US call centre fraud Hyderabad: వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికన్లే టార్గెట్‌.. ఒక్క ఫోన్‌ కాల్‌తో భయపెట్టడం.. డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో కంగారు పెట్టడం.. క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టడం. ఇదీ అంతర్జాతీయ సైబర్‌ నేరగాళ్ల మోసాల తీరు. అమాయకుల భయాన్ని పెట్టుబడిగా మార్చుకుని, వందల కోట్ల రూపాయలు దోచుకున్న ఓ అంతర్జాతీయ సైబర్‌ ముఠా గుట్టును హైదరాబాద్‌ ఈడీ అధికారులు రట్టు చేశారు. ఈ కేసులో నలుగురు కీలక నిందితులను అరెస్ట్‌ చేశారు. గత మూడేళ్లుగా అమెరికా పౌరులనే లక్ష్యంగా చేసుకుని ఈ సైబర్‌ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. హర్షల్‌ రావల్‌ నేతృత్వంలో నడిచిన ఈ ముఠా తొలుత హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ ఫేక్‌ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి అమెరికా పౌరులకు ఫోన్లు చేసి, డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో బెదిరింపులకు దిగేది. మరోవైపు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ ఆశ చూపేది. ఇలా భయపెట్టి, ఆశలు రేకెత్తించి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసేది.

రూ.261 కోట్లకు పైగా కొల్లగొట్టిన ముఠా

మాదాపూర్‌లోని ఫేక్‌ కాల్‌ సెంటర్‌పై దాడులు జరగడంతో నిందితులు తమ కార్యకలాపాలను ఆపలేదు. తమ మకాంను పంజాబ్‌లోని పాటియాకు మార్చారు. అక్కడ మరో ఫేక్‌ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి, అదే తరహాలో మోసాలను కొనసాగించారు. పాటియాలోని కాల్‌ సెంటర్‌ నుంచే అమెరికా పౌరులకు పెద్ద ఎత్తున ఫోన్లు చేస్తూ డిజిటల్‌ అరెస్ట్‌ బెదిరింపులు, క్రిప్టో పెట్టుబడుల ఎరతో వేలాది మందిని మోసం చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ ఫేక్‌ కాల్‌ సెంటర్ల ద్వారా అమెరికా పౌరుల నుంచి ఏకంగా రూ.261 కోట్లకు పైగా వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. బాధితుల నుంచి సేకరించిన సొమ్మును నిందితులు క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చేవారు. అనంతరం హవాలా మార్గాల్లో నగదును బదిలీ చేసేవారు. ఈ అక్రమ లావాదేవీల ఆనవాళ్లు బయటపడకుండా ఉండేందుకు వందలాది మ్యూల్‌ బ్యాంకు ఖాతాలను ఉపయోగించినట్లు ఈడీ విచారణలో తేలింది.

నలుగురిని కటకటాల్లోకి పంపించిన పోలీసులు

పక్కా ఆధారాలతో రంగంలోకి దిగిన హైదరాబాద్‌ ఈడీ అధికారులు పాటియాలో దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో ముఠా ప్రధాన సూత్రధారి హర్షల్‌ రావల్‌తో పాటు అతనికి సహకరించిన ప్రణవ్‌ పితాదియా, జశ్వంత్‌ సింగ్‌, చేతన్‌ ముంజల్‌లను అరెస్ట్‌ చేశారు. నిందితులను హైదరాబాద్‌కు తరలించి రిమాండ్‌కు పంపించారు. ఈ అంతర్జాతీయ సైబర్‌ మోసం వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీల నెట్‌వర్క్‌పై ఈడీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు.. ఈ ముఠాకు సహకరించిన హవాలా ఏజెంట్లు, మ్యూల్‌ ఖాతాల నిర్వాహకులు, ఇతర వ్యక్తుల పాత్రపై ఆరా తీస్తున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని ఈ మోసాల వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను వెలికితీసేందుకు సిద్ధమవుతున్నారు.

ఎదుటి వారి భయం.. సైబర్ నేరగాళ్ల పెట్టుబడి

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్‌ నేరగాళ్లు కూడా కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో భయపెట్టినా, క్రిప్టో పెట్టుబడుల పేరుతో ఆశ చూపినా.. అంతిమ లక్ష్యం మాత్రం ప్రజల సొమ్మును కొల్లగొట్టడమే. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండటమే తొలి రక్షణ. తెలియని వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌కు భయపడటం, అత్యాశతో పెట్టుబడులు పెట్టడం చివరకు ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు. సైబర్‌ నేరగాళ్ల మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండటమే అసలైన భద్రత.