సినిమాలు.. వెబ్‌సిరీస్‌ల్లోనూ గులాబీ రాజకీయం
BRS Politics in Movies and Web Series: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ట్రెండ్ సృష్టిస్తుందా..? ఇన్నాళ్లు ప్రచారం అంటే కేవలం గ్రామాల్లో డప్పులు, సభలే కాదు.. సరికొత్త అస్త్రాలను తెరపైకి తీసుకొస్తుందా..? తెరపై కేసీఆర్ పాత్రలను ఎలాంటి రోల్‌ను ప్లే చేయబోతున్నాయి.. ఇప్పుడు ఇదే తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది.

BRS Politics in Movies and Web Series: తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు ప్రజా ఉద్యమాలు, సభలు, సమావేశాలు, పాదయాత్రల ద్వారా తమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన రాజకీయ పార్టీలు.. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త వేదికలపై కూడా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటీవల సినిమా, డాక్యుమెంటరీలు, వెబ్‌సిరీస్‌ల చుట్టూ చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి. రాజకీయ వేదికలకే పరిమితం కాకుండా వినోద రంగంలోనూ తెలంగాణ ఉద్యమ చరిత్ర, కేసీఆర్ నాయకత్వం, గులాబీ పార్టీ ప్రస్తావనలు తెరపైకి వస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ప్యారడైజ్ సినిమాలో శంకరన్న పాత్రపై ఆసక్తి..!
నేచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా ఈ చర్చకు మరింత బూస్ట్ ఇచ్చింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమాలో నటుడు ప్రియదర్శి పోషించిన శంకరన్న పాత్ర కేసీఆర్‌ను పోలి ఉందంటూ ప్రేక్షకుల్లో చర్చ మొదలైంది. తెలంగాణ యాస, వేషధారణ, హావభావాలు, నాయకత్వ లక్షణాలు కేసీఆర్‌ను గుర్తుకు తెస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా హైదరాబాద్‌లోని థియేటర్‌కు వెళ్లి సినిమా వీక్షించడం మరింత ఆసక్తిని పెంచింది. సినిమా చూసిన అనంతరం తెలంగాణ సంస్కృతి, అస్తిత్వ పోరాటాన్ని తెరకెక్కించిన చిత్రబృందాన్ని ఆయన అభినందించారు. అయితే దర్శకుడు ఈ కథ, పాత్రలు కల్పితమైనవని కూడా వివరించారు. కానీ శంకరన్న పాత్రపై బీఆర్ఎస్ నేతలు జోరుగా ప్రచారం చేశారు.
నాట్ ఎ మహాత్మాతో మరోసారి కేసీఆర్ దీక్ష చర్చ
ఇప్పుడు నాట్ ఎ మహాత్మా పేరుతో రాబోతున్న డాక్యుమెంటరీ వెబ్‌సిరీస్ మరోసారి తెలంగాణ రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. 2009లో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో ఈ సిరీస్‌ను రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిన ఆ దీక్ష వెనుక జరిగిన పరిణామాలు, అప్పటి రాజకీయ పరిస్థితులను నాలుగు ఎపిసోడ్లలో ఆవిష్కరించనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో స్వాతంత్య్ర పోరాటం సాగించిన తీరుతో కేసీఆర్ నిరాహార దీక్షను పోలుస్తూ మేకర్స్ ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్లు చెబుతున్నారు. ఓయ్ సినిమాతో గుర్తింపు పొందిన ఆనంద్ రంగ దర్శకత్వం వహించడం మరో ప్రత్యేకత.
రాజకీయ ప్రచారానికి మించి.. చరిత్రపై చర్చకు అవకాశం..?
ఈ రెండు పరిణామాలను కలిపి చూస్తే ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురవుతోంది. సినిమా, వెబ్‌సిరీస్‌లు రాజకీయ పార్టీల చరిత్రను, నాయకుల వ్యక్తిత్వాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కొత్త వేదికలుగా మారుతున్నాయా అనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా యువతలో సినిమాలకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుంటే, తెరపై కనిపించే రాజకీయ నేపథ్యాలు ఆయా ఉద్యమాలపై ఆసక్తిని పెంచే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్‌కు సంబంధించిన రాజకీయ చరిత్ర ఇప్పుడు థియేటర్ల నుంచి ఓటీటీ, డాక్యుమెంటరీ వెబ్‌సిరీస్‌ల వరకు చర్చకు వస్తోంది. ప్రజాక్షేత్రంలో రాజకీయ పోరాటం ఒకవైపు కొనసాగుతుంటే, వినోద రంగంలో తెలంగాణ ఉద్యమ చరిత్రకు లభిస్తున్న ప్రాధాన్యం మరోవైపు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పరిణామాలు పార్టీకి ఎలాంటి రాజకీయ ప్రయోజనాన్ని కలిగిస్తాయన్నది కొన్నాళ్లు వేచి చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.



