Digital Cloning Cyber Crime: పొద్దున్న ఆఫీస్‌కు బయలుదేరిన నాగార్జున మియాపూర్‌ నుంచి హైటెక్‌ సిటీకి మెట్రో ఎక్కాడు. మధ్యాహ్నం డ్యూటీ కావడంతో మెట్రోలో సీటు దొరికింది. పక్కనే కూర్చున్న 70 ఏళ్ల వృద్ధుడు ఆప్యాయంగా పలకరించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఆయన.. వెంటనే జేబులో నుంచి ఫోన్‌ తీసి, ‘‘బాబూ.. నా ఫోన్‌లో ఎప్పటి నుంచో ఓ చిన్న సమస్య ఉంది. దాన్ని కొంచెం చూడగలవా?’’ అంటూ నాగార్జునకు ఇచ్చాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కావడంతో నాగార్జున వెంటనే ఫోన్‌ అందుకున్నాడు. తనకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానంతో నాలుగు నిమిషాల్లో సమస్యను పరిష్కరించాడు. పెద్దాయన థ్యాంక్స్‌ చెప్పడంతో సంబరపడిపోయిన నాగార్జున నేరుగా ఆఫీస్‌కు వెళ్లాడు. ‘‘ఈ రోజు మెట్రోలో ఓ పెద్దాయన ఫోన్‌లో ఉన్న సమస్యను తీర్చేశా’’ అంటూ స్నేహితులు, తోటి ఉద్యోగులతో తన అనుభవాన్ని పంచుకున్నాడు.

రెండు గంటల మెసేజ్.. ఒక్కసారిగా షాక్..!

అయితే.. రెండు గంటల తర్వాత నాగార్జున ఫోన్‌కు ఓ సందేశం వచ్చింది. తన పేరు మీద ఓ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి రూ.5 లక్షల రుణం మంజూరైనట్లు అందులో ఉంది. ఆ మెసేజ్‌ చూడగానే అతను హడలిపోయాడు. వెంటనే సదరు సంస్థ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించి, తాను ఎలాంటి రుణం తీసుకోలేదని చెప్పాడు. రుణం ఎప్పుడు మంజూరైందని ఆరా తీయగా.. అదే రోజు మధ్యాహ్నం అని సమాధానం వచ్చింది. ఆ సమయంలో తాను ఎక్కడ ఉన్నాడో గుర్తు చేసుకున్న నాగార్జునకు మెట్రోలో 70 ఏళ్ల వృద్ధుడికి సాయం చేసిన విషయం గుర్తొచ్చింది. అసలు తన పేరు మీద రుణం ఎలా మంజూరైందన్నది అతనికి అంతుచిక్కలేదు. ఒక చిన్న సాయం వెనుక ఏదైనా సైబర్‌ మోసం దాగి ఉందా..(Digital Fraud) తన వ్యక్తిగత వివరాలు దుర్వినియోగమయ్యాయా..? అన్న ఆందోళన మొదలైంది. అయ్యో చిన్న సాయం వల్ల తాను ఐదు లక్షలు పొగొట్టుకున్నట్లు కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఫేస్‌, వ్యక్తిగత వివరాలతో మీ పేరుతో లోన్..?

ఏఐ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత సైబర్‌ నేరగాళ్లు మోసాలకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. వ్యక్తుల ఫొటోలు, వీడియోలు, స్వర నమూనాలు, వ్యక్తిగత గుర్తింపు వివరాలను దుర్వినియోగం చేసి నకిలీ ప్రొఫైళ్లు సృష్టించడం, ఇతరుల పేరుతో పరిచయస్తులను మోసం చేయడం వంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నకిలీ గుర్తింపు వివరాలతో ఆర్థిక సేవలను పొందేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్‌ క్లోనింగ్‌ అనే అంశంపై ప్రజల్లో అవగాహన అవసరం. ఒక వ్యక్తికి సంబంధించిన డిజిటల్‌ సమాచారాన్ని ఉపయోగించి అతని గుర్తింపును అనుకరించడం లేదా నకిలీ డిజిటల్‌ రూపాన్ని సృష్టించడాన్ని విస్తృత అర్థంలో డిజిటల్‌ క్లోనింగ్‌గా చెప్పవచ్చు. కొంతమంది నేరగాళ్లు (Digital Fraud) ఫోన్‌ సమస్యను పరిష్కరిస్తామని నమ్మించి, అనుమానాస్పద యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేయించే ప్రయత్నం చేస్తారు. మరికొందరు స్క్రీన్‌ షేరింగ్‌ యాప్‌లు, నకిలీ లింకులు, ఓటీపీలు, వ్యక్తిగత వివరాల ద్వారా బాధితుల ఖాతాలు లేదా సమాచారాన్ని లక్ష్యంగా చేసుకుంటారు. ఫోన్‌లోకి అనధికారికంగా ప్రవేశం పొందగలిగితే, అందులో కనిపించే సందేశాలు, వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాలు ప్రమాదంలో పడవచ్చు.

లోన్‌ తీసుకోకపోయినా.. మీ పేరుతో లోన్‌ వస్తే..?

మీరు ఎలాంటి రుణం తీసుకోకపోయినా, మీ పేరుతో రుణం మంజూరైనట్లు సందేశం వచ్చినా లేదా రుణ చెల్లింపుల కోసం ఫోన్‌ కాల్స్‌ వస్తున్నా నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే సంబంధిత ఆర్థిక సంస్థ అధికారిక కస్టమర్‌ కేర్‌ను సంప్రదించి, రుణ దరఖాస్తు వివరాలు, దరఖాస్తు తేదీ, ఉపయోగించిన మొబైల్‌ నంబర్‌, ధ్రువీకరణ విధానం, రుణ ఒప్పందం వంటి వివరాలను కోరాలి. అలాగే మీ పేరుతో ఏవైనా ఇతర రుణాలు లేదా క్రెడిట్‌ ఖాతాలు తెరిచారా అనే విషయాన్ని గుర్తింపు పొందిన క్రెడిట్‌ సమాచార సంస్థ ద్వారా పరిశీలించడం ఉపయోగకరం. మీ అనుమతి లేకుండా రుణం తీసుకున్నట్లు అనుమానం ఉంటే, ఆర్థిక సంస్థకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి, దాని రసీదు లేదా ఫిర్యాదు సంఖ్యను భద్రపరచుకోవాలి.

మెట్రో, బస్సుల్లో బీకేర్‌ ఫుల్ ఫ్రెండ్స్..!

ప్రజా రవాణా వాహనాలు, మెట్రో స్టేషన్లు, (METRO RAIL) రద్దీ ప్రాంతాల్లో అపరిచితులు ఫోన్‌లో సమస్య ఉందని చెప్పి సాయం కోరినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సాయం చేయడం తప్పు కాదు. కానీ సాయం చేసే విధానం సురక్షితంగా ఉండాలి. అపరిచితుల ఫోన్‌ను తీసుకుని బ్యాంకింగ్‌, రుణాలు లేదా వ్యక్తిగత వివరాలకు సంబంధించిన యాప్‌లను తెరవకండి. ఓటీపీలు, యూపీఐ పిన్‌లు, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఫోన్‌లోని సెట్టింగులు లేదా యాప్‌లను మార్చాల్సి వస్తే, ఫోన్‌ యజమాని సమక్షంలోనే చేయండి. అనుమానాస్పద చర్యలు కనిపిస్తే వెంటనే ఆపేయండి. యాప్‌లు కోరే అనుమతులను పరిశీలించండి. సైబర్‌ మోసానికి గురైతే జాతీయ సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ 1930కు వెంటనే ఫోన్‌ చేయాలి. అలాగే జాతీయ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ దానిని దుర్వినియోగం చేసే మార్గాలు కూడా మారుతున్నాయి. మనుషుల మంచితనాన్ని, సహాయం చేసే స్వభావాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంది. అదే సమయంలో, ప్రతి అపరిచితుడిని అనుమానించాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా, సురక్షితంగా సాయం చేయడం నేర్చుకోవాలి.