Dating App Scam: అందమైన యువకులారా.. ఈ స్టోరీ మీకోసమే.. పూర్తిగా చదివితే డేటింగ్ యాప్‌ల పేరుతో జరుగుతున్న మోసాలు, వాటి వెనుక ఉన్న ప్రమాదాలు ఏంటో మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులే నిజ జీవితంలోనూ అలాగే ఉంటారని గుడ్డిగా నమ్మేవారికి ఈ ఘటన ఓ కనువిప్పు కావాలి. ఒకప్పుడు ప్రేమించాలంటే కాలేజీల్లోనో, బస్టాపుల్లోనో, పార్కుల్లోనో పరిచయాలు పెంచుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. చేతిలో స్మార్ట్‌ఫోన్, అందులో ఓ డేటింగ్ యాప్ ఉంటే చాలు.. ప్రపంచంలోని ఏ మూలన ఉన్నవారితోనైనా పరిచయం పెంచుకోవచ్చు. చాటింగ్ చేయొచ్చు.. ప్రేమించుకోవచ్చు.. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకోవచ్చు. అయితే ఈ ఆన్‌లైన్ ప్రేమల వెనుక అసలు నిజాలు తెలుసుకోకుండా ముందడుగు వేస్తే ఇలాంటి షాకులే ఎదురవుతాయి.

డేటింగ్ యాప్‌లో పరిచయం.. ప్రేమగా మారిన బంధం

హర్యానాలోని పానీపట్‌కు చెందిన నితిన్ అనే యువకుడి కథే ఇందుకు ఉదాహరణ. 31 ఏళ్ల నితిన్ ఉన్నత చదువులు చదువుకున్నాడు. కెనడాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న అతడికి జీవితంలో ఓ తోడు కావాలనిపించింది. తన మనసును అర్థం చేసుకునే యువతి పరిచయమైతే బాగుంటుందని భావించాడు. ఈ విషయాన్ని స్నేహితులతో పంచుకోగా.. డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయాలు పెంచుకోవచ్చని సలహా ఇచ్చారు. దీంతో వెంటనే ఓ డేటింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నాడు. అందులో యువతుల ప్రొఫైల్స్ వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో కెనడాకు చెందిన ఓ మహిళ ఫొటో అతడిని ఆకర్షించింది. ఆమె అందానికి ముగ్ధుడైన నితిన్.. వెంటనే చాటింగ్ మొదలుపెట్టాడు. అలా మొదలైన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ తరచూ మాట్లాడుకోవడం, వ్యక్తిగత విషయాలు పంచుకోవడంతో తమ మధ్య బలమైన అనుబంధం ఏర్పడిందని భావించారు. చివరకు పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు.

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్..

తనను ప్రేమిస్తున్న యువతి కెనడాలో ఉందని తెలుసుకున్న నితిన్.. ఆమెను భారత్‌కు రావాలని కోరాడు. దీంతో ఆమె పర్యాటక వీసాపై ఈ నెల 11న విమానంలో బయలుదేరి ఢిల్లీలో దిగింది. తన ప్రేమను ప్రత్యక్షంగా కలుసుకోవాలనే ఆశతో నితిన్ కూడా ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లాడు. అయితే అక్కడే అతడికి ఊహించని షాక్ తగిలింది. డేటింగ్ యాప్‌లో చూసిన ఫొటోలోని యువతి కోసం ఎదురుచూస్తున్న నితిన్‌కు.. ఎదురుగా కనిపించిన మహిళను చూసి నోట మాట రాలేదు. ఆమె వయసు 61 సంవత్సరాలు అని తెలియడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. తాను ఇన్నాళ్లూ చాటింగ్ చేసింది యువతితో కాదని, వాస్తవానికి ఆమె ఓ వృద్ధ మహిళ అని తెలుసుకొని షాక్‌కు గురయ్యాడు. యాప్‌లో కనిపించిన ఫొటోకు, నేరుగా వచ్చిన మహిళకు పొంతనే లేకపోవడంతో తనను మోసం చేశారని భావించాడు. దీంతో ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు.

పోలీస్ స్టేషన్‌లో ప్రేమ పంచాయతీ

ఈ వ్యవహారం చివరకు కెనడా ఎంబసీ దృష్టికి వెళ్లి, పోలీస్‌స్టేషన్‌కు చేరింది. పోలీసులు ఇద్దరినీ విచారించారు. అనంతరం మహిళను తిరిగి కెనడాకు పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తాను డేటింగ్ యాప్‌లో చూసిన ఫొటోను నమ్మి ప్రేమలో పడ్డానని, తీరా ప్రత్యక్షంగా కలిసినప్పుడు అసలు విషయం తెలిసిందని నితిన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటన యువతకు ఎన్నో హెచ్చరికలు ఇస్తోంది. డేటింగ్ యాప్‌లలో కనిపించే ప్రతి ఫొటో నిజమైనదే అని నమ్మకూడదు. ప్రొఫైల్‌లో ఇచ్చిన వయసు, వివరాలు కూడా వాస్తవమేనని భావించకూడదు. కొందరు ఇతరుల ఫొటోలు ఉపయోగించి నకిలీ ఖాతాలు సృష్టించే అవకాశం ఉంది. మరికొందరు తమ అసలు గుర్తింపును దాచిపెట్టి పరిచయాలు పెంచుకోవచ్చు. అందుకే ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తిని నేరుగా కలిసే ముందు వారి గుర్తింపును నిర్ధారించుకోవాలి. వీడియో కాల్ ద్వారా మాట్లాడటం, ఇతర విశ్వసనీయ మార్గాల్లో వివరాలను ధ్రువీకరించుకోవడం మంచిది. ముఖ్యంగా డబ్బులు, వ్యక్తిగత సమాచారం, ఫొటోలు వంటి వాటిని అపరిచితులతో పంచుకోకూడదు.

గుర్తుంచుకోండి.. డేటింగ్ యాప్‌లో కనిపించే అందమైన ఫొటో నిజ జీవితంలోని వ్యక్తికి హామీ కాదు. ప్రేమలో పడటం తప్పు కాదు.. కానీ కళ్లు మూసుకొని నమ్మడం మాత్రం ప్రమాదకరం..