Telangana Gig Workers Welfare Scheme: తెలంగాణలో గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇప్పటివరకు సరైన గుర్తింపు, చట్టపరమైన రక్షణ, సామాజిక భద్రతకు దూరంగా ఉన్న గిగ్‌ వర్కర్లకు అండగా నిలిచేందుకు సంచలన సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది. గిగ్‌ వర్కర్లకు ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత, పెన్షన్‌ సౌకర్యంతో పాటు ప్రత్యేక గుర్తింపు కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. గిగ్‌ వర్కర్ల సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం కీలక హామీలు ప్రకటించింది. విధి నిర్వహణలో ప్రమాదాలు ఎదురైతే ఆర్థికంగా ఆదుకునేందుకు రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించనుంది. అలాగే ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ కల్పించేందుకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఆరోగ్య భద్రత అందించనుంది. గిగ్‌ వర్కర్లకు పెన్షన్‌ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు రాహుల్‌ గాంధీ వెల్లడించారు.

ప్రభుత్వ రికార్డుల్లోకి గిగ్ వర్కర్ల వివరాలు: రాహుల్ గాంధీ

గిగ్‌ వర్కర్లకు ఇప్పటివరకు సరైన గుర్తింపు లేకపోవడాన్ని రాహుల్‌ గాంధీ ప్రస్తావించారు. సాధారణంగా అన్ని కంపెనీలకు తమ ఉద్యోగుల వివరాలు అందుబాటులో ఉంటాయని, కానీ గిగ్‌ వర్కర్లకు సంబంధించి సమగ్ర డేటా ఉండటం లేదని పేర్కొన్నారు. ఇకపై ప్రతి గిగ్‌ వర్కర్‌ వివరాలు ప్రభుత్వ వద్ద ఉంటాయని, వారు తమ సమాచారాన్ని ఎక్కడైనా చూసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. గిగ్‌ వర్కర్లకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు అందిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. తద్వారా వారికి చట్టపరమైన గుర్తింపు, రక్షణ కల్పించడంతో పాటు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. గిగ్‌ వర్కర్లకు కేవలం బీమా, ఆరోగ్య భద్రత మాత్రమే కాకుండా వారి రోజువారీ పని పరిస్థితులను మెరుగుపరిచేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా వైఫై సౌకర్యంతో కూడిన ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు రాహుల్‌ గాంధీ వెల్లడించారు. పని మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి, అవసరమైన సౌకర్యాలు పొందడానికి ఇవి ఉపయోగపడనున్నాయి.

ప్రజా సమస్యలు తెలుసుకోవడం కాంగ్రెస్ లక్ష్యం: రాహుల్

గిగ్‌ వర్కర్ల బాధలు, కష్టాలను తాను విన్నానని రాహుల్‌ గాంధీ తెలిపారు. వారికి న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత, పెన్షన్‌, గుర్తింపు, వైఫైతో కూడిన షెల్టర్ల వంటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్‌కు ప్రజల సమస్యలు నచ్చవని రాహుల్‌ గాంధీ విమర్శించారు. మోదీకి రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసని, కాంగ్రెస్‌కు ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటిని పరిష్కరించడం కూడా తెలుసని వ్యాఖ్యానించారు.

గిగ్ వర్కర్ బోర్డును ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్

గిగ్‌ వర్కర్లు ఎంతో కష్టపడుతున్నప్పటికీ వారి శ్రమకు తగిన చట్టబద్ధమైన ఆదాయం, రక్షణ లభించడం లేదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అలాంటి కార్మికులకు చట్టపరమైన రక్షణ, గుర్తింపు కల్పించాలనే లక్ష్యంతోనే ఈ పథకాన్ని ప్రారంభించినట్లు వివరించారు. గిగ్‌ వర్కర్లకు న్యాయం చేస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారని, ఆ హామీని అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. నెహ్రూ జయంతి సందర్భంగా ఈ సంక్షేమ పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గిగ్‌ వర్కర్లకు గుర్తింపు ఇచ్చి, వారి సంక్షేమానికి భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్న రేవంత్‌ రెడ్డి.. మాట ఇస్తే మట్టిలో కలిసినా మాట తప్పని కుటుంబం రాహుల్‌ గాంధీ కుటుంబమని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో స్కూటీపై ప్రయాణించిన రాహుల్

గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభానికి ముందు గిగ్‌ వర్కర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో గిగ్‌ వర్కర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.