Kalyani Murder Case: టెక్నాలజీ పరుగులు పెడుతోంది.. ప్రపంచం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది.. మనిషి ఆలోచనా విధానం మారుతోందని అనుకుంటున్నాం. ప్రేమ, పెళ్లి, వ్యక్తిగత స్వేచ్ఛపై సమాజంలో చర్చలు పెరుగుతున్నాయి. కానీ కొందరి ఆలోచనల్లో మాత్రం ఇంకా పాతకాలపు కట్టుబాట్లు, పరువు ప్రతిష్ఠల పేరుతో సాగుతున్న అహంకారం అలాగే ఉండిపోయింది. అందుకు నిదర్శనమే ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన. కన్న కూతురి ప్రాణాల కంటే కుటుంబ పరువే ముఖ్యమని భావించిన ఓ తండ్రి చివరకు ఆమె ప్రాణాలనే బలితీసుకున్నాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

ప్రేమించానని చెప్పడమే ఆమె చేసిన నేరమా..?

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామం. 18 ఏళ్ల కళ్యాణి జీవితంపై తల్లిదండ్రులు అప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారు. తమకు నచ్చిన యువకుడితో ఆమె వివాహం జరిపించాలని భావించారు. ఈ నెల 25వ తేదీన నిశ్చితార్థం ఖరారు చేశారు. అంతా అనుకున్నట్లుగానే జరిగిపోతుందని భావించారు. కానీ కళ్యాణి మనసులో మాత్రం మరో ఆలోచన ఉంది. తాను తల్లిదండ్రులు చూపించిన యువకుడిని పెళ్లి చేసుకోలేనని స్పష్టం చేసింది. తనకు సొంత మేనత్త కొడుకుపై ప్రేమ ఉందని అతడినే వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. తన జీవిత భాగస్వామిని తానే ఎంచుకోవాలనుకుంది. అయితే ఆమె మనసులోని మాట తల్లిదండ్రులకు ఆగ్రహాన్ని తెప్పించింది. కూతురు ప్రేమను అర్థం చేసుకోవాల్సిన చోట ఆగ్రహం, ఆవేశం చోటుచేసుకున్నాయి.

నిద్రలోనే కూతుర్ని చంపేసిన తండ్రి

సొంత చెల్లెలి కుమారుడిని ప్రేమించిన వ్యవహారాన్ని జీర్ణించుకోలేకపోయిన కళ్యాణి తండ్రి.. చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కుమార్తె నిద్ర పోతున్న సమయంలో కళ్యాణి గొంతు నులిమి చంపిన అనంతరం, అనుమానం రాకుండా మృతదేహాన్ని మరో గదిలోకి తీసుకెళ్లి ఉరేసుకున్నట్లుగా చిత్రీకరించాడు. ప్రేమించిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలనుకున్న ఆ యువతి కలలు అక్కడితో సమాధి అయ్యాయి. కూతురిని కాపాడాల్సిన తండ్రే ఆమె మరణానికి కారణమయ్యాడనే విషయం గ్రామంలో తీవ్ర సంచలనం సృష్టించింది.

సంప్రదాయానికి విరుద్దంగా అంత్యక్రియలు

కళ్యాణి మరణం తర్వాత కుటుంబ సభ్యులు వ్యవహరించిన తీరు గ్రామస్తుల్లో అనుమానాలకు తావిచ్చింది. బంధువులు ఎవరూ పెద్దగా రాకముందే హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కేవలం మూడు గంటల్లోనే అంత్యక్రియలు పూర్తి చేయడం, లంబాడ సంప్రదాయం ప్రకారం పెళ్లికాని యువతిని ఖననం చేయకుండా దహనం చేయడం వంటి పరిణామాలు గ్రామస్తులకు అనుమానం కలిగించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తల్లిదండ్రులను విచారించడంతో ఘటన వెనుక ఉన్న అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తానే కూతురిని హత్య చేసినట్లు తండ్రి కైలాస్ అంగీకరించినట్లు సమాచారం. తాను కుదిర్చిన వివాహాన్ని కాదని, తన చెల్లెలి కొడుకును ప్రేమించిందనే కారణంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడైంది.

ప్రేమిస్తే.. మరణశాసనం రాసేస్తారా..?

ఒకవైపు ప్రపంచం సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కుతోంది. చేతిలో స్మార్ట్‌ఫోన్‌తో ప్రపంచాన్ని చూస్తున్నాం. అంతరిక్ష పరిశోధనల నుంచి కృత్రిమ మేధస్సు వరకు ఎన్నో అద్భుతాలను సాధిస్తున్నాం. కానీ మరోవైపు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నందుకు సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే యువతులు ప్రాణాలు కోల్పోతున్నారు. పరువు, ప్రతిష్ఠ, సంప్రదాయం అనే పేర్లతో వ్యక్తుల జీవితాలపై నిర్ణయాలు రుద్దడం, వాటిని ధిక్కరిస్తే ప్రాణాలు తీసే స్థాయికి వెళ్లడం సమాజంలో ఆందోళన కలిగిస్తోంది.కూతురి పెళ్లి గురించి కలలు కనాల్సిన తండ్రి, ఆమె జీవితాన్నే అంతం చేశాడనే ఆరోపణలు సభ్య సమాజాన్ని కలచివేస్తున్నాయి. చివరకు పరువు కోసం చేసిన పని కుటుంబానికే మచ్చగా మిగిలింది. ఆధునిక యుగంలోనూ పరువు హత్యలు కొనసాగుతుండటం సమాజం ఆలోచనా విధానంలో ఇంకా ఎంత మార్పు రావాల్సి ఉందో గుర్తుచేస్తోంది.