కశ్మీర్.. తెల్లని మంచు దుప్పటిలో భూతల స్వర్గం
Kashmir Snowfall: కశ్మీర్.. మంచు కొండలను చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదు. శీతాకాలం ప్రారంభం కావడంతో.. మంచు కురుస్తుంది. దీంతో పర్యాటకులు కశ్మీర్‌కు క్యూ కట్టారు.

Kashmir Snowfall: శీతాకాలం ప్రారంభంతో భూతల స్వర్గం కశ్మీర్ సరికొత్త అందాలను సంతరించుకుంది. ఎటుచూసినా తెల్లని మంచు దుప్పటి.. కనుచూపు మేరలో మంచుతో నిండిన కొండలు.. ఆహ్లాదపరిచే వాతావరణం.. ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్న దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మంచు అందాలను చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదంటూ పర్యాటకులు మురిసిపోతున్నారు. ప్రకృతి ఒడిలో గడుపుతూ అక్కడి అందాలను తమ కెమెరాల్లో బంధించుకుంటున్నారు.
మంచు సోయగాలతో కనువిందు
కశ్మీర్ లోయలో శీతాకాలపు అందాలు మెల్లగా విస్తరిస్తున్నాయి. గుల్మార్గ్, సోనామార్గ్, పహల్గామ్, దూద్పత్రితో పాటు ద్రాస్, దోడా ప్రాంతాల్లోని ఎత్తైన కొండలు మంచుతో కప్పుకుపోయాయి. ముఖ్యంగా గుల్మార్గ్లో మంచు అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కొండలు, చెట్లు, పరిసర ప్రాంతాలన్నీ తెల్లని మంచుతో నిండిపోవడంతో ఆ ప్రాంతం ఓ అద్భుతమైన మంచు ప్రపంచాన్ని తలపిస్తోంది. హిమాలయాల సుందర దృశ్యాల మధ్య చల్లని గాలులను ఆస్వాదిస్తూ పర్యాటకులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
దాల్ లేక్‌లో బోట్ రైడ్స్.. పర్యాటకుల సందడి
మరోవైపు శ్రీనగర్ లోయలో వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు 6 నుంచి 8 డిగ్రీల మేర పడిపోయాయి. చలి తీవ్రత పెరిగినప్పటికీ పర్యాటకుల ఉత్సాహం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. దాల్ లేక్‌లో బోట్ రైడ్స్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. సరస్సు చుట్టూ కనిపించే పర్వతాలు, చల్లని వాతావరణం, ప్రశాంతమైన పరిసరాలు వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బొటానికల్ గార్డెన్ అందాలను తిలకిస్తూ కశ్మీర్ పర్యటనను మధుర జ్ఞాపకంగా మలుచుకుంటున్నారు. మంచుతో కప్పుకున్న కొండలను చూసి మంత్రముగ్ధులవుతున్నామని, ఇక్కడి ప్రకృతి అందాలను వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదని పర్యాటకులు చెబుతున్నారు.
భారీ హిమపాతంతో రహదారులు మూసివేత
అయితే కశ్మీర్లో మంచు అందాలు ఒకవైపు కనువిందు చేస్తుంటే.. మరోవైపు భారీ హిమపాతం రాకపోకలకు ఆటంకంగా మారుతోంది. కొండ ప్రాంతాల్లో రహదారులపై పెద్దఎత్తున మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. షోపియాన్, పూంచ్-రాజౌరీ జిల్లాలను కలిపే మొఘల్ రోడ్డు వరుసగా రెండో రోజు కూడా మూతపడింది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో రహదారులు మంచుతో కప్పుకుపోయాయి. దీంతో ఆర్సీసీ బీకాన్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మంచును తొలగించే పనులు చేపట్టారు.
మరో రెండు రోజులు వర్షాలు, మంచు
ఇదిలా ఉంటే మరో రెండు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 20 వరకు జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఎత్తైన కొండ ప్రాంతాలకు అనవసర ప్రయాణాలు చేయవద్దని, అధికారిక ట్రాఫిక్ సూచనలను తప్పనిసరిగా పాటించాలని పర్యాటకులు, స్థానికులకు సూచించారు. మొత్తంగా మంచు అందాలతో కశ్మీర్ లోయ పర్యాటకులను మరోసారి తనవైపు ఆకర్షిస్తోంది. ప్రకృతి ఒడిలో తెల్లని మంచు సోయగాలను ఆస్వాదిస్తూ.. ఈ అందాలను చూడటానికి రెండు కళ్లు చాలడం లేదంటూ పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



