ఢిల్లీలో సీఎం రేవంత్.. హైదరాబాద్‌కి అమిత్ షా
Amit Shah Hyderabad Rally: కేంద్రహోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే పాదయాత్రను లక్షమందితో చేయాని కమలం నేతలు భావిస్తున్నారు.

Amit Shah Hyderabad Rally: తెలంగాణలో రాజకీయాలు ఇప్పుడు హాట్‌హాట్‌గా మారాయి. SIRకు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నినాదంతో ఈ సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అదే సమయంలో ఇండియా కూటమికి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బలప్రదర్శనకు కమలం పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ‘లోక్తంత్ర బచావో.. అరాచకతా హటావో’ పేరుతో బీజేపీ (BJP) కార్యక్రమానికి రూపకల్పన చేసింది. నవంబర్ 1న ఢిల్లీలో ఇండియా కూటమి ర్యాలీ ముగిసిన మరుసటి రోజు, అంటే నవంబర్ 2న, హైదరాబాద్ కేంద్రంగా అమిత్ షా (Amit Shah) భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు. మరోవైపు, ఢిల్లీలో జరిగే ర్యాలీకి హాజరయ్యేందుకు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు.
లక్ష మందితో పాదయాత్ర చేయనున్న అమిత్ షా
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వేదికగా అమిత్ షా (Amit Shah) పాదయాత్ర చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ (BJP) నేతలు ముమ్మరం చేశారు. ట్యాంక్‌బండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించనున్న ఈ పాదయాత్రకు తెలంగాణవ్యాప్తంగా ఉన్న బీజేపీ నేతలను హైదరాబాద్‌కు రప్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇండియా కూటమికి వ్యతిరేకంగా హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ నిరసన ర్యాలీని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందికి తగ్గకుండా జనసమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, తెలంగాణలోని అన్ని జిల్లాల నేతలకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అమిత్ షా (Amit Shah) ఢిల్లీలోనే ఉంటారని, ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనరంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు బీజేపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు చేసే విమర్శలకు అమిత్ షా ఏ విధంగా స్పందిస్తారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అమిత్ షా (Amit Shah) నేరుగా హైదరాబాద్ (Hyderabad) వీధుల్లోకి వచ్చి పాదయాత్ర నిర్వహించడం ద్వారా రాష్ట్రంలోని బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా, జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈ పాదయాత్ర పార్టీకి రాజకీయంగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు హైదరాబాద్‌ను టార్గెట్..?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించే కార్యక్రమానికి ధీటుగా బలప్రదర్శన చేయాలంటే హైదరాబాద్ కీలకమని బీజేపీ అధిష్ఠానం భావించినట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం అమిత్ షా (Amit Shah) నేతృత్వంలో జరిగిన బీజేపీ ఉన్నతస్థాయి సమావేశంలో హైదరాబాద్ (Hyderabad) కేంద్రంగా కార్యక్రమం నిర్వహిస్తే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని నేతలు చర్చించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే నగరం నడిబొడ్డున అమిత్ షా పాదయాత్ర నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో సీఎం రేవంత్‌రెడ్డి SIRతో పాటు కేంద్ర ప్రభుత్వంపై విమర్శల తీవ్రతను పెంచారు. ఈ విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చేందుకు హైదరాబాద్‌ను వేదికగా చేసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో భారీ కార్యక్రమం నిర్వహించడం ద్వారా రాజకీయంగా మైలేజ్ పొందవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంలో భాగంగానే హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
బీజేపీ కీలక నేతలతో అమిత్ షా సమావేశం
తెలంగాణలో బీజేపీ నూతన కార్యవర్గం ఏర్పాటైన తర్వాత అమిత్ షా తొలిసారిగా రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో కీలక బీజేపీ నేతలతో సమావేశం కావడానికి అమిత్ షా (Amit Shah) పర్యటన ఖరారైనప్పటికీ, కొన్ని అనివార్య కారణాలతో ఆ పర్యటన రద్దయింది. ఇప్పుడు నవంబర్ 2న పాదయాత్ర ముగిసిన అనంతరం ఓ ప్రైవేట్ హోటల్లో నూతన కార్యవర్గంతో అమిత్ షా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో తెలంగాణలో బీజేపీని (BJP) అధికారంలోకి తీసుకురావడంతో పాటు, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పలు కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్న నేపథ్యంలో, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చే నేతలకు అవకాశాలు కల్పించే అంశంపైనా రాష్ట్ర నాయకత్వానికి మార్గనిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీలో మూడు రోజుల పాటు కీలక సమావేశాలు..!
సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) గురువారం నుంచి సోమవారం వరకు ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం. ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందని, రాష్ట్రానికి కేంద్రం నుంచి సాయం అందించాలని కోరుతూ పలువురు కేంద్రమంత్రులను ముఖ్యమంత్రి కలవనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పార్టీకి సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానంతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగే ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొననున్నారు. ఒకవైపు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఢిల్లీలో ఇండియా కూటమి కార్యక్రమాల్లో పాల్గొంటుండగా, మరోవైపు అమిత్ షా హైదరాబాద్‌లో భారీ పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలు తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడిని పెంచుతున్నాయి. ఈ రెండు కార్యక్రమాలు తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.



