పెళ్లికి జగన్ దూరం.. తాడేపల్లిలో జగన్ ప్రత్యక్షం
YS Jagan skip Anjali wedding: షర్మిల కుమార్తె వివాహానికి జగన్ ఎందుకు వెళ్లలేదు..? పెళ్లి రోజు బెంగళూరు నుంచి తాడేపల్లికి ఎందుకు వచ్చారు..? ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

YS Jagan skip Anjali wedding: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న పరిణామమైనా రాజకీయంగా, సామాజికంగా ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో కుటుంబానికి సంబంధించిన ప్రతి సందర్భం చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా షర్మిల కుమార్తె అంజలిరెడ్డి వివాహ వేడుక ఈ చర్చకు మరోసారి కేంద్రబిందువుగా మారింది. బెంగళూరులో అంజలిరెడ్డి వివాహం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. అయితే ఈ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డి హాజరుకాకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఒకవైపు మేనకోడలి వివాహ వేడుక జరుగుతుంటే.. మరోవైపు జగన్ దంపతులు తాడేపల్లిలో కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో అసలు జగన్ దంపతులు పెళ్లికి ఎందుకు దూరంగా ఉన్నారనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ప్రైవేటు హోటల్లో అంజలిరెడ్డి వివాహం
వైఎస్ షర్మిల కుమార్తె అంజలిరెడ్డి వివాహం బెంగళూరులో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కుటుంబంలో ఎంతో ముఖ్యమైన శుభకార్యం కావడంతో వైఎస్ కుటుంబానికి చెందిన ప్రముఖుల హాజరుపై మొదటి నుంచీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మేనకోడలి వివాహం కావడంతో జగన్ తప్పకుండా హాజరవుతారని, కుటుంబ సభ్యుడిగా పెళ్లి వేడుకలో పాల్గొంటారని చాలామంది భావించారు. కుటుంబంలో విభేదాలు ఉన్నప్పటికీ ఇలాంటి శుభకార్యాల సమయంలో అవన్నీ పక్కనపెట్టి కలుస్తారనే అంచనాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ అంచనాలకు భిన్నంగా జగన్ దంపతులు వివాహ వేడుకకు హాజరుకాలేదు. జగన్ గైర్హాజరు కావడం ఒక్కటే కాకుండా, అదే సమయంలో ఆయన భార్య భారతి రెడ్డి కూడా పెళ్లి వేడుకలో కనిపించకపోవడంతో ఈ అంశంపై మరింత ఆసక్తి పెరిగింది.
యలహంక ప్యాలెస్‌లో పెళ్లికి నో.. ప్రైవేట్ హోటల్‌కు మారిన వేదిక
ఈ వివాహ వేడుకకు సంబంధించి మరో కీలక పరిణామం బెంగళూరులోని యలహంక ప్యాలెస్ వ్యవహారం. మొదట అంజలిరెడ్డి వివాహ వేడుకను బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో నిర్వహించనున్నట్లు షర్మిల ముద్రించిన వివాహ ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. దీంతో వివాహ వేదికపై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది.అయితే అప్పటికే వైఎస్ కుటుంబంలో ఆస్తులు, కుటుంబ సంబంధాలకు సంబంధించి విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో యలహంక ప్యాలెస్ అంశం కూడా చర్చకు వచ్చింది. వివాహం కోసం ఆ ప్యాలెస్‌ను ఉపయోగించుకునే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో యలహంక ప్యాలెస్‌లో వివాహ వేడుక నిర్వహించడంపై జగన్ లేఖ రాయడం సంచలనంగా మారింది. దీంతో అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కుటుంబంలో జరుగుతున్న శుభకార్యానికి వేదిక విషయంలోనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.మరోవైపు బెంగళూరులోని ప్యాలెస్‌లోకి వెళ్లేందుకు షర్మిల, విజయమ్మ ప్రయత్నించినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామాలతో చివరకు ముందుగా నిర్ణయించిన వేదికలో కాకుండా ఓ ప్రైవేట్ హోటల్లో వివాహ వేడుకను నిర్వహించాల్సి వచ్చింది.
బెంగళూరులో పెళ్లి సందడి.. తాడేపల్లిలో జగన్ దంపతులు
అంజలిరెడ్డి వివాహం బెంగళూరులో జరుగుతున్న సమయంలో జగన్, భారతి రెడ్డి తాడేపల్లికి చేరుకోవడం ఇప్పుడు మరో చర్చకు కారణమైంది. ఒకవైపు షర్మిల కుమార్తె పెళ్లి వేడుక జరుగుతుండగా, మరోవైపు జగన్ దంపతులు తాడేపల్లిలో కనిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. నకోడలి వివాహం వంటి కుటుంబ వేడుకకు హాజరుకాకుండా తాడేపల్లిలో ఉండటానికి కారణాలేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా జగన్, షర్మిల మధ్య రాజకీయంగా విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ గైర్హాజరును కూడా అదే కోణంలో కొందరు విశ్లేషిస్తున్నారు. కుటుంబంలో నెలకొన్న ఆస్తి సంబంధిత వివాదాలు, రాజకీయ విభేదాలు పరస్పరం ప్రభావం చూపుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయ విభేదాలా.. కుటుంబ కారణాలా..?
వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య విభేదాలు కొత్త విషయమేమీ కాదు. రాజకీయంగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే చర్చ చాలా కాలంగా కొనసాగుతోంది. కుటుంబానికి సంబంధించిన ఆస్తుల వ్యవహారం కూడా ఈ విభేదాలకు మరో కోణంగా మారింది. నేపథ్యంలో షర్మిల కుమార్తె వివాహానికి జగన్ దంపతులు హాజరుకాకపోవడాన్ని పలువురు రాజకీయ పరిణామాలతో ముడిపెట్టి చూస్తున్నారు. కుటుంబంలో జరిగే శుభకార్యాలు సాధారణంగా విభేదాలను పక్కనపెట్టి అందరినీ ఒకచోట చేర్చే సందర్భాలుగా ఉంటాయి. అలాంటి వేడుకలోనూ జగన్ దంపతులు కనిపించకపోవడం సహజంగానే చర్చకు దారితీసింది. అంజలిరెడ్డి వివాహం పూర్తయినప్పటికీ ఇప్పుడు అందరి దృష్టి రిసెప్షన్పై పడింది. త్వరలో జరగనున్న రిసెప్షన్‌కు జగన్ దంపతులు హాజరవుతారా..? లేదా వివాహ వేడుకకు మాదిరిగానే దూరంగా ఉంటారా..? అన్న చర్చ మొదలైంది.



