ED Summons Ambati Rambabu: మద్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు (Ambati Rambabu) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు ( బుధవారం) విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీంతో అంబటి రాంబాబు ఈడీ (ED Summons) విచారణకు వెళ్లనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఇదే కేసులో మరో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు కావడంతో అంబటి రాంబాబు విషయంలో ఈడీ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న చర్చ మొదలైంది. మద్యం అక్రమ రవాణా కేసు దర్యాప్తులో భాగంగా గతంలోనే ఈడీ అధికారులు అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేశారు. అయితే తన ఆరోగ్యం బాగోలేదని పేర్కొంటూ ఆయన విచారణకు హాజరుకాలేనని లెటర్‌ను పంపించారు. ఆ తర్వాత తనకు గుండెకు స్టెంట్లు వేయించుకున్నట్లు, ఆసుపత్రి అందించిన వైద్య నివేదికను కూడా ఈడీ అధికారులకు (ED Summons) పంపించారు. దీంతో ఇన్నాళ్లు విచారణకు వెళ్లలేదు. అయితే మరోసారి ఈడీ అధికారులు విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. దీంతో అంబటి రాంబాబు రేపు ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

అంబటి రాంబాబును ఈడీ విచారణ ఎందుకు..?

2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో అమలైన ఎక్సైజ్ పాలసీ మార్పులు, మద్యం రవాణా టెండర్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ 2024లో కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED Summons) కూడా దర్యాప్తు ప్రారంభించింది. మద్యం రవాణా టెండర్లకు సంబంధించిన నిబంధనలను మార్చడం ద్వారా కొందరికి భారీగా ఆర్థిక ప్రయోజనాలు కల్పించారన్న అనుమానాలను ఈడీ వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా మద్యం రవాణా కాంట్రాక్టుల కేటాయింపులో జరిగిన పరిణామాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు అనుచరుడికి మద్యం రవాణా కాంట్రాక్టు ఇప్పించడంలో ఆయన పాత్రతో పాటు.. ఆ అనుచరుడికి కాంట్రాక్టు దక్కేలా చేయడానికి గల కారణాలు ఏంటి..? టెండర్ల ప్రక్రియలో ఏవైనా నిబంధనలు మార్చారా అనే కోణంలో ఈడీ అధికారులు విచారణ చేసే అవకాశం ఉంది.

అంబటి రాంబాబు అరెస్ట్ తప్పదా..?

ఈ కేసులో ఇప్పటికే కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అయితే ఆయనకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఇదే కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు (Ambati Rambabu) ఈడీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఆరోగ్య కారణాలతో విచారణకు హాజరుకాలేకపోయిన ఆయన, ఈసారి అధికారుల ఎదుట హాజరుకానున్నారు. ఇప్పటికే ఇదే కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు అరెస్ట్ వంటి పరిణామాల నేపథ్యంలో అంబటి రాంబాబు విచారణపై ఉత్కంఠ నెలకొంది. మద్యం రవాణా కాంట్రాక్టు తన అనుచరుడికి ఇప్పించడంలో అంబటి పాత్రపై ఈడీ అధికారులు ప్రశ్నించనున్న నేపథ్యంలో ఈ విచారణ కీలకంగా మారనుంది. అంబటి రాంబాబు విచారణతో ఈ కేసు దర్యాప్తులో తదుపరి పరిణామాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.