Indian Army Social Media Restrictions

దేశ భద్రత విషయంలో భారత సైన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సైనికుల సోషల్ మీడియా వినియోగంపై కఠినమైన ఆంక్షలు అమలు చేస్తోంది. ముఖ్యంగా సైనిక రహస్యాలు బయటకు పొక్కకుండా, విదేశీ నిఘా సంస్థల హనీట్రాప్‌లు, సైబర్ ముప్పుల నుంచి సిబ్బందిని కాపాడేందుకు చర్యలు చేపడుతోంది. హనీట్రాప్‌లు, సైబర్ దాడులకు చెక్  పెడుతోంది. గతంలో పలువురు రక్షణ రంగ సిబ్బంది సోషల్ మీడియా ద్వారా విదేశీ నిఘా సంస్థల వలలో చిక్కుకున్న ఘటనలు భద్రతా సంస్థలను ఆందోళనకు గురిచేశాయి. నకిలీ సోషల్ మీడియా ఖాతాలతో(Indian Army Social Media Restrictions ) పరిచయాలు పెంచుకోవడం, వ్యక్తిగత వివరాలు సేకరించడం, ఆ తర్వాత సున్నితమైన సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నించడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. సైనికుల పోస్టులు, ఫొటోలు, లొకేషన్ వివరాలు, విధులకు సంబంధించిన సమాచారం శత్రు దేశాల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే అనుమానాస్పద వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, తెలియని లింకులు, అనధికార యాప్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైనికులకు సూచిస్తున్నారు.

చూడవచ్చు.. నో పోస్ట్ంగ్
అయితే ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, హింజ్, పబ్‌జీ వంటి యాప్‌లపై గతంలో విధించిన ఆంక్షలను ప్రస్తుత నిబంధనలతో కలిపి చూడకూండా.. కొన్ని ప్లాట్‌ఫామ్‌ల వినియోగానికి పరిమిత అనుమతులు కల్పించింది. గతంలో 2020లో భారత సైన్యం తన సిబ్బంది స్మార్ట్‌ఫోన్ల నుంచి 89 యాప్‌లను తొలగించాలని ఆదేశించింది. ఈ జాబితాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, పబ్‌జీ, హింజ్ వంటి యాప్‌లు కూడా ఉన్నాయి. 2025 డిసెంబర్‌లో భారత సైన్యం సోషల్ మీడియా విధానంలో మార్పులు తీసుకొచ్చింది. తాజా మార్గదర్శకాల ప్రకారం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్), కొరా వంటి ప్లాట్‌ఫామ్‌లను సమాచారం తెలుసుకోవడానికి, కంటెంట్‌ను వీక్షించడానికి మాత్రమే ఉపయోగించుకునేలా ఆంక్షలు విధించింది. ఈ ప్లాట్‌ఫామ్‌లలో సైనికులు స్వయంగా పోస్టులు పెట్టడం, కామెంట్లు చేయడం, లైక్ చేయడం, కంటెంట్ షేర్ చేయడం, మెసేజ్‌లు పంపడం వంటి కార్యకలాపాలకు అనుమతి లేదు. అంటే సోషల్ మీడియాను(Indian Army Social Media Restrictions ) చూడవచ్చుగానీ, అందులో చురుగ్గా పాల్గొనడానికి వీల్లేదని తెలిపింది.

వాట్సాప్,టెలిగ్రామ్‌లో నిబంధనలు
సైనికులకు వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్కైప్ వంటి కమ్యూనికేషన్ యాప్‌ల వినియోగానికి పరిమిత అనుమతి ఉంది. అయితే వీటి ద్వారా సాధారణ, రహస్యేతర సమాచారాన్ని మాత్రమే పంపుకోవాలి. తెలిసిన వ్యక్తులతో మాత్రమే సమాచారాన్ని పంచుకోవాలి. సందేశం అందుకునే వ్యక్తి ఎవరనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన బాధ్యత కూడా సైనికులపైనే ఉంటుంది. అదేవిధంగా లింక్డ్‌ఇన్‌ను ఉద్యోగ అవకాశాల సమాచారం తెలుసుకోవడానికి, రెజ్యూమ్ అప్‌లోడ్ చేయడానికి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. సోషల్ మీడియా(Indian Army Social Media Restrictions ) భద్రత విషయంలో సైనికులకే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. సైనిక స్థావరాలు, క్యాంపులు, సైనిక కార్యకలాపాలు, యూనిఫాంలో ఉన్న సిబ్బందికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బహిరంగంగా పోస్టు చేయవద్దని సూచిస్తున్నారు.అందుకే సోషల్ మీడియాను పూర్తిగా దూరం చేయడం కంటే, ఏ యాప్‌ను ఎలా ఉపయోగించాలి? ఎలాంటి సమాచారం పంచుకోకూడదు? అనే అంశాలపై స్పష్టమైన నిబంధనలు అమలు చేస్తోంది. దేశ రక్షణలో కీలక బాధ్యతలు నిర్వహించే సైనికుల డిజిటల్ కార్యకలాపాలు కూడా ఇప్పుడు భద్రతా వ్యవస్థలో ముఖ్యమైన భాగంగా మారాయి.