‘కమ్ టు గాంధీ భవన్ రాజగోపాల్‌రెడ్డి’
Telangana Congress Internal Rift: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయాలు మరింత ముదురుతున్నాయి. రెండు రోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వెంటనే రాజగోపాల్‌రెడ్డికి అధిష్టానం నుంచి ఫోన్ కాల్ వెళ్లింది..

Telangana Congress Internal Rift: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య కొనసాగుతున్న రాజకీయ మాటల యుద్ధం పార్టీ అధిష్టానం దృష్టికి చేరింది. ప్రభుత్వ పనితీరుపై రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వాటికి సీఎం రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో వాతావరణం వేడెక్కింది. ఈ పరిణామాలను సీరియస్‌గా తీసుకున్న ఏఐసీసీ.. తాజాగా రాజగోపాల్‌రెడ్డికి ఫోన్ చేసి సమావేశానికి రావాలని సూచించింది. దీంతో ఆయనపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
రాజగోపాల్‌రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపు
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఫోన్ కాల్ రావడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 23న తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జి బి.ఎం. సందీప్‌ను కలవాలని ఏఐసీసీ కార్యదర్శి సూచించినట్లు సమాచారం. ఇటీవల రాజగోపాల్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో పార్టీ క్రమశిక్షణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది హైకమాండ్ పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో కొండా సురేఖ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. ఆమె విషయంలోనూ వెంటనే చర్యలు తీసుకోలేదని, పలుమార్లు పరిశీలించిన తర్వాతే అధిష్టానం నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు.
ప్రభుత్వంపై ప్రశ్నలు.. సీఎంపై నేరుగా విమర్శలు
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. ప్రభుత్వ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరును ఆయన తప్పుబట్టారు. ప్రస్తుతం ఉన్న సిటీ అభివృద్ధికే దిక్కులేకపోతే ఫ్యూచర్ సిటీ నిర్మాణం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కొడంగల్‌కు, మంత్రులు తమ తమ నియోజకవర్గాలకు మాత్రమే నిధులు తీసుకెళ్తున్నారని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గానికి నిధులు నిలిపివేస్తే మాత్రం ఊరుకునేది లేదని, మరో కురుక్షేత్రానికి సిద్ధమవుతానంటూ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు దారితీశాయి.యమరోవైపు సిద్ధిపేట సభలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేయడం రాజకీయ వేడిని మరింత పెంచింది. దీంతో ఇరువురు నేతల మధ్య విభేదాలు బహిరంగ చర్చగా మారాయి.
22, 23 తేదీల్లో సందీప్ వరుస సమావేశాలు
తెలంగాణ కాంగ్రెస్ కొత్త వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమితులైన బి.ఎం. సందీప్ ఆదివారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 22న గాంధీభవన్‌లో జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పీసీసీ సంయుక్త సమావేశంలో పాల్గొంటారు. 23న ఉదయం మంత్రులతో, మధ్యాహ్నం నుంచి డీసీసీ అధ్యక్షులు, పీసీసీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం ఈ నెల 27న మరోసారి హైదరాబాద్‌కు వచ్చి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశం కానున్నారు. ముఖ్యనేతల అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు జిల్లాలవారీగా పార్టీ కార్యకలాపాలపై వివరాలు సేకరించనున్నారు.
కొండా సురేఖ తరహా పరిణామాలు రిపీట్ అవుతాయా..?
గతంలో కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా వరంగల్‌లో జరిగిన సభలో ఆమె కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేశారు. ఆ తర్వాత కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన అధిష్టానం ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించింది. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం కూడా అధిష్టానం వద్దకు చేరడంతో మరోసారి అలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయా అన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో రాజగోపాల్‌రెడ్డికి అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి మలుపునకు దారితీస్తుందన్న ఆసక్తి నెలకొంది.



