రేవంత్‌రెడ్డి మాస్టర్ ప్లాన్.. కోటి ఓట్లు.. 90 సీట్లే టార్గెట్
Revanth Reddy Master Plan: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం రేవంత్ చేస్తున్న ప్లాన్స్ ఏంటి..? నేతలకు ఇప్పటి నుంచే దిశానిర్దేశం చేయడం మొదలు పెట్టారా..? కోటి ఓట్లు, 90 సీట్ల వెనుక వ్యూహాం ఏంటి..?

Revanth Reddy Master Plan: తెలంగాణలో మరోసారి అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది. మిగిలిన రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోటి ఓట్లు, 90 స్థానాలు సాధించాలనే లక్ష్యాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నిర్దేశించుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేశారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
గత ఎన్నికల ఫలితాలే ప్రాతిపదిక
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 92 లక్షల ఓట్లు సాధించి 64 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలకే పరిమితమైంది. గ్రాడ్యుయేట్, టీచర్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఎదురైన ఫలితాలు పార్టీలో చర్చకు దారితీశాయి. మరోవైపు బీఆర్ఎస్ తిరిగి పుంజుకునే ప్రయత్నం చేస్తుండగా, బీజేపీ కూడా తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఈ పరిణామాల మధ్య సీఎం మాత్రం వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే అధికారమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నేతల్లో ఆత్మవిశ్వాసం నింపే వ్యూహం
పార్టీలో అంతర్గత విభేదాలు, ప్రభుత్వ పనితీరుపై వస్తున్న విమర్శలను అధిగమించేందుకు గెలుపు లక్ష్యాన్ని ముందుగానే ప్రకటించినట్లు తెలుస్తోంది. నాయకులు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు అసంతృప్తి నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం కూడా ఈ ప్రకటన వెనుక ఉద్దేశమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాబోయే రెండేళ్లలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మూసీ ప్రక్షాళన, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, రహదారులు, ఫ్యూచర్ సిటీ, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు వంటి 20కి పైగా కీలక ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎన్నికల నాటికి వీటిలో ఎక్కువ పనులను పూర్తి చేసి అభివృద్ధిని ప్రజలకు చూపించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.
సీట్లు పెరిగితే ప్లాన్ ఏ.. పెరగకపోతే ప్లాన్ బీ
నియోజకవర్గాల పునర్విభజనపైనా రేవంత్‌రెడ్డి ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ స్థానాలు పెరిగినా, రిజర్వేషన్లలో మార్పులు వచ్చినా తమకు రాజకీయంగా అనుకూలిస్తుందని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీట్ల సంఖ్య పెరగకపోయినా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మరో ప్రణాళికతో ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. జమిలి ఎన్నికలు జరిగితే 2029లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి వచ్చే అవకాశం ఉందని సీఎం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడు కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ ప్రభావం తగ్గుతుందని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ ఎంట్రీ ఇస్తే మరో వ్యూహం
అయితే కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందన్న అంచనా కూడా కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. అలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. మొత్తంగా కోటి ఓట్లు, 90 సీట్ల లక్ష్యంతో రేవంత్‌రెడ్డి వేస్తున్న అడుగులు, రాబోయే రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.



