రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి.. కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు..!
Revanth Reddy vs Komatireddy: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి మాటల యుద్ధం నెలకొంది. సీఎం రేవంత్ టార్గెట్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే రీతిలో సీఎం రేవంత్‌రెడ్డి సైతం సిద్దిపేట సభ వేదికగా ఘాటు కౌంటర్ ఇచ్చింది.

Revanth Reddy vs Komatireddy: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. మునుగోడు వేదికగా సీఎం తీరును ప్రశ్నించిన రాజగోపాల్‌రెడ్డి.. నియోజకవర్గాల అభివృద్ధి, నిధుల కేటాయింపులు, హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు సిద్దిపేట సభలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. దీంతో హస్తం పార్టీలో అంతర్గత రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి.
మునుగోడుకు నిధులేవీ?.. సీఎంను నిలదీసిన కోమటిరెడ్డి..!
మునుగోడులో బుధవారం జరిగిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్ నియోజకవర్గానికి రూ.10 వేల కోట్ల నిధులు ఇస్తామని చెబుతున్న సీఎం.. మునుగోడు అభివృద్ధికి కనీసం రూ.500 కోట్లు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో కొడంగల్, మధిర, హుజూర్నగర్ నియోజకవర్గాలే ఉన్నాయా… మిగిలిన 116 నియోజకవర్గాలు లేవా? అంటూ నిలదీశారు. అభివృద్ధి కోసం నిధులు అడిగితే పండబెట్టి తొకుతా అంటూ మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగిన భాష కాదని విమర్శించారు. అదృష్టం కలిసొచ్చి ముఖ్యమంత్రి అయ్యావని, మరో రెండేళ్లయినా ప్రజలతో మంచిగా ఉండాలని రేవంత్‌రెడ్డికి హితవు పలికారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లో సుమారు రూ.5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి సోదరుల ప్రమేయం ఉందంటూ రాజగోపాల్‌రెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
పిచ్చికుక్క కరిచినట్లుంది.. రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
రాజగోపాల్‌రెడ్డి వరుస విమర్శల నేపథ్యంలో సిద్దిపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తమ పార్టీలో కొందరు పిచ్చికుక్క కరిచినట్లుగా వ్యవహరిస్తున్నారంటూ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. చెడు విషయాలను చెవిలో చెప్పాలని, మంచి విషయాలను మైక్‌లో చెప్పాలని పేర్కొన్న రేవంత్‌రెడ్డి.. కొందరు మాత్రం చెడును బహిరంగంగా చెబుతూ, మంచిని తన ఇంటికి వచ్చి చెవిలో చెబుతున్నారని వ్యాఖ్యానించారు. రెండు రోజులుగా రాజగోపాల్‌రెడ్డి చేస్తున్న విమర్శలపై ఏఐసీసీకి ఫిర్యాదు చేశామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రకటించిన కొద్దిసేపటికే సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది.
కోమటిరెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్
మరోవైపు ఈ వివాదంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి కూడా స్పందించారు. కాంట్రాక్టులు దక్కనంతకాలం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సొంత పార్టీలోనే ప్రతిపక్షంలా వ్యవహరిస్తారని విమర్శించారు. ఒక్క కాంట్రాక్టు దక్కితే చాలు.. వెంటనే సీఎం రేవంత్‌రెడ్డికి అనుకూలంగా మాట్లాడతారని ఆరోపించారు. మంత్రి పదవి, కాంట్రాక్టులు రాకపోవడమే రేవంత్‌రెడ్డిపై విమర్శలకు కారణమని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పదవులు, కాంట్రాక్టుల కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలపై నిజంగా అభిమానం ఉంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అధిష్టానం యాక్షన్‌పై నేతల వెయిటింగ్
ముఖ్యమంత్రి, సొంత పార్టీ ఎమ్మెల్యే మధ్య బహిరంగంగా సాగుతున్న ఈ విమర్శలు తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త చర్చకు తెరలేపాయి. ఒకవైపు నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులపై ప్రశ్నలు, మరోవైపు ప్రభుత్వ భూముల వ్యవహారంపై ఆరోపణలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి చేసిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందిస్తుందా…? పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య వివాదానికి ముగింపు పలుకుతుందా.. లేక బహిరంగ విమర్శలు చేయవద్దంటూ ఎమ్మెల్యేకు క్రమశిక్షణపై సూచనలు చేస్తుందా..? అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.



