APPSC Group-1 Scam ED Investigation

ఎక్కడెక్కడ సోదాలు..
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన అక్రమాల కేసులో ఈడీ దూకుడు పెంచింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తోంది. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసింది. బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్‌, విజయవాడ సహా ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పంచవటి కాలనీలోని క్యామ్‌సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో, ఆ సంస్థ ఎండీ పి.మధుసూదనరావు నివాసంలోనూ ఈడీ అధికారులు తనిఖీలు(APPSC Group-1 Scam ED Investigation) చేపట్టారు. సికింద్రాబాద్ డిఫెన్స్ కాలనీలోని ట్రూగ్రేడర్ సర్వీసెస్ కార్యాలయం, నేరేడ్‌మెట్‌లో అక్కెల్లపెరి శ్రీనివాసరావు, అల్వాల్ వెంకటాపురంలో మహంకాళి రఘురామ్‌కు సంబంధించిన నివాసాల్లో సోదాలు జరిగాయి. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలో ఉన్న ఆవాస రిసార్ట్ హైలాండ్‌లోనూ ఈడీ చేపట్టారు.

అసలేం జరిగింది?
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఇప్పటికే ఏపీపీఎస్సీ సిట్ విచారణ చేపట్టింది. ఈ కేసులో సిట్ సేకరించిన ఆధారాల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది. రీ వాల్యువేషన్ కోసం చేసిన కాంట్రాక్టులు, ప్రైవేట్ సంస్థలకు చెల్లించిన నిధులు, ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టింది. 2018లో 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020 డిసెంబర్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. అయితే అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, మూడుసార్లు మూల్యాంకన జరిగిందని కొందరు అభ్యర్థులు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. దీనితో నాటి నుంచి ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదే అంశంపై సిట్ (APPSC Group-1 Scam ED Investigation)ను నియమించింది.

సిట్‌ నివేదిక ఏం చెబుతోంది..
సిట్ విచారణ తర్వాత హైకోర్టు ఆదేశాలతో సిఐడి నేతృత్వంలోని సిట్ ఏర్పాటైంది. హై కోర్టుకు సిట్ తుది నివేదికను అందించింది. డిజిటల్ మూల్యాంకనంతో పాటు రెండు దశల్లో మాన్యువల్ మూల్యాంకనం నిర్వహించినట్లు సిట్ గుర్తించింది. మంగళగిరి సమీపంలోని హాయ్‌ల్యాండ్ రిసార్ట్‌లో ఏకంగా 84 రోజుల పాటు మూల్యాంకనం జరిగినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అర్హతలు లేని 66 మందితో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించారన్నది సిట్ ప్రధాన ఆరోపణ. ఈ ప్రక్రియ కోసం క్యామ్‌సైన్ మీడియాకు రూ. 1.14 కోట్లు.. డిజిటల్ మూల్యాంకన సంస్థలకు రూ.1.38 కోట్లు చెల్లించినట్లు సిట్(APPSC Group-1 Scam ED Investigation) గుర్తించింది. జవాబు పత్రాల్లో 287 బార్‌కోడ్లో తేడాలు ఉన్నాయని 169 స్లిప్పుల్లో కరెక్షన్ ఫ్లూయిడ్ వినియోగాన్ని సిట్ గుర్తించింది. 173 మంది సాక్షులను విచారించడంతో పాటు ఫోరెన్సిక్ ఆధారాలను కూడా పరిశీలించింది. ఈ వ్యవహారంపై 2025 ఏప్రిల్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. పీఎస్ఆర్ ఆంజనేయులు, మధుసూదనరావును గతంలోనే అరెస్టు చేశారు. తాజాగా ఈడీ రంగంలోకి దిగడంతో గ్రూప్-1 మూల్యాంకన వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు, కాంట్రాక్టుల వెనుక ఉన్న అంశాలపై ఉత్కంఠ నెలకొంది.