్వేగ వాతావరణం నెలకొంది.