Lalit Modi British Citizenship: త్వరలో భారత్‌కు తిరిగి వస్తారంటూ అప్పట్లో ప్రచారం.. కానీ లలిత్ మోదీ విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియాకు రావడం సంగతి అటుంచితే.. ఏకంగా బ్రిటన్ పౌరసత్వాన్ని స్వీకరించారు. ఐపీఎల్ వ్యవస్థాపకుడైన ఆయన స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఐపీఎల్ మాజీ ఛైర్మన్, వివాదాస్పద వ్యాపారవేత్త లలిత్ మోదీ బ్రిటన్ పౌరుడిగా మారారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15న అధికారికంగా బ్రిటిష్ పౌరసత్వం స్వీకరించినట్లు ప్రకటించారు. తన జీవితంలో ఇదొక ఎంతో ప్రత్యేకమైన, గర్వకారణమైన మైలురాయి అని పేర్కొన్నారు. శనివారం ఆక్స్‌ఫర్డ్ యూనియన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించిన ఆయన.. అనంతరం సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్టు చేశారు.

బ్రిటన్ సంప్రదాయలటే గౌరవం ఉంది: లలిత్ మోదీ

చాలా సంవత్సరాలుగా బ్రిటనే తన నివాసమని, అక్కడి ప్రజలు, సంస్థలు, సంప్రదాయాలు, విలువల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో పౌరసత్వ వేడుకను జరుపుకున్నట్లు వెల్లడించారు. బ్రిటిష్ పౌరసత్వం పొందడం ఒక అవకాశం మాత్రమే కాకుండా బాధ్యత కూడా అని పేర్కొన్నారు. ఇకపై ఆ దేశానికి సానుకూల సేవలు అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇన్నాళ్లు బ్రిటన్‌లో ఆశ్రయం పొందుతున్న లలిత్ మోదీ.. ఇప్పుడు ఏకంగా దేశ పౌరుడిగా మారిపోయారు.>

2010 నుంచి బ్రిటన్‌లో ఉంటున్న లలిత్

2010లో భారత్‌ను విడిచిపెట్టిన లలిత్ మోదీ అప్పటి నుంచి బ్రిటన్‌లోనే నివసిస్తున్నారు. ఐపీఎల్ నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఈ పరిణామాల మధ్య ఆయన దేశం విడిచి వెళ్లారు. అప్పట్లో ఆయన తిరిగి భారత్‌కు వస్తారనే ప్రచారం కూడా చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటివరకు ఆయన స్వదేశానికి తిరిగి రాలేదు. తాజాగా బ్రిటన్ పౌరసత్వం పొందినట్లు ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు.

2009 ఐపీఎల్ సీజన్ వ్యవహారంలో ఆరోపణలు

2009లో లోక్‌సభ ఎన్నికల కారణంగా ఐపీఎల్ టోర్నమెంట్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఈ క్రమంలో టోర్నీ నిర్వహణ కోసం విదేశాలకు నిధులు పంపే సమయంలో బీసీసీఐ ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఈ వ్యవహారంలో బీసీసీఐతో పాటు నిర్వాహకులపై కోట్ల రూపాయల జరిమానాలు విధించింది. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం నిధుల బదిలీకి సంబంధించిన ఆలస్యంపై లలిత్ మోదీకి సంబంధం లేదని ట్రిబ్యునల్ పేర్కొంది. నిధులు వచ్చే సమయానికే ఆయనను బీసీసీఐ సస్పెండ్ చేసినందున ఆయనపై విధించిన జరిమానాను రద్దు చేసింది. మరోవైపు బీసీసీఐపై విధించిన రూ.4 కోట్ల జరిమానాను ట్రిబ్యునల్ రూ.1 కోట్లకు తగ్గించింది. నిధులు చివరకు భారత్‌కు తిరిగి వచ్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. అయితే ఖాతా పుస్తకాల్లో చూపిన దానికంటే ఎక్కువ మొత్తాన్ని విదేశాలకు పంపినందుకు విధించిన మరో రూ.4 కోట్ల జరిమానాను మాత్రం కొనసాగించింది. మొత్తానికి లలిత్ మోదీ ఇండియాకు రావడం సంగతేమో గానీ.. విదేశాల్లో మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు.