Kangana Ranaut FIR: బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ మరోసారి పొలిటికల్ వివాదంలో చిక్కుకున్నారు. సోషల్‌ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పోలీస్‌ కేసుకు దారితీశాయి. గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారనే ఆరోపణలతో హిమాచల్‌ప్రదేశ్‌ పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రాజకీయ విమర్శల పేరుతో ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ ఫిర్యాదుదారు ఆరోపించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

నవంబర్‌ 10న వరుస పోస్టులు.. వివాదానికి అందుకే కారణం

రిటైర్డ్‌ కెప్టెన్‌ అతుల్‌ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవంబర్‌ 13న షిమ్లాలో పోలీసులు కేసు నమోదు చేశారు. నవంబర్‌ 10న కంగనా తన సోషల్‌ మీడియా ఖాతాలో వరుస పోస్టులు పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె కుమారులు సంజయ్‌ గాంధీ, రాజీవ్‌ గాంధీల మరణాలకు సంబంధించిన అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ముఖ్యంగా గాంధీ కుటుంబంలో చోటుచేసుకున్న వరుస విషాద సంఘటనలను రాజకీయ కోణంలో ప్రస్తావిస్తూ కంగనా చేసిన పోస్టులు ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలను కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సాధారణ రాజకీయ విమర్శల పరిధిని దాటి, ఒక కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఉన్నాయని ఫిర్యాదులో అభ్యంతరం వ్యక్తం చేశారు.

సోనియా గాంధీపై వ్యాఖ్యలతో మరింత దుమారం

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీని ఉద్దేశించి కంగనా చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి కారణమయ్యాయి. సోనియా గాంధీ రాసిన బిలాంగింగ్‌: జర్నీ ఆఫ్‌ లవ్‌ పుస్తకంలో సంజయ్ గాంధీ, మేనకా గాంధీ గురించి కీలక అంశాలను ప్రస్తావించారు. ఆ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. సోనియా గాంధీని మిస్టరీయిస్ ఫారిన్ నేషనల్ కామెంట్ చేశారు. దీంతో కంగనా మిస్టీరియస్‌ ఫారిన్‌ నేషనల్‌గా అభివర్ణించడంపై ఫిర్యాదుదారు అభ్యంతరం తెలిపారు. గాంధీ కుటుంబంలో వరుస మరణాల తర్వాత సోనియా గాంధీ అధికార పగ్గాలు చేపట్టేలా పరిణామాలు సాగాయన్న భావన కలిగించేలా పోస్టులు ఉన్నాయని ఆరోపించారు. ఈ కథనానికి కంగనా జత చేసిన హౌ కన్వీనియెంట్‌ వ్యాఖ్య కూడా వివాదాన్ని మరింత పెంచిందని పేర్కొన్నారు.

మేనకా గాంధీ ప్రస్తావనపైనా అభ్యంతరం

సంజయ్‌ గాంధీ మరణం తర్వాత ఆయన భార్య మేనకా గాంధీని కుటుంబ నివాసం నుంచి బయటకు పంపించేశారంటూ కంగనా చేసిన వ్యాఖ్యను కూడా అతుల్‌ శర్మ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఇలాంటి పోస్టుల ద్వారా చారిత్రక సంఘటనలను వక్రీకరించి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. రాజకీయ విభేదాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉన్నప్పటికీ, అవి సమాజంలో విద్వేషాలు పెంచేలా ఉండకూడదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన షిమ్లా పోలీసులు BNSలోని సెక్షన్లు 196(1)(B), 353(2), 356(2) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ వారం ప్రారంభంలోనూ కంగనా సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పలు వ్యాఖ్యలు చేశారు. వివాహం అనంతరం 1983లో ఆమె భారత పౌరసత్వం స్వీకరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రశ్నలు లేవనెత్తారు. వరుసగా గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కంగనా చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి. తాజా ఎఫ్‌ఐఆర్‌తో ఈ వివాదం మరో మలుపు తిరిగింది.